విజయసాయిపై యుద్ధాన్ని ప్రకటించిన బీజేపీ

ABN , First Publish Date - 2020-07-12T23:03:23+05:30 IST

ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ యుద్ధాన్ని ప్రకటించింది. ఆయనను టార్గెట్‌గా చేసుకుని విరుచుకుపడుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ మరోసారి

విజయసాయిపై యుద్ధాన్ని ప్రకటించిన బీజేపీ

అమరావతి: ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ యుద్ధాన్ని ప్రకటించింది. ఆయనను టార్గెట్‌గా చేసుకుని విరుచుకుపడుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ మరోసారి ఘాటు విమర్శలు చేసింది. ట్విట్టర్ ద్వారా విజయసాయిపై విరుచుకుపడింది. ఏపీలో అవినీతి జైలు పక్షిగా, ఢిల్లీలో బ్రోకర్‌గా విజయసాయికి గుర్తింపు ఉందంటూ వ్యాఖ్యానించింది. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు దిగజారుడుతనానికి నిదర్శనమంటూ... విజయసాయి అసలు స్వరూపం బీజేపీకి తెలుసంటూ తెలిపింది. హద్దుల్లో ఉండటం మంచిదని విజయసాయిని బీజేపీ హెచ్చరించింది.  


వైసీపీ, బీజేపీ నేతల నడుమ విమర్శల యుద్ధం జోరందుకుంటోంది. ఆకలితో ఉన్న పచ్చ మిడతలు(టీడీపీ నేతలు) కమలం పువ్వు వైపు కదులుతున్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై బీజేపీ నాయకులు విరుచుకుపడిన విషయం తెలిసింది. ‘విజయసాయిరెడ్డి గారూ.. పసుపు రంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగల బలం బీజేపీకి ఉంది.. ప్రస్తుతం మీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫేడ్‌ చేస్తున్న మీ రంగును కాపాడుకోండి’ అని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ ట్విటర్‌లో హితవు పలికారు.


అధికార వైసీపీని విమర్శించే విషయంలో ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరిస్తున్న బీజేపీ నాయకులు తాజాగా ట్వీట్ల యుద్ధానికి తెరతీశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను నిశితంగా విమర్శిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో ట్వీట్‌ చేసినా పెద్దగా పట్టించుకోని బీజేపీ నాయకులు తాజాగా విజయ సాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. దీనిబట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి–బీజేపీ మధ్య పూర్తిగా చెడిపోయిందని భావించడానికి వీల్లేదు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చేవారితో రాష్ట్రంలో బలపడాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నుంచి చేరిన సుజనా చౌదరి ప్రభృతులను విజయసాయిరెడ్డి మిడతల దండుతో పోల్చడాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Updated Date - 2020-07-12T23:03:23+05:30 IST