సరిగమలు... వివాదాస్పదనిసలు

ABN , First Publish Date - 2020-06-28T05:30:00+05:30 IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో హిందీ చిత్ర పరిశ్రమలోని లుకలుకలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆయన మరణం బాలీవుడ్‌లోని ఎన్నో చీకటి కోణాల్ని వెలికి తీస్తోంది...

సరిగమలు... వివాదాస్పదనిసలు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో హిందీ చిత్ర పరిశ్రమలోని లుకలుకలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.  ఆయన మరణం బాలీవుడ్‌లోని ఎన్నో చీకటి కోణాల్ని వెలికి తీస్తోంది.  బాలీవుడ్‌లోని  నెపోటిజం (బంధుప్రీతి), వివక్ష కోరల్లో చిక్కుకుని ఇంతకాలం  ఇబ్బంది పడిన వారు ఇప్పుడు  దైర్యంగా గొంతు విప్పుతున్నారు. నటనా రంగంలోనే కాదు సంగీత శాఖలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయంటూ  గాయకుడు సోనూ నిగమ్‌, అద్నాన్‌ సమీ సహా పలువురు గాయనీ గాయకులు గళం విప్పి  మ్యూజిక్‌ దందా గురించి మాట్లాడుతున్నారు.  ఇలా కొంతమంది సింగర్స్‌ ఒక్కటై వివక్షపై పోరాటం ప్రారంభించడం నిజంగా సంచలనమే!  



బాలీవుడ్‌ ఎవడబ్బ జాగీరూ  కాదు! - అద్నాన్‌ సమీ 

అద్నాన్‌ సమీ చాలా శాంత స్వభావి. ఆయన ఆగ్రహించిన  సందర్భాలు చాలా తక్కువని సన్నిహితులు చెబుతుంటారు.  అటువంటి వ్యక్తి కూడా సంగీతరంగంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం  జర్మనీలో  ఉన్న ఆయన బాలీవుడ్‌ మ్యూజిక్‌ మాఫియా గురించి గళమెత్తారు. ఈ వివాదంలో కలగజేసుకోవడం ఇష్టం లేకపోయినా,. క్రియేటివిటీ కొందరి చేతులో నలిగిపోతుందనీ, ప్రతిభ ఉన్న సంగీత కళాకారుల్ని పనికిమాలిన వారిగా చిత్రీకరించడం, ధైవంగా భావించే కళని తమ గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తున్న కొంతమందిని చూసి బాధతో మాట్లాడుతున్నానని అద్నాన్‌ సమీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.    ‘‘ రెండు దశాబ్ధాల క్రితం నేను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు బంధుప్రీతి ఉన్నప్పటికీ వివక్ష అన్నది పెద్దగా కనిపించలేదు. అప్పట్లో ప్రతిభకు పట్టం గట్టేవారు. కళాకారుడికి గౌరవం ఉండేది. ఈ రోజుల్లో అదే కరువైంది. ఇప్పుడంతా మాఫియా ధోరణి నడుస్తోంది.. ఈ జనరేషన్‌ వ్యక్తుల్లో కొంతమంది  కమర్షియల్‌, కార్పొరేట్‌ తీరులో ఆలోచిస్తున్నారు. కళను కమర్షియల్‌ చేసేశారు. ప్రతిభ కలిగినవారిని ప్రోత్సహించండి.   కళా పరిశ్రమలో మీకు నచ్చినట్లు చేయడానికి బాలీవుడ్‌ ఎవడబ్బ  జాగీరు కాదు.  ఇలాంటి పరిస్థితులే  కొనసాగితే భవిష్యత్తుల్లో నియంతలుగా ప్రవర్తించే వారు  మూల్యం చెల్లించక  తప్పదు. కళాకారులు తిరగబడే పరిస్థితి వస్తుంది. ‘తరచూ  అబద్ధాలు చెబితే నిజం మీద నమ్మకం పోతుంది’ అని మా నాన్న  చెబుతుండేవారు. అది నేను బాగా నమ్ముతా. బయటి దేశం నుంచి వచ్చి ప్రతిభతో ఇక్కడ నిలబడినందుకు నేను చాలా గర్విస్తా. ఈ జనరేషన్‌ కళాకారులకు ఆ ఛాన్స్‌ లేకపోవడం బాధాకరం’’ అని అద్నాన్‌ సమీ పేర్కొన్నారు. 


నెపోటిజం కాదు... గ్రూపిజం - పలాష్‌ సేన్‌

‘‘కొన్నేళ్లుగా అవకాశాలు కోల్పోతున్న కళాకారులు  తమ బాధల్ని ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉంటున్నారు. . చిన్నస్థాయి కళాకారులే కాదు నేనూ ప్రశ్నించలేకపోయా. ఎందుకంటే సంగీత రంగంలో ఉన్నది నెపోటిజం కాదు...  గ్రూపిజం.  ‘నేను ఫలానా వ్యక్తి దగ్గర  పని చేయను’ అన్నానంటే.. నన్నే కాదు  నా వెనకుండే పదిమందిని కూడా  దూరం పెట్టే దౌర్యాగ్య   పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇలాంటి గ్రూపిజం వల్ల  ఏ టాలెంట్‌ లేనివారు అవకాశాలు అందుకుంటున్నారు. ప్రతిభ ఉన్నవారు మరుగున్న పడుతున్నారు’’. 


ప్రతిభను చెత్తకుండీలో వేస్తున్నారు - సలీం మర్చంట్‌

‘‘ఓ ట్యూన్‌ చేయాలన్నా, పాట పాడించాలన్నా... ఆ హక్కులు సినిమా దర్శకనిర్మాతలకు, సంగీత దర్శకుడికి ఉంటాయి. . కానీ బాలీవుడ్‌లో అందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఎవరితో పాడించాలి, ఎవరితో ట్యూన్‌ చేయించాలి అన్నది పెద్ద లేబుల్‌ వేసుకున్న భూషణ్‌కుమార్‌ నిర్ణయిస్తాడు. ఈ అన్యాయం రోజురోజుకీ పెరిగిపోతోంది. . చక్కని  గొంతుతో పాడిన పాటలు బాగోలేవనే సాకుతో  సినిమా నుంచి తొలగించి చెత్తకుండీలోకి వేస్తున్నారు. భూషణ్‌ సంగీత రంగంలో చెత్తని పెంచుతున్నారు’’. 


వివక్ష లేదు... - శిల్పారావు 

‘‘నేను పుష్కరకాలంగా మ్యూజిక్‌ ఇండస్ట్రీలో ఉన్నా. ఇక్కడ  ఎలాంటి వివక్ష లేదు. ప్రతిభ ఉంటే తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి.  ‘సింగర్‌గా నీ గొంతు ఎలా ఉంది. మంచి పాట ఇవ్వడం కోసం ఎంతగా కృషి చేస్తున్నాం అన్నదే ప్రాతిపదికగా అవకాశాలొస్తున్నాయి.’’ 


కంటెంట్‌ ముఖ్యం - జుబిన్‌ 

‘‘రోజులు మారుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచులూ మారాయి. సినిమా అయినా, పాటైనా కథాబలం ఉంటేనే ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. మంచి సాహిత్యం, సంగీతం సినిమాను నిలబెడతాయి.  నెపోటిజం ఒకప్పుడు ఉన్న మాట వాస్తవం. అయితే  ఇప్పుడు  టాలెంట్‌, కంటెంట్‌ మీదే పరిశ్రమ నడుస్తోంది. ప్రతిభ ఉన్న కళాకారులను ఎవరూ ఆపలేరు’’




మీరెంత మందిని ప్రోత్సహించారు సోనూ? - దివ్వా ఖోస్లా

సోనూ నిగమ్‌ చేసిన వ్యాఖ్యలను భూషణ్‌కుమార్‌ భార్య దివ్యా ఖోస్లా ఖండించారు. ‘‘పరిశ్రమకు సంబంధం లేకపోయినా ప్రతిభ కలిగిన   సంగీత దర్శకులను, గాయకుల్ని, నటీనటుల్ని  టీ-సిరీస్‌ మొదటినుంచీ ప్రోత్సహిస్తోంది.  దర్శకురాలిగా నేను కూడా  చాలామంది కొత్తవారికి  అవకాశం ఇచ్చాను. వారంతా ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. ఇన్ని మాట్లాడుతున్న మీరు ఓ గాయకుడిగా ఎంతమంది ప్రతిభావంతులకు ఆసరాగా నిలబడ్డారు?’ అని ఆమె ప్రశ్నించారు. ‘వచ్చిన అవకాశాల్ని మీ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారే కానీ మరొకరికి సాయపడ్డారా? మీరు మమ్మల్ని నిందిస్తున్నారా? నిజానికి టీ-సిరీ్‌సలో పని చేసేవారిలో  95 శాతం మంది పరిశ్రమతో సంబంధం లేనివారే! మేము ప్రతిభ ఉన్న కొత్తవారి కోసమే ఆలోచిస్తాం’’ అని దివ్యా ఖోస్లా  చెప్పారు.



భూషణ్‌ కను సైగల్లో...

బాలీవుడ్‌ సంగీత రంగాన్ని రెండు మ్యూజిక్‌ కంపెనీలు శాసిస్తున్నాయనీ,  ముఖ్యంగా  టీ-సిరీస్‌ మ్యూజిక్‌ కంపెనీ అధినేత భూషణ్‌ కుమార్‌ ఏది చెబితే అదే జరుగుతుందనీ, ఆయన  ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పిందే వేదంగా సంగీతరంగం నడవాల్సి వస్తోందనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. సంగీతరంగం మాఫియాలా తయారైందని  ఇటీవల సింగర్‌ సోనూ నిగమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగుతున్న కొందరు ప్రముఖులు, రెండు మ్యూజిక్‌ కంపెనీల వల్ల సంగీత రంగంలో సింగర్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, మ్యూజిక్‌ ప్రొడ్యూసర్స్‌ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిభ ఉన్నా తనకు సరైన గుర్తింపు రాలేదని, చాలామంది తనను పరిశ్రమ మనిషిగా చూడలేదనే బాధతో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రేపు ఇలాంటి పరిస్థితే సంగీత రంగంలోనూ రావొచ్చు. సింగర్‌, గేయ రచయిత, సంగీత దర్శకుడు ఆత్మహత్య వార్తలు వినే అవకాశం ఉంది’’ అని సోనూ ఇటీవల ఓ వీడియో ద్వారా వ్యాఖ్యానించిన సంగతి  తెలిసిందే! ఓ సినిమా ప్రారంభం కాగానే  దానికి సంబంధించిన మ్యూజిక్‌ విషయంలో దర్శకనిర్మాతలతో సంబంధం లేకుండా భూషణ్‌ కుమార్‌ ఇన్‌వాల్వ్‌ అవుతాడని వినికిడి. బాలీవుడ్‌లో ప్రతిభ ఉండి నిరూపించుకున్న గాయకులు ఎంతోమంది ఉన్నప్పటికీ టీ-సిరీ్‌సతో కాంట్రాక్ట్‌ ఉన్న సింగర్స్‌తోనే భూషణ్‌ పాటలు పాడిస్తారని సంగీతం, కళ గురించి అవగాహన లేని వ్యక్తులు ఇలా  సంగీత రంగాన్ని శాసించడం, తన గుప్పెట్లో పెట్టుకోవడం బాధాకరంగా ఉందని అమన్‌ మాలిక్‌, సలీమ్‌ మర్చంట్‌, క్లింటన్‌ సెరోజ్‌ వంటి గాయనీగాయకులు ఆవేదన వ్యక్తం చేశారు  


Updated Date - 2020-06-28T05:30:00+05:30 IST