50వేలు ఇస్తేనే జాగా!

ABN , First Publish Date - 2020-06-05T09:55:19+05:30 IST

‘తక్కువ విలువ చేసే భూములను ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అంటగట్టారు! ఇదో భారీ భూకుంభకోణం’... ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ! అయితే... రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కొన్నామని, సదరు రైతుకు

50వేలు ఇస్తేనే జాగా!

  • పేదింటి స్థలాల దందాలో కొత్త కోణం!
  • భూ సేకరణ వ్యయం పేరిట వసూళ్లు
  • రైతుకు ప్రభుత్వం ఇచ్చేది చాలదంటూ
  • లబ్ధిదారులకూ వాటాలేస్తున్న నేతలు
  • రైతుకు ఇవ్వకుండా సొంత జేబుల్లోకి!
  • ఫిర్యాదు చేస్తే బెదిరింపులు, దాడులు
  • గోదావరి జిల్లాల్లో రచ్చ.. నేతల నిలదీత
  • తప్పు బయటపడకుండా లిస్టు గుట్టుగా
  • పంపిణీ దగ్గర పడేకొద్దీ పేదల్లో టెన్షన్‌


‘తక్కువ విలువ చేసే భూములను ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అంటగట్టారు! ఇదో భారీ భూకుంభకోణం’... ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ! అయితే... రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కొన్నామని, సదరు రైతుకు లబ్ధిదారులే అదనపు మొత్తం చెల్లించాలంటూ అధికార పార్టీ నేతలు కొన్ని చోట్ల కొత్త ‘స్కామ్‌’కు తెరలేపారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.35 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఇళ్ల స్థలాల పంపిణీలో కొందరు అధికార పార్టీ నేతలు కొత్త దందాకు తెరలేపారు. ‘రైతులకు న్యాయం’ పేరిట లబ్ధిదారుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు.  ఈ దందాలపై  స్వయంగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులే పెదవి విప్పుతున్నారు. విచారణ చేయాలంటూ సర్కారుకు ఫిర్యాదులు చేస్తుండటంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కుతోంది. ‘నవరత్నాల’ కింద 25 లక్షల మంది పేదలకు ఇంటిస్థలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 23.45 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. గత నెల 30 దాకా కొత్తగా ఇంటిస్థలాల దరఖాస్తులు పేదల నుంచి స్వీకరించారు. ఈనెల 15 కల్లా దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేయాలి. జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా ఇంటిస్థలాల పంపిణీ చేపడతామని సర్కారు ప్రకటించింది.  రాష్ట్రవ్యాప్తంగా 15,112 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. 14,400 ఎకరాల భూమిని తన పొజిషన్‌లోకి తీసుకొని ఇప్పటికే రూ.4340 కోట్ల భూ సేకరణ బిల్లులు చెల్లించింది.


వసూళ్ల దందా ఇలా.. 

గోదావరి జిల్లాల్లో భూముల రేట్లు చాలా ఎక్కువ. కాబట్టి, రైతులకు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోవడం లేదని, గ్రామస్థాయిలో న్యాయం చేసేందుకు లబ్ధిదారులుగా కొంత వాటా వేసుకోవాలన్న విధానాన్ని నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. తణుకు, ఆచ ంట, సిద్ధాంతం, దువ్వ తదితర ప్రాంతాల్లో ఎకరం రూ.50 లక్షలపైనే ధర ఉంటే.. ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు జరిపి రూ.35 లక్షల మేర చెల్లిస్తోందని... మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించాలని నేతలు కొత్త ఎత్తుగడను తెరపైకి తెచ్చారు. గ్రామస్థాయిలో ఎంపికయినవారిలో  కొందరి నుంచి 35 వేల నుంచి 50వేల మేర వసూళ్లు చేశారు. ఆ సొమ్మును నిజంగా రైతుకు ఇచ్చారా? అంటే అదీలేదు. వసూలయినవి పూర్తిగా నేతల జేబుల్లోకి వెళ్లాయి. ‘35 నుంచి 50 వేలు ఇస్తే సెంటున్నర స్థలం వస్తుంది. ఐదేళ్ల తర్వాత ఆ భూమిని అమ్ముకోవచ్చు. అదే సొంతంగా కొనాలంటే అయ్యేపనేనా? అందుకే భూసేకరణలో నష్టపోయిన రైతుకు అదనంగా ఆ సొమ్ము ఇద్దాం’ అంటూ ఓ నాయకుడు కొత్త బేరం తీసుకొచ్చారు. 


ఇది నిజమేనేమోననుకొని తాము సొమ్ము ఇచ్చామని, ఇంతవరకు లబ్ధిదారుల జాబితా పెట్టలేదని తణుకు మండలానికి చెందిన ఒక వ్యక్తి  గ్రామవేదికపై బహిరంగంగా వాపోయారు. దీంతో పెద్ద వివాదమే చెలరేగింది. మరోవైపు తమ నుంచి వసూలు చేసిన సొమ్ము రైతులకు చేరలేదన్న విషయం తెలిసిన లబ్ధిదారులు.. నేతలతో వాగ్వివాదానికి దిగిన ఉదంతం ఆచంట మండలంలో చోటుచేసుకుంది. మరో గ్రామంలోను ఇలాగే జరగడంతో ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. విచారణకు ఆర్‌డీవో వెళ్లేనాటికే వివాదాన్ని రాజకీయంగా సెటిల్‌ చేశారు. ఇది ఒకటో, రెండో గ్రామాలకు పరిమితం కాలేదని తేలింది. భారీగా  ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఈ వ్యవహారాలపై విచారణ చేపట్టాలంటూ వారు కలెక్టర్లను కోరారు. అడ్డగోలు పనులతో ప్రభుత్వ ప్రతిష్ఠ, ముఖ్యమంత్రి జగన్‌ సంకల్పాన్ని దెబ్బతీయవద్దు అంటూ నేతలకు విజ్ఞప్తిచేస్తూ ఓ ఎంపీ వీడియోనే విడుదల చేశారు.


జాబితాలో నా పేరు ఉందా?

ఇంటిస్థలాల లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తోంది. ఈ విషయంలో సంబంధిత అధికారులదే బాధ్యత అని పలుమార్లు సీసీఎల్‌ఏ ఆదేశించారు. కానీ ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరుల్లోని అనేక గ్రామాల్లో ఈ నియమం అమలు కావడం లేదు. దీని వెనుక కొందరు నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వసూళ్ల వ్యవహారం కారణంగా లిస్టులను బయటపెట్టకుండా ఒత్తిడి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి జాబితా బయటకొస్తే...సొమ్ములిచ్చి కూడా లిస్టులో పేరులేని వారు ఆందోళనకు దిగుతారు. అదే జరిగితే వసూళ్ల గుట్టు పూర్తిగా బయటకొస్తుంది. ఇది జరగకూడదనే నేతలు జాబితాలను ప్రదర్శించనీయకుండా అడ్డుకుంటున్నారని అధికారవర్గాలే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇప్పటి కైనా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని తమ నేతలు, కార్యకర్తలను నియంత్రించుకోవాలి. లేదంటే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమం అభాసుపాలవుతుంది’’ అని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-05T09:55:19+05:30 IST