బడ్జెట్‌... మొబైల్‌ యాప్‌లో

ABN , First Publish Date - 2021-01-24T07:38:35+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో శనివారం జరిగిన హల్వా వేడుకతో బడ్జెట్‌ పత్రాల కూర్పు మొదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో పాటు మంత్రిత్వ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...

బడ్జెట్‌... మొబైల్‌ యాప్‌లో

  • కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి ముద్రణకు స్వస్తి 
  • హల్వా వేడుకతో మొదలైన బడ్జెట్‌ పత్రాల కూర్పు
  • ఎంపీలకు ఎలకా్ట్రనిక్‌ రూపంలో డాక్యుమెంట్లు 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో శనివారం జరిగిన హల్వా వేడుకతో బడ్జెట్‌ పత్రాల కూర్పు మొదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో పాటు మంత్రిత్వ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి యేటా హల్వా వేడుకతో బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభమవుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌ డాక్యుమెంట్లను ముద్రించడం లేదు. పార్లమెంట్‌ సభ్యుల (ఎంపీ)కు ఈసారి బడ్జెట్‌ పత్రులను ఎలకా్ట్రనిక్‌ రూపంలో అందించనున్నారు.


భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వార్షిక బడ్జెట్‌ పత్రాలను ముద్రించకపోవడం ఇదే తొలిసారి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.  కాగా హల్వా వేడుకలో భాగంగా ఆర్థిక మంత్రి సీతారామన్‌.. కేంద్ర బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ను విడుదల చేశారు. పార్లమెంట్‌ సభ్యులతో పాటు సాధారణ ప్రజానీకం సైతం ఈ యాప్‌ ద్వారా బడ్జెట్‌ పత్రులను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో బడ్జెట్‌కు చెందిన మొత్తం 14 డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లో డౌన్‌లోడింగ్‌, ప్రింటింగ్‌, సెర్చ్‌, జూమ్‌ ఇన్‌, జూమ్‌ అవుట్‌, బైడైరెక్షనల్‌ స్ర్కోలింగ్‌, విషయ సూచిక, తదితర ఫీచర్లుంటాయి. యూనియన్‌ బడ్జెట్‌ వెబ్‌ పోర్టల్‌ (www.indiabudget.gov.in) ద్వారానూ ఈ యాప్‌ను డౌన్‌లోన్‌ చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల డిపార్ట్‌మెంట్‌ (డీఈఏ) ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. వచ్చే నెల 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాత యాప్‌లో బడ్జెట్‌ డాక్యుమెంట్లు అందుబాటులోకి వస్తాయి. 


Updated Date - 2021-01-24T07:38:35+05:30 IST