‘ఉక్కు’ పోరుకు మద్దతుగా నిలుస్తాం

ABN , First Publish Date - 2021-04-19T09:38:12+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు విశాఖ కేంద్రంగా జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా రైతుల మద్దతు ఉందని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) జాతీయ

‘ఉక్కు’ పోరుకు  మద్దతుగా నిలుస్తాం

‘రైతు, కార్మిక శంఖారావం’ సభలో బీకేయూ నేత తికాయత్‌ 

ప్రధానితో చర్చల అజెండాలో ‘విశాఖ’

సాగు చట్టాల రద్దు, ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ జరిగే వరకూ పోరాటం ఆగదు

అల్లూరి స్ఫూర్తితో పోరాటం చేయాలి 

ఏకేఎస్‌ జాతీయ నేత అశోక్‌ థావలె


విశాఖపట్నం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు విశాఖ కేంద్రంగా జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా రైతుల మద్దతు ఉందని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) జాతీయ అధ్యక్షుడు రాకేశ్‌సింగ్‌ తికాయత్‌ అన్నారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కేబీచ్‌లో ఆదివారం ‘రైతు, కార్మిక శంఖారావం’ పేరిట బహిరంగ సభ జరిగింది. ముఖ్యఅతిథి తికాయత్‌ మాట్లాడుతూ, త్వరలో ప్రధాని మోదీతో జరిగే చర్చల సందర్భంగా రైతులకు తీవ్ర నష్టం కలిగించే మూడు సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనే డిమాండ్‌ను అజెండాలో చేర్చుతామని చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దుకోసం ఢిల్లీలో జరుగుతున్న పోరాటాల తరహాలోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాటాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.


ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని మోదీ చూస్తున్నారని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఉద్ఘాటించారు. సాగుచట్టాల రద్దు, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం ఉప సంహరణ జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, దీనికి విశాఖలో మొదలైన రైతు, కార్మిక శంఖారావం తొలి అడుగు మాత్రమేననే విషయాన్ని కేంద్రం తెలుసుకోవాలన్నారు. భవిష్యత్తులో కూడా కార్మికులు, రైతులు కలిసి అనేక ఉద్యమాలను చేపట్టాల్సిన పరిస్థితులను కేంద్రం కల్పిస్తోందన్నారు. ఇప్పటికే బీమా, బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటు బాట పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

కార్పొరేట్‌కు సాగిల పడుతున్నారు: థావలె

ఆలిండియా కిసాన్‌ సభ(ఏకేఎస్‌) జాతీయ నాయకుడు అశోక్‌ థావలె మాట్లాడుతూ, కార్పొరేట్‌ శక్తులకు సాగిలాపడి ప్రజాఽధనాన్ని ధారాదత్తం చేస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా,నాడు బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ఎంతోమంది బలిదానాలతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను పోరాటాలతోనే నిలబెట్టుకుంటామన్న విషయాన్ని కార్మికులు, రైతులు, ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. 


అహంకారంతోనే చేస్తున్నారు: వడ్డే

ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ వడ్డే శోభనాదీశ్వరరావు మాట్లాడుతూ, లోక్‌సభలో తిరుగులేని మెజారిటీతో ఉన్నామనే అహంకారంతో ప్రధాని నరేంద్రమోదీ పెట్టుబడిదారీ విధానాన్ని అమలుచేస్తున్నారని విమర్శించారు. ‘ప్రభుత్వం ఉన్నది పాలనకేగానీ.. వ్యాపారం చేయడానికి కాదు’ అని చెబుతున్న నరేంద్రమోదీ.. బ్యాంకుల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్‌ సంస్థలకు వాటిని రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఆశాదీపంలాంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎందుకు ప్రైవేటుపరం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ‘వ్యవసాయం నిలవాలి... రైతు గెలవాలి... స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ జరగాలి’ అంతవరకూ పోరాటాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. 


దోపిడీకి దారులు: బలకరణ్‌ సింగ్‌

కిసాన్‌ సభ జాతీయ నాయకుడు బలకరణ్‌సింగ్‌ మాట్లాడుతూ, ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం ద్వారా మోదీ ప్రభుత్వం దోపిడీకి దారులు తెరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం దారుణమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతామన్నారు. అఖిలభారత వ్యవసాయ కూలీ సంఘం కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ, ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ మాత్రమే కాదని ‘విశాఖ ఉక్కు- దేశ ప్రజల హక్కు’గా భావించే పరిస్థితి వచ్చిందన్నారు. ‘ప్రభుత్వానికి రూ.వేల కోట్లు పన్నుల రూపంలో ఆదాయాన్ని తెచ్చిపెట్టే స్టీల్‌ప్లాంట్‌ సెగలో చేయిపెడితే.. మోదీ మాడిపోతావ్‌’ అని హెచ్చరించారు. 


ఉపాధికి గండి: నరసింగరావు

విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ, పరిశ్రమలను ప్రైవేటీకరించడం వల్ల యాంత్రీకరణ పెరిగిపోతుందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉక్కు పరిరక్షణ కమటీ మరో చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌కు రూ.4,900కోట్ల పెట్టుబడి పెట్టిన కేంద్రం ఇప్పటివరకు పన్నుల రూపంలో రూ.45వేల కోట్ల ఆదాయం పొందిందన్నా రు. సభలో ఢిల్లీ నుంచి వచ్చి రైతు నాయకులు ధర్మపాల్‌సింగ్‌, యుద్వేర్‌సింగ్‌, ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ జె.అయోఽధ్యరామ్‌, రాష్ట్ర రైతు నాయకుడు రావుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T09:38:12+05:30 IST