జగన్‌ తిట్లు భరించడం బొత్సకు అవసరమా?: దేవినేని

ABN , First Publish Date - 2020-02-16T23:36:21+05:30 IST

మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే ఎదురుతిరిగిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఇప్పుడు చేతులు కట్టుకు కూర్చున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవాచేశారు.

జగన్‌ తిట్లు భరించడం బొత్సకు అవసరమా?: దేవినేని

అమరావతి: మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే ఎదురుతిరిగిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఇప్పుడు చేతులు కట్టుకు కూర్చున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవాచేశారు. సీఎం జగన్‌ తిట్లు భరించడం బొత్సకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. సహచర మంత్రులు కూడా బొత్సను లెక్కచేయట్లేదన్నారు. ఎన్డీఏలో కలుస్తామన్న బొత్స మాట మారుస్తున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకాదని చెప్పారు. బొత్స.. ఆటలో అరటిపండులా మారాడని ఎద్దేవాచేశారు. జగన్‌ కేబినెట్‌లో బొత్సకు విలువలేకుండా పోయిందని, సీనియర్‌ మంత్రి బొత్స.. జగన్‌ ముందు చేతులు కట్టుకుంటున్నారని ఉమ తెలిపారు. మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, మీ పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. 


‘‘విదేశాల్లో జగన్‌ బ్యాచ్‌ పాపాలు బయటపడుతున్నాయి. సెర్బియాలో చేసిన అవినీతి ఇంటర్‌పోల్‌ ద్వారా బయటపడింది. కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీలో జగన్‌ కుప్పిగంతులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉంది. శాసనసభ, మండలిపై జగన్‌కు గౌరవం లేదు. సీఎస్‌ సంతకం లేకుండా కార్యాలయాలు తరలిస్తున్నారు. మీ పాపాలు హైకోర్టు ధర్మాసనం ముందు ఉన్నాయి. కోర్టులు, రాజ్యాంగం అంటే జగన్‌కు లెక్కలేదు’’ అని దేవినేని ఉమ దుయ్యబట్టారు.


Updated Date - 2020-02-16T23:36:21+05:30 IST