నా కోచ్‌లను వేధిస్తున్నారు

ABN , First Publish Date - 2022-07-26T08:10:22+05:30 IST

మరో మూడు రోజుల్లో కామన్వెల్త్‌ క్రీడల ప్రారంభం కానున్న తరుణంలో భారత శిబిరంలో కలకలం రేగింది.

నా కోచ్‌లను వేధిస్తున్నారు

 కామన్వెల్త్‌ సన్నాహకాలకు ఆటంకం

బాక్సర్‌ లవ్లీనా సంచలన ఆరోపణలు

బర్మింగ్‌హామ్‌: మరో మూడు రోజుల్లో కామన్వెల్త్‌ క్రీడల ప్రారంభం కానున్న తరుణంలో భారత శిబిరంలో కలకలం రేగింది. తన కోచ్‌లను అధికారులు నిరంతరం వేధింపులకు గురి చేస్తున్నారని ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బాక్సర్‌ లవ్లీనా బోర్గొహైన్‌ సోమవారం సంచలన ఆరోపణలు చేసింది. ఐర్లాండ్‌లో శిక్షణ అనంతరం భారత బాక్సర్లు ఆదివారం రాత్రి క్రీడా గ్రామానికి చేరుకున్నారు. అయితే అక్రిడిటేషన్‌ లేకపోవడంతో లవ్లీనా వ్యక్తిగత కోచ్‌ సంధ్యా గురుంగ్‌కు క్రీడా గ్రామంలో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. వాస్తవంగా.. తన మరో వ్యక్తిగత కోచ్‌ అమే కోలేకర్‌ కూడా క్రీడల సందర్భంగా తనతో ఉండాలని లవ్లీనా భావించింది. కానీ భారీ బృందంలో కోలేకర్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో లవ్లీనా ట్విటర్‌లో తన ఆగ్రహం వెళ్లగక్కింది. ‘నేను ఒలింపిక్‌ పతకం గెలవడంలో కీలక పాత్ర పోషించిన నా కోచ్‌లను ఎప్పుడూ పక్కనపెడుతున్నారు. దాంతో నా సన్నాహకాలకు విఘాతం ఏర్పడుతోంది’ అని ట్వీట్‌ చేసింది. అయితే లవ్లీనా సమస్య పరిష్కారమవుతుందని భారత బాక్సింగ్‌ సమాఖ్య తెలిపింది.

Updated Date - 2022-07-26T08:10:22+05:30 IST