ర్యాంకర్ల సహకారంతో మెడికల్‌ కాలేజీల ‘బ్లాక్‌’ దందా!

ABN , First Publish Date - 2022-04-20T08:18:49+05:30 IST

: ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో పీజీ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ స్పందించింది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

ర్యాంకర్ల సహకారంతో మెడికల్‌ కాలేజీల ‘బ్లాక్‌’ దందా!

  • సర్టిఫికెట్లు తాము ఇవ్వలేదన్న కొందరు అభ్యర్థులు
  • సమగ్ర విచారణ కోసం వైద్య మంత్రి ఆదేశాలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కాళోజీ యూనివర్సిటీ
  • ఇక నుంచి ఎన్‌ఎంసీకి విద్యార్థుల వివరాలు...
  • బ్లాక్‌ చేసినట్లు తేలితే క్రిమినల్‌ చర్యలు: రిజిస్ట్రార్‌
  • నిఘా విభాగంతో దర్యాప్తు: వరంగల్‌ సీపీ


హైదరాబాద్‌ / హనుమకొండ అర్బన్‌, ఏప్రిల్‌ 19: ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో పీజీ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ స్పందించింది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో వరంగల్‌ పోలీసులు విచారణ చేపట్టారు. నీట్‌లో మంచి ర్యాంకులు తెచ్చుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల సహకారంతో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు సీట్ల బ్లాక్‌ దందాకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే కాళోజీ హెల్త్‌  యూనివర్సిటీ రాసిన లేఖలకు కొందరు అభ్యర్థులు బదులిస్తూ... తాము అసలు సీటు కోసం దరఖాస్తు చేసుకోలేదని, సర్టిఫికెట్లను కూడా ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు... ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులతో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను బ్లాక్‌ చేయించి, ఆ తర్వాత వాటిని వేరే అభ్యర్థులకు భారీ మొత్తానికి అమ్ముకుంటున్నట్టు హెల్త్‌ యూనివర్సిటీకి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో డబ్బులకు ఆశపడి కొందరు అభ్యర్థులు కాలేజీలకు సహకరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీలో చేరాలన్న ఉద్దేశంతో కాకుండా, కేవలం సీట్లను బ్లాక్‌ చేయడం కోసమే కొందరు అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన 45 మందికిపైగా అభ్యర్థుల దరఖాస్తులను యూనివర్సిటీ లోతుగా పరిశీలించింది. నీట్‌లో మెరుగైన ర్యాంకు సాధించి, స్వరాష్ట్రంలో చేరకుండా తెలంగాణలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు హెల్త్‌ యూనివర్సిటీ లేఖలు రాసింది. యూజీలో  300 మందికి, పీజీలో 40 మందికి లెటర్స్‌ పంపింది. వీటికి పీజీ విద్యార్థులు ఏడుగురు స్పందించారని వర్సిటీ అధికారులు తెలిపారు. సీట్ల బ్లాక్‌ వ్యవహారాన్ని కొందరు అభ్యర్థులు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు దృష్టికి తీసుకెళ్లారు. 


ప్రైవేటు కాలేజీల అక్రమాలతో ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన మంత్రి... ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులను ఆదేశించారు. కాగా... ఈ వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థులకు న్యాయంగా దక్కాల్సిన మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేసిన కాలేజీలపై కేసులు నమోదుచేయాలని విద్యార్థి సంఘం... పీడీఎ్‌సయూ డిమాండ్‌ చేసింది. తాజా ఉదంతం నేపథ్యంలో కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ అప్రమత్తం అయింది. ఇక నుంచి... కాలేజీల్లో సీట్లు పొంది జాయినై, ఆ తర్వాత రద్దు చేసుకుని వెళ్లిపోయే అభ్యర్థుల వివరాలను జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)కి పంపించాలని నిర్ణయించింది.


వివరాలు ఆన్‌లైన్‌లో పెడితే సమస్య ఉండదు

మెడికల్‌ కౌన్సెలింగ్‌ వివరాలను అన్ని రాష్ట్రాల హెల్త్‌ యూనివర్సిటీలు వెబ్‌సైట్లలో ఉంచడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాలు మాత్రమే వైద్య విద్య కౌన్సెలింగ్‌ ప్రక్రియను అధికారికంగా వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి రౌండ్ల వారీగా కౌన్సెలింగ్‌ వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రమే తెప్పించుకుని, ఒక వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే మంచిదని వైద్య విద్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా పారదర్శకత పెరుగుతుందంటున్నారు. అలాగే విద్యార్ధులు ఒక చోట చేరి, మరో చోట కూడా దరఖాస్తు చేస్తే వెంటనే తెలిసిపోతుందని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.


దోషులుగా తేలితే క్రిమినల్‌ కేసులు

ప్రైవేటు కాలేజీల్లో పీజీ సీట్ల భర్తీలో అవకతవకల విషయం మా దృష్టికి వచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 45 మంది వైద్య విద్యార్థుల సర్టిఫికెట్లతో సీట్లను బ్లాక్‌ చేశారు. వేకెన్సీ ఆప్షన్‌ను అడ్డం పెట్టుకొని యాజమాన్యాలు ఒక్కో సీటును రూ.2 కోట్లకుపైనే అమ్ముకుంటున్నట్లు సమాచారం అందింది. అనుమానాస్పద దరఖాస్తులపై ప్రాథమిక విచారణ జరిపాం. దోషులను గుర్తించేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాం. విద్యార్థులను సంప్రదించగా... తాము ఎవరికీ సర్టిఫికెట్లు ఇవ్వలేదని కొందరు చెప్పారు. సర్టిఫికెట్లు ఎవరిచ్చారనేది  విచారణలో తేలనుంది. ఉద్దేశపూర్వకంగా సీట్లను బ్లాక్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతాం.

- హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రవీణ్‌


కూపీ లాగుతున్నాం...

 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో అక్రమాలపై కాళోజీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ మాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు అధికారులు, నిఘా విభాగం అధికారులతో కూపీ లాగుతున్నాం. విచారణ ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తయిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం.

- వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి

Updated Date - 2022-04-20T08:18:49+05:30 IST