మారిన బ్రిటన్‌ – మారని భారత్‌!

ABN , First Publish Date - 2022-08-20T06:13:11+05:30 IST

ఇప్పుడు మన దేశంలో రెండు అంశాలపై చర్చ జరుగుతోంది. అందులో ఒకటి- బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరిని ఎంపిక చేసుకోవాలనే..

మారిన బ్రిటన్‌ – మారని భారత్‌!

ఇప్పుడు మన దేశంలో రెండు అంశాలపై చర్చ జరుగుతోంది. అందులో ఒకటి- బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విషయమై అధికార కన్సర్వేటివ్ పార్టీలో కొనసాగుతోన్న అంతర్గత ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ గెలుస్తారా లేదా? అన్నది. భారత్ దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటన్‌కు వలస దేశంగా ఉన్నది. శ్వేతజాతీయుల వ్యవహారశైలి ఎట్లా ఉంటుందనేది భారతీయులకు అనుభవమే. వలస రాజ్యాల ప్రజలు, ఐర్లాండ్ వారు, నల్లజాతి వారు, కుక్కలు లోపలికి ప్రవేశించడానికి అనుమతి లేదు అని అక్కడి బ్రిటన్ లోని క్లబ్‌ల ముందు బోర్డులు ఉండేవన్నది ఆ దేశంలో స్థిరపడిన పలు తరాల భారతీయుల అనుభవం. మరి అలాంటి దేశానికి వలస రాజ్యంగా ఉన్న భారత్‌కు చెందిన భారతీయ సంతతి వ్యక్తిని ప్రధానమంత్రిని కానిస్తారా? అసలు, ప్రధానమంత్రి పదవికే పోటీ చేసేంత ధైర్యం సునాక్‌కు ఎక్కడి నుంచి వచ్చింది?


రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించిన తరువాత బ్రిటిష్ ప్రజలు మారారు. వారి ఆలోచన ధోరణీ, మానసిక ప్రవృత్తీ మారింది. హక్కులు, సమానత్వం వంటి అంశాలను వారు పుస్తకాల్లో చదువుకుని వదిలేయలేదు, ఆచరణలో పెట్టారు. అందుకే అక్కడ రిషి సునాక్‌కు ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశం కలిగింది. తన విధానాలను, ఆలోచనలను ఆ దేశ జనంతో పంచుకునే సదవకాశం దక్కింది. అక్కడి ప్రజల్లో పూర్వపు శ్వేతజాతి అహంకారపు ఘీంకారాలు ఇప్పుడు లేవు. సునాక్ తమ దేశ పౌరుడయ్యాడు, ఈ దేశం కోసం పనిచేస్తానని అంటున్నాడు కాబట్టి ఈయన తమ వాడే అని బ్రిటిషర్లు భావిస్తున్నారు. బ్రిటన్ పౌరులలో అత్యధికులు సునాక్ ఆర్థిక విధానాలు బావున్నాయని అంటున్నారు. అంతే కాదు, రంగును బట్టి, దేశాన్ని బట్టి ఇక్కడ తేడాలు ఉండవు, అంతా ఒక్కటే అనే భావనను మెజార్టీ ప్రజలు వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటిష్ మీడియా సంస్థలు చెప్తున్నాయి.


ఇక రెండో అంశం- రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక గ్రామీణ పాఠశాలలో టీచర్లకు ఉద్దేశించిన కుండలోని నీళ్లు తాగాడని ఇంద్రకుమార్ మేఘవాల్ అనే దళిత విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టి, చంపిన దారుణ ఘటన. దీనిపై మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రాజస్థాన్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ బ్రిటిషర్లు తాము మారామని చెప్తున్నారు. ఇక్కడ భారతీయులు సంప్రదాయ కుల ఉచ్చులో నుంచి తాము ఇంకా బయటకు రాలేదని నిరూపించుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు, అప్పులు వారసత్వంగా ఇస్తున్నట్లు... ఇక్కడ కులాన్నీ ఇస్తున్నారు. అమానుష కులభావన భారతీయుల బుర్రల నుంచి వైదొలగడం లేదు. తరాలకు తరాలు మారుతున్నా గుడిలో, బడిలో, బజారులో అంతటా కులం ఇంకా బలంగానే ఉంది. గుక్కెడు నీళ్ల కోసం ఆ పిల్లవాడు కుండను ముట్టుకున్నందుకు అతడి కుటుంబానికి పుట్టెడు దుఃఖం మిగిలింది. ఇంతటి అమానవీయతను ఈ దేశం ఇంకా ఎందుకు మోస్తున్నది? ఆక్సిజన్ కంటే కులం ముఖ్యం అనే భావన సదరు టీచర్‌లో ఉండబట్టే అతడలా వ్యవహరించాడు. సదరు టీచర్‌కు ఇంట్లోనూ, ఆయన చదువుకున్న బడిలోనూ సాటి మసుషులను గౌరవించాలనే ఇంగితం నేర్పకపోవడం, కుల భావ దాస్యం నుంచి బయట పడేసే బలమైన వ్యవస్థ లేకపోవడం వల్లనే ఆ ఉపాధ్యాయుడు జాతికి లజ్జాకరమైన దురాగతానికి పాల్పడ్డాడు. మనలో ఇంకా మధ్య యుగాల వాసనలు పోలేదనేందుకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తున్నది.


‘సజీవంగా సమాధుల్లో బతుకుతున్న వాళ్లం. ఆ పరమేశ్వరుడే మా కోసం అమ్మను (సావిత్రీబాయిని) మా వద్దకు పంపించాడు. గొడ్డు కన్నా హీనంగా చూస్తున్న సమాజంలో గౌరవంగా బతికేందుకు, మేము మనుష్యులమేననే గుర్తింపునిచ్చింది అమ్మ’ అని ఓ మాతంగ బాలిక మరాఠీలో రాసింది. ఈ మాటలు ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందువి. దాదాపు రెండు శతాబ్దాల తరువాత కూడా ఆమె నాడు రాసిన మాటలే... భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ కాస్త అటు ఇటుగా ఇప్పటికీ విన్పిస్తూనే ఉన్నాయి. ఇది మన జాతికి అత్యంత వేదనా భరితం అన్న మాటతో ఏకీభవించని వారెవరైనా ఉన్నారా?


– -గోర్ల బుచ్చన్న, సీనియర్ జర్నలిస్ట్

Updated Date - 2022-08-20T06:13:11+05:30 IST