వైద్య రంగంలో విప్లవం తెచ్చాం

ABN , First Publish Date - 2021-11-26T08:51:44+05:30 IST

వైద్య రంగంలో విప్లవం తెచ్చాం

వైద్య రంగంలో విప్లవం తెచ్చాం

ఆరోగ్యశ్రీలో రూ.12 లక్షల వరకూ ఇస్తున్నాం

2,466 వ్యాధులను ఈ పథకంలోకి తెచ్చాం

5 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారినీ అర్హులు చేశాం

కొత్తగా 18 బోధనాస్పత్రులు

25 వేల ఉద్యోగాలు నింపాం

మరో 14,788 భర్తీ చేస్తాం

గ్రామీణ ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్‌ ఉండేలా విధానం

శాసనసభలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటన


అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘ప్రజల ప్రాణాలకు విలువనిచ్చే మనసున్న ప్రభుత్వం మాది. అందుకే  వైద్య రంగంలో విప్లవమే తెచ్చాం. ఆరోగ్యశ్రీలో గతంలో 1059 వ్యాధులే కవర్‌ అయ్యేవి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని 2466కు పెంచాం. మధ్యతరగతి వారిని కూడా ఈ పథకంలోకి తెచ్చేందుకు ఏడాదికి రూ.5లక్షల ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ కార్డులిచ్చాం. రూ.12లక్షల వరకూ ఖర్చయ్యే వ్యాధులనూ పథకంలోకి తెచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ రాష్ట్రంలో 11 బోఽధనాసుపత్రులు ఉంటే.. మేం కొత్తగా 18 బోధనాసుపత్రులు నిర్మిస్తున్నాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలోను ఇద్దరు డాక్టర్లుండేలా విధానం తెస్తున్నాం. ఒక డాక్టరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంటే ఇంకో డాక్టరు మొబైల్‌ క్లినిక్‌లో ఉంటారు. ఆ డాక్టరు తన పరిధిలోని నాలుగైదు గ్రామాలకు నెలకు నాలుగైదు సార్లు వెళ్లాడు. అంటే అతను బాధితులకు ఒక ఫ్యామిలీ డాక్టర్‌లా ఉంటాడు. దీనికోసం కొత్తగా 462 వాహనాలు కొనుగోలు చేస్తున్నాం. ఇవన్నీ ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. వైద్య శాఖపై గురువారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ‘నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల స్వరూపం మార్చేశాం. మౌలిక సదుపాయాల కోసం రూ.16,255 కోట్లు ఖర్చు చేశాం. వైద్యరంగంలో 25వేల ఉద్యోగాల్ని భర్తీచేశాం. వచ్చే ఫిబ్రవరిలో మరో 14,788 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులు వాడితే జబ్బులు తగ్గవేమో అనే భయం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఉన్న మందులనే ప్రభుత్వాసుపత్రుల్లో ఇస్తున్నాం. 10,032 విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. కంటి వెలుగు పథకంలో 66 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి, 1.5లక్షల మందికి కంటి అద్దాలు, 300 మందికి శస్త్ర చికిత్సలు చేశాం. వృద్ధులకు కూడా కంటిపరీక్షలు చేసి, 1,13,000 మందికి శస్త్రచికిత్సలు చేశాం. పిల్లలకు గుండె వైద్యం కోసం ఇటీవలే తిరుపతిలో ప్రత్యేక ఆసుపత్రి ప్రారంభించాం. మరో మూడు ఏర్పాటు చేస్తాం’ అని సీఎం చెప్పారు. 


కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన తొలి రాష్ట్రం మనదే

కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేని సీఎం జగన్‌ చెప్పారు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో అందరికీ ఒక డోస్‌, వచ్చే మార్చి నాటికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తామన్నారు. కోవిడ్‌ వల్ల తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు పెంచేందుకు రూ.100కోట్లకు మించి పెట్టుబడి పెట్టే కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఉచితంగా భూమి ఇస్తామని, వారు 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి కేటాయించాలని ముఖ్యమంత్రి తెలిపారు.


రుయా ఘటనలు పునరావృతం కానివ్వం: ఆళ్ల నాని

రుయా వంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కానివ్వబోమని వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు. శాసనసభలో గురువారం వైద్యరంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం తప్పులేకపోయినా అలాంటి సంఘటనలు జరిగాయి. అది బాధాకరం. అందుకే కేంద్రం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకున్నా థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం. 50పడకలు దాటిన ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆక్సిజన్‌ సమస్యను అధిగమించేందుకు క్రయోజనిక్‌ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నాం’ అని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 679 పీహెచ్‌సీలు, 535 అర్బన్‌ పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


Updated Date - 2021-11-26T08:51:44+05:30 IST