‘ఎక్స్‌ప్రెస్‌’కు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-01-03T07:35:42+05:30 IST

‘ఎక్స్‌ప్రెస్‌’కు బ్రేక్‌

‘ఎక్స్‌ప్రెస్‌’కు బ్రేక్‌

బాలింతలను నడిమధ్యలో వదిలేశారు

డిశ్చార్జి తర్వాత ఉచితంగా ఇంటికి చేర్చే 

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలకు అంతరాయం

ఆరేళ్లుగా జీవీకే చేతిలో.. డిసెంబరు 31తో ముగిసిన గడువు

జిల్లాల్లోని వాహనాలు, డ్రైవర్లు వెనక్కి.. 

1 నుంచి సేవలందించాల్సిన అరబిందో

చివరి నిమిషంలో చేతులెత్తేసిన వైనం

అరబిందో కోసమే ఆరుసార్లు టెండర్లు!

సంస్థ తీరుతో అధికారుల్లో అయోమయం

పాత సంస్థకే తిరిగి తాత్కాలికంగా పగ్గాలు

అరబిందోపై చర్యల మాటేమిటి? 

ఆరోగ్య వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ


పండంటి బిడ్డతో డిశ్చార్జి అయిన తల్లిని సేఫ్‌గా ఇంటికి చేర్చే ఎక్స్‌ప్రెస్‌ వాహనం సంకటంలో పడింది. ఈ ఆరేళ్లలో వేలాదిమంది బాలింతలను గమ్యాలకు చేర్చిన ఈ వాహనం పరిస్థితే ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. గడువు ముగియగానే సర్వీసు సంస్థ తన వాహనాలను వెనక్కి తీసుకుంటే, టెండరు గెలిచిన సంస్థ చివరి నిమిషంలో హ్యాండ్‌ ఇవ్వడమే ఈ పరిస్థితికి కారణం! 


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

బాలింతల కోసం నిర్వహించే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరోగ్యశాఖలో రోగులు, గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే అనేక పథకాలను ఇప్పటికే జగన్‌ ప్రభుత్వం రద్దు చేసేసింది. ఇప్పుడు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వంతు వచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం తర్వాత ఒక్క రూపాయి భారం పడకుండా అత్యంత జాగ్రత్తగా బాలింతలను ఇంటికి చేర్చే పథకమిది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ‘తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాల సేవలను గత ఆరేళ్ల నుంచి జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ అందిస్తున్నది. వీటి నిర్వహణకు సంబంధించి సంస్థ టెండర్‌ గడువు డిసెంబరు నెలాఖరుతో ముగిసింది. కొత్తగా అరబిందో సంస్థ టెండర్‌ దక్కించుకుంది. కొత్త వాహనాలతో జనవరి ఒకటో తేదీ నుంచి ఈ సంస్థ సేవలు అందించాలి. చివరినిమిషంలో అరబిందో చేతులు ఎత్తేసింది. వాహనాలు అందుబాటులోకి రాలేదని చెబుతోంది. దీంతో మరో నెల రోజులపాటు సేవలు అందించేలా జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థకే  ప్రభుత్వం గడువు పొడిగించింది. అయితే జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ ఓ ప్రైవేటు వాహన కంపెనీ నుంచి వాహనాలను అద్దెకు తీసుకుని నడుపుతున్నది. ఈ రెండింటి మధ్య ఒప్పందం డిసెంబరు 31 నాటికి ముగియడంతో తనకున్న 279 వాహనాల్లో దాదాపు 70 వాహనాలను వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం కేవలం 209 వాహనాలు మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. 300 మంది డ్రైవర్లకు గాను కేవలం 200 మంది మాత్రమే డ్యూటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లోని బాలింతలను తరలించాలంటే ఇవి చాలవు. అయితే, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఉన్న వాహనాలతోనే సేవలు అందించాలని ఆదేశాలిస్తున్నారు. 


అరబిందోపై ఎంత ప్రేమో...!

తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల నిర్వహణ గడువు పూర్తయి, ఏడాదిపైనేకావస్తోంది. ప్రతి నెలా ఎప్పటికప్పుడు జీవీకే సంస్థకు సమయం పొడిగించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండర్‌ ప్రక్రియను కూడా గందరగోళంగా మార్చేశారు. కేవలం తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల టెండర్ల కోసం దాదాపు ఐదు నుంచి ఆరుసార్లు టెండర్లు రీ కాల్‌ చేశారు. కేవలం ఆరబిందో కంపెనీని ఎంపిక చేయడం...టెండర్‌ పిలవడం.. రద్దు చేయడం చేశారు. చివరికి ఆరబిందో కంపెనీ ఎల్‌1 రావడంతో వాహనాల నిర్వహణ బాధ్యత ఆ కంపెనీకి అప్పగించారు. ఆగ్రిమెంట్‌లో రాసుకున్న సమయానికి సరఫరాలు అందించకపోయినా, సర్వీసు ఇవ్వకపోయినా కంపెనీకి కంటి మీద కునుకు లేకుండా చేసేస్తారని ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం అధికారులకు పేరు. అవసరం అయితే ఆ కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేస్తారు. మరి ఆరబిందో విషయంలో ఏం చేస్తారనేది ఆరోగ్యశాఖ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి, టెండర్‌ ప్రక్రియ సమయంలోనే ఆరోగ్యశాఖ , ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు ఆరబిందోపై అత్యంత ప్రేమ చూపించారు. ఎల్‌1గా ఎంపికైన ఆరబిందో కంపెనీ ఇప్పటి వరకూ వాహనాలను క్షేత్రస్థాయికి చేర్చలేదు. కనీసం డ్రైవర్లను కూడా నియమించుకోలేదు. అయినా పట్టించుకోలేదు. చివరకు తాము ఇప్పుడే తల్లిబిడ్డ ఎక్‌ప్రెస్‌ సేవలు ప్రారంభించలేమని చేతులేత్తెయడంతో ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం అధికారులు గందరగోళంలోపడ్డారు.  ఇప్పటికే గడువు పూర్తి అయినా జీవీకే సంస్థ దాదాపు ఏడాదిపైగా వాహనాలను నిర్వహిస్తోంది. బాలింతల సేవలకు బ్రేక్‌ పడకూడదనే ఉద్దేశంతో కేవలం రూ.604కే తమ సేవలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎల్‌1 వచ్చిన ఆరబిందోకు ట్రిప్‌కు రూ.895 ఇచ్చేందుకు ఏపీఎంఎ్‌సఐడీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆరబిందో సంస్థకు పెనాల్టీలు విధిస్తారా... లేదా టెండర్‌ ప్రక్రియ మొత్తం రద్దు చేసి రీ-టెండర్‌కు వెళ్తారా అనేది ఆరోగ్యశాఖ వర్గాల్లో ఆసక్తి రేగుతోంది. 


ఏ జిల్లాలో ఎన్ని వెనక్కి.. 

విశాఖపట్నంలో డిసెంబర్‌ వరకూ 33 వాహనాలు నడిచేవి. వాటిలో 12 వాహనాలను జీవీకే సంస్థ వెనక్కి తెప్పించుకుంది. కేజీహెచ్‌, ఘోషా ఆస్పత్రి, అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో రెండేసి వాహనాలు, కె.కోటపాడు, చోడవరం, నక్కపల్లి, లోతుగడ్డల్లో ఒక్క వాహనం సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన బాలింతలు, శిశువులను ఇళ్లకు చేర్చడానికి కుటుంబసభ్యులు వందలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కాగా, ఇక కర్నూలు జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు 28 ఉన్నాయి. కర్నూలులో 6, ఆదోనిలో 4, నంద్యాల 5, ఎమ్మిగనూరులో 2, కోడుమూరులో 2, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, పత్తికొండ, ఆలూరు, శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు ఒక్కొక్క వాహనం ఉన్నాయి. వీటిలో 25 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. గడువు ముగిసి ఈ నెల 1 నుంచి జీవీకే సంస్థ తప్పుకోవడంతో వీరంతా  రోడ్డున పడ్డారు. కాగా, తూర్పుగోదావరిలో 30 వాహనాలకుగాను తొమ్మిది వాహనాలు వెనక్కి వచ్చేశాయి. ఇలా ప్రతి జిల్లాల్లో దాదాపు ఐదు వాహనాలపైనే వెనక్కి తీసుకుంది. వీటి స్థానంలో ఉన్న వాహనాలనే నడిపాలని ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఇంకా... శ్రీకాకుళంలో 15 వాహనాలకుగాను మూడు, విజయనగరంలో 17కుగాను ఐదు, పశ్చిమగోదావరి జిల్లాలో 17కుగాను ఐదు, కృష్ణా జిల్లాలో 16కు గాను ఐదు, గుంటూరులో 15కుగాను ఐదు, ప్రకాశం జిల్లాలో 13కుగాను ఐదు, కడపలో 13కుగాను ఆరు, నెల్లూరులో పదికిగాను మూడు, చిత్తూరులో 28కు గాను ఏడు, అనంతపురంలో 17కుగాను ఆరు. మరమ్మతు సమస్యలను మరో 38 వాహనాలు ఎదుర్కొంటున్నాయి. 

Updated Date - 2022-01-03T07:35:42+05:30 IST