ఎన్నారై డెస్క్: బ్రిటన్‌కు చెందిన ఓ మహిళా ట్రెయినీ(Trainee pilot) పైలట్ దోమ కుట్టడం వల్ల అనూహ్యంగా మరణించింది. దోమకాటు(Mosquito bite) కారణంగా శరీరంలో తలెత్తిన ఇన్ఫెక్షన్ మెదడుకు పాకడంతో ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బీబీసీ కథనం ప్రకారం.. ఓరియానా పెప్పర్ అనే ట్రెయినీ పైలట్ గతేడాది జులైలో బెల్జియంలో మరణించింది. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తు నివేదిక తాజాగా బయటపడింది. దీని ప్రకారం.. దోమకాటు కారణంగా ఆమె కుడి కంటికి పైన కొద్దిగా వాపు కనిపించింది. వెంటనే ఓరియానా బాయ్‌ఫ్రెండ్ ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపించారు. కానీ.. ఆ తరువాత రెండు రోజులకు ఆమె అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఆ తరువాత పరిస్థితి మరింతగా దిగజారడంతో ఓరియానా మరణించింది. ఇన్ఫెక్షన్ కారణంగా మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
ఇది చాలా అసాధారణమని ఆమెకు చికిత్స చేసిన ఓ డాక్టర్ తెలిపారు. బంగారు భవిష్యత్తు ఉన్న ఆమె ఇలా మరణించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఓరియానా మరణంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది. ‘‘తన కలలను సాకారం చేసుకునే దిశగా ఆమె అడుగులు వేస్తోంది. తన మనసుకు నచ్చిన వాడు ఆమె వెంటనే ఉన్నాడు. నా కూతురుకు పైలట్ అవ్వాలనేది చిన్ననాటి కల. కానీ ఇంతలోనే ఆమె మాకు దూరమైపోయింది’’ అంటూ ఓరియానా తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి