HYD: నీటి ట్యాంకులో కుళ్లిన మృతదేహం.. ఆ నీరే తాగిన బస్తీ వాసులు

ABN , First Publish Date - 2021-12-08T08:41:14+05:30 IST

ప్రమాదవశాత్తు పడ్డాడో? ఎవరైనా చంపి పడేశారో?అసలెప్పుడు పడ్డాడో..? హైదరాబాద్‌ చిలకలగూడ ఎస్‌ఆర్‌కేనగర్‌లోని నీటి ట్యాంకులో ఓ వ్యక్తి మృతదేహం బయటపడడం మంగళవారం తీవ్ర కలకలం రేపింది. ముషీరాబాద్‌ ఠాణా పరిధిలో జరిగిన ఘటన పూర్తి వివరాలు..

HYD: నీటి ట్యాంకులో కుళ్లిన మృతదేహం.. ఆ నీరే తాగిన బస్తీ వాసులు

  • పదిహేను రోజులుగా అందులోనే...
  • ఆరు గంటలు శ్రమించి బయటకు
  • నీరు తాగిన బస్తీ, కాలనీ వాసులు
  • హైదరాబాద్‌ రిసాలగడ్డలో ఘటన


రాంనగర్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు పడ్డాడో? ఎవరైనా చంపి పడేశారో?అసలెప్పుడు పడ్డాడో..? హైదరాబాద్‌ చిలకలగూడ ఎస్‌ఆర్‌కేనగర్‌లోని నీటి ట్యాంకులో ఓ వ్యక్తి మృతదేహం బయటపడడం మంగళవారం తీవ్ర కలకలం రేపింది. ముషీరాబాద్‌ ఠాణా పరిధిలో జరిగిన ఘటన పూర్తి వివరాలు.. కృష్ణా పైప్‌లైన్‌ మరమ్మతుల నేపథ్యంలో బుధ, గురువారాల్లో నగరంలో నీటిసరఫరా నిలిపివేయనున్నారు. ఈక్రమంలో జలమండలి అధికారులు ఎస్‌ఆర్‌కేనగర్‌లోని ట్యాంకును శుభ్రం చేయాలని నిర్ణయించారు. పనికోసం వచ్చిన కాంట్రాక్టరు సిబ్బంది.. మూత తీసి చూడగా అందులో కుళ్లిన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. విపత్తు నిర్వహణ సిబ్బందిని పిలిపించారు.  వారు 6 గంటలు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు.


హత్యా, ఆత్మహత్యా?

మృతుడు ఎవరు? ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురయ్యాడా? అని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జహంగీర్‌యాదవ్‌ తెలిపారు. మృతుడికి 35 ఏళ్లుంటాయని చెప్పారు. బ్లూ జీన్స్‌ ధరించాడని పేర్కొన్నారు. దాదాపు 10 నుంచి 15 రోజులుగా మృతదేహం ట్యాంకులో ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. చుట్టూ పది అడుగుల ప్రహరీ, గేటు తాళం ఉంటుంది. అయినా అతడు లోపలకు రావడం, వంద అడుగుల ట్యాంకుపైకి ఎలా ఎక్కా డు? అనేది అంతుబట్టకుండా ఉంది. ఒక్కడే వచ్చాడా? ఇతరులతో కలిసి వచ్చాడా? అనేది తేలాల్సి ఉంది. కాగా, పది లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ట్యాంకు రాంనగర్‌ డివిజన్‌లోని 10 బస్తీలకు నీటిని సరఫరా చేస్తుంది. కొద్ది రోజులుగా ఈ నీటిని తాగిన రిసాలగడ్డ, అంబేడ్కర్‌నగర్‌, హరినగర్‌, కృష్ణనగర్‌, శివస్థాన్‌పూర్‌, బాకారం ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పలువురు మహిళలు ట్యాంక్‌ వద్దకు చేరుకున్నారు. తమకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య శిబిరం నిర్వహించాలని కోరారు. 

Updated Date - 2021-12-08T08:41:14+05:30 IST