బిజేపీయే ‘తెలుగు’ ప్రతిపక్షం

ABN , First Publish Date - 2020-02-18T06:15:33+05:30 IST

ప్రధానమంత్రి మోదీని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చి కానీ, ఆయన ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కానీ కలుసుకోవడం సహజం. ఢిల్లీలో బిజెపికీ, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ...

బిజేపీయే ‘తెలుగు’ ప్రతిపక్షం

ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రులు న్యూఢిల్లీ వచ్చి  కలిసినప్పుడల్లా ఆ సమావేశాలకు రాజకీయ రంగు పులమడం తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్ర ఆనవాయితీ అయిపోయింది. నరేంద్రమోదీ, అమిత్ షాలను జగన్ కలిసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారే ప్రసక్తి ఏమాత్రం లేదు. పౌరసత్వ సవరణ చట్టం, నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఘర్షణ వైఖరి అవలంబిస్తే కేసీఆర్ నిజస్వరూపాన్నిఎలా బట్టబయలు చేయాలో బిజెపికి బాగా తెలుసు.


ప్రధానమంత్రి మోదీని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చి కానీ, ఆయన ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కానీ కలుసుకోవడం సహజం. ఢిల్లీలో బిజెపికీ, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన వెంటనే ప్రధానమంత్రి మోదీ ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను అభినందిస్తూ ట్వీట్ పెట్టారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే కాని శత్రువులు ఉండరనేది భారతీయ జనతా పార్టీ చాలా కాలంనుంచీ అవలంబిస్తున్న సిద్ధాంతం. ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రిని కనీసం నలుగురు ముఖ్యమంత్రులు కలిశారు. వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఉత్తరాఖండ్, జార్ఖండ్, మిజోరం ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అందరూ తమ తమ రాష్ట్రాలకు అవసరమైన ఆర్థిక మద్దతు, వివిధ ప్రాజెక్టులకు మద్దతు గురించే ప్రస్తావించారు. ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్‌లను చూస్తే ఏ ముఖ్యమంత్రి ఆయనను కలుస్తున్నారో తెలుస్తుంది. నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ వచ్చినప్పుడు భారత ప్రభుత్వ అధినేతలనే కలుస్తారు, కాని, పార్టీ నేతలను కలుసుకోవాలని రారు. కాని తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమేమంటే, ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను ముఖ్య మంత్రులు కలిసినప్పుడల్లా ఆ సమావేశాలకు రాజకీయ రంగు పులమడం జరుగుతోంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ వచ్చి అరగంటసేపు ప్రధానమంత్రిని కలుసుకోవడంతోనే ఏవేవో ఉహాగానాలు మొదలయ్యాయి. వైసీపీ త్వరలోనే ఎన్డీఏలో చేరుతుందని, బిజెపికి, వైసీపీకి మధ్య అనుబంధం పెరుగుతోందని, అందువల్ల రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందని, జగన్మోహన్ రెడ్డిని కేసుల నుంచి విముక్తి చేస్తుందని రకరకాల పుకార్లు ప్రచారమయ్యాయి. ఆఖరుకు ఎక్కడో జరిగిన ఆదాయపన్ను దాడులకు కూడా జగన్, బిజెపి సంబంధాలకు ముడిపెట్టి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు ప్రచారానికి లంకించుకున్నవారు ఉన్నారు.


బహుశా అందుకే బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ వెంటనే స్పందించి వైసీపీతో ఎలాంటి పొత్తూ ఉండదని, తమకు తెలుగుదేశం, వైసీపీ పార్టీలు రెండూ ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షాలను జగన్ కలిసినంత మాత్రాన రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే ప్రసక్తి ఏమాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత మేరకు బీజేపీ వైసీపీకి బలమైన ప్రత్యర్థిగా మారేందుకు శాయశక్తులా కృషి చేస్తుంది.


విచిత్రమేమంటే జగన్‌పై ఉన్న కేసులకూ ఆయన ప్రధాని, హోంమంత్రులతో సమావేశానికి కూడా ముడిపెడుతున్నారు. ఇది హాస్యాస్పదం. ఇలాంటి వ్యవహారాల్లో చట్టం తన పని తాను చేసుకుపోవాలన్నదే మోదీ అభిప్రాయం. ప్రధానమంత్రితో వ్యక్తిగత స్థాయిలో సత్సంబంధాలు ఉన్నప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత న్యాయపోరాటం చేయవలిసి వచ్చిందన్న విషయం జగద్విదితం. రెండవది, జగన్ ఎజెండాలో ఉన్న మండలి రద్దు కేంద్రానికి అసలు ప్రాధాన్యతే కాదు. కర్నూలుకు హైకోర్టు తరలింపు కావాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియం ఆమోద ముద్ర తో పాటు అనేక న్యాయ, రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. కనుక దానికి కూడా జగన్ పాడిందే పాట అన్నట్లుగా వెంటనే జరిగే అవకాశాలు తక్కువే. మూడవది, జగన్ పార్టీకి రాజ్యసభలో సీట్లు పెరుగుతాయి కనుక ఆ పార్టీతో బీజేపీ చెలిమిచేస్తుందనే దుష్ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్‌లో రాజకీయ సమీకరణాలు సాధారణంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. ఒక బిల్లు ఆమోదం పొందాల్సి వచ్చినప్పుడల్లా వివిధ పార్టీల మద్దతు కూడగట్టుకోవడం అందుకు పార్లమెంటరీ పార్టీ నేతలు, ఛీప్ విప్‌లూ ప్రయత్నించడం సహజం. ఒక పార్టీ ఒక బిల్లుకు మద్దతునీయడం, మద్దతు నీయకపోవడం పై రాజకీయ పోరాటాలు ఆధారపడవన్న విషయం జగమెరిగిన సత్యం. పార్లమెంట్‌లో బిల్లులకు మద్దతు నిచ్చిన పార్టీలతోనే ఎన్నికల సమయంలో హోరాహోరీ పోరాడిన సందర్భాలు అనేకం. ఒడిషాలో బీజేపీని బలంగా ఎదుర్కొన్న బిజూ జనతాదళ్ పార్లమెంట్‌లో అనేక బిల్లుల ఆమోదం విషయంలో సహకరిస్తోంది. ఎన్నికల సమయంలో తలపడే వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత రాష్ట్ర, లేదా దేశ ప్రయోజనాలకోసం పరస్పరం సహకరించుకోవడం ఆరోగ్యకరమైన రాజకీయ సంస్కృతి. మోదీ ఈ రాజకీయ సంస్కృతిని గౌరవిస్తున్నందువల్లే ‘సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్’ అన్న సూత్రాన్ని పాటించే ప్రయత్నం చేస్తున్నారు.


తెలంగాణ విషయంలో కూడా బీజేపీ వైఖరి విస్పష్టంగా ఉన్నది. అక్కడ బీజేపీయే తెలంగాణకు బలమైన ప్రత్యర్థి అన్న విషయం లోక్ సభ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ స్పష్టమైంది. ఈ విషయం తెలిసినందువల్లే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఆయన కుమారుడు కె.టి. రామారావు బీజేపీని లక్ష్యంగా చేసుకుని దాడులు ఉధృతం చేస్తున్నారు. పౌరసత్వ చట్టం గురించి వారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆసలు వారు ఆ చట్టాన్ని చదివారా, స్వాతంత్ర్యకాలం నుంచీ జరుగుతున్న చరిత్ర గురించి వారికేమైనా అవగాహన ఉన్నదా అన్న అనుమానం కలుగుతోంది. ఇతర దేశాల్లో అణచివేతకు, వివక్షకూ గురైన వర్గాలకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు మోదీ ప్రయత్నిస్తుంటే అన్యాయం జరగని వర్గాలను కేసీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ముస్లిమేతర మైనారిటీల జనాభా స్వాతంత్ర్య కాలం నుంచి ఇప్పటి వరకూ ఎంత తగ్గిందో, మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ముస్లింల జనాభా ఎంత పెరిగిందో కేసిఆర్‌కు అవగాహన ఉంటే వివక్షకు గురైన ముస్లిమేతర వర్గాల దయనీయ స్థితిని అర్థం చేసుకునేవారు. కాని దురదృష్టవశాత్తూ ఆయన ఈ దేశంలో ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ ఆలోచనా విధానాన్ని భుజానికెత్తుకున్నారు. అందువల్ల టీఆర్‌ఎస్‌కు కూడా కాంగ్రెస్ గతి పట్టక తప్పదు.


ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే కేంద్రం ఏరాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని తెలిసినప్పటికీ కేసీఆర్, కేటీఆర్ సిఏఏ మీద అబద్ధాలు ప్రచారం చేసినట్లే ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కాకిలెక్కలు చెబుతున్నారు. సరిగ్గా వారం రోజుల ముందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రం ఆవిర్భావం నుంచీ నేటి వరకు తెలంగాణకు లక్షా యాభై వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు స్పష్టంగా వెల్లడించారు. ఏ ఖాతా క్రింద ఎంతమేరకు నిధులు ఇచ్చారో ఆమె సవివరంగా తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు, స్థానిక సంస్థలకూ, గ్రామీణాభివృద్దికీ, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ క్రిందా కేంద్రం నిధులు విడుదల చేయకపోతే కేసీఆర్ ప్రజల ముందుకు వెళ్లే అవకాశమే ఉండేది కాదు. అసలు ఏనాడైనా ప్రదానమంత్రి మోదీ రాష్ట్రానికి ఫలానా మేలు చేశారని ఆయన చెప్పుకున్నారా? చెప్పుకుంటే బీజేపీకి పేరొస్తుందని ఆయనకు తెలుసు. నిజానికి ఫెడరలిజం స్ఫూర్తితో ముందుకు వెళుతున్న ప్రధానమంత్రి మోదీ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫార్సులను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లను పట్టించుకున్నందువల్లే 15వ ఆర్థిక సంఘం కేవలం జనాభాను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాల పనితీరును, వారు వసూళ్లు చేసిన పన్నులను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించింది. కాని కేసీఆర్‌కు మరో నాలుగేళ్లలో జరిగే ఎన్నికలకోసం ఇప్పటి నుంచే రాజకీయాలు చేయడం తప్ప వాస్తవ పరిస్థితిని పట్టించుకోవాలన్న దృష్టి ఉండదు. అందుకే పిపిపి నమూనాలో నిర్మించిన మెట్రోకు వయబిలిటీ గ్యాప్ నిధి క్రింద రూ.1200 కోట్లు కేంద్రం కేటాయించిన విషయం తెలిసినా స్థానిక ప్రజా ప్రతినిధి, కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించే విషయంలో అవమానకరంగా వ్యవహరించారు. ఇలాంటి సంఘర్షణాయుత వైఖరి అవలంబిస్తే కేసీఆర్ నిజస్వరూపాన్ని ఎలా బట్టబయలు చేయాలో బీజేపీకి బాగా తెలుసు.





వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-02-18T06:15:33+05:30 IST