Assembly elections ఎప్పుడొచ్చినా..టీఆర్ఎస్‌ను ఢీకొడుతామంటున్న బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2022-02-07T16:53:47+05:30 IST

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు వెళ్తోంది.‌ అందుకు సంబంధించిన పనిని సైతం కమలనాథులు ప్రారంభించారు. ‌ఇందులో భాగంగా అధికార టీఆర్ఎస్

Assembly elections ఎప్పుడొచ్చినా..టీఆర్ఎస్‌ను ఢీకొడుతామంటున్న బీజేపీ నేతలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని కమలం పార్టీ భావిస్తోందా? ఎన్నికలను ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను కమలనాథులు సిద్ధం చేసుకుంటున్నారా? నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించారా? బీజేపీకి అంత ఈజీగా అభ్యర్థులు దొరుకుతారా? పక్క పార్టీల నేతలపై బీజేపీ ఆశలు పెట్టుకున్నారా? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


అధికారమే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కమలం పార్టీ

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు వెళ్తోంది.‌ అందుకు సంబంధించిన పనిని సైతం కమలనాథులు ప్రారంభించారు. ‌ఇందులో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు.  ఈ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయల కోసం పోరాటాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. జీవో 317ను సవరించాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనవరి రెండున జాగరణ దీక్షకు కూర్చోవటం.. అరెస్టు తదనంతర పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది‌. ఈనేపథ్యంలో తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్‌ను అడ్డుకోవటంతో పాటు..  బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు దిగారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ దాడులను తిప్పికొట్టాలని తెలంగాణ బీజేపీ శాఖ నిర్ణయించింది. అధికార టీఆర్ఎస్‌పై దూకుడుగా వెళ్తూనే.. వచ్చే ఎన్నికల‌ కోసం సమాయత్తం కావాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావిస్తున్నారట. 


యూపీ ఎన్నికల తర్వాతనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..?

మరోవైపు సీఎం కేసీఆర్ ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని కమలనాథులు అంచనా వేస్తున్నారు‌. నిజానికి వచ్చే ఏడాది డిసెంబరు వరకు కేసీఆర్‌కు సమయం ఉంది. అయితే ఈ ఏడాది డిసెంబరు లేదా.. వచ్చే ఏడాది వేసవిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది.‌ అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాతనే అసెంబ్లీ ఎన్నికలపై ఒక అంచనాకు రావాలని తెలంగాణ బీజేపీ శాఖ భావిస్తోందట. అయితే ఎన్నికలు ఎప్పుడైనా రావొవ్చని.. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బండి సంజయ్ దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలోని‌ 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే అభ్యర్థుల బలాబలాలపై రహస్యంగా సర్వేలు జరిపించినట్లు తెలుస్తోంది‌. ఈ సర్వేలో కొంత మంది బలమైన అభ్యర్థులను గుర్తించినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులను తయారు చేసుకోవాలని నాయకత్వం భావిస్తోంది. నియోజకవర్గంలో పట్టు ఉండటంతో పాటు ఆర్థికంగా బలమైన‌ నాయకుల కోసం బీజేపీ నాయకత్వం జల్లెడ పడుతోందని తెలుస్తోంది.


జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారని టాక్

ఇక గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావిస్తున్నారట. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీజేపీకి 90శాతం స్థానాల్లో డిపాజిట్ దక్కలేదు. బలమైన అభ్యర్థులు లేకపోవడంతో పాటు అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావటమే ఇందుకు ప్రధాన కారణంగా బీజేపీ ప్రస్తుత నాయకత్వం అంచనా వేస్తోంది. అభ్యర్థులను ముందుగానే గుర్తించి వారికి స్వేచ్ఛనిస్తే..‌ ఎన్నికల నాటికి మరింత బలపడతారని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. 


కాగా, తన‌ పాదయాత్ర సమయంలోనే బండి సంజయ్ కొందరు అభ్యర్థులను గుర్తించి.. వారికి టికెట్ పై భరోసాను ఇచ్చినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఇందులో భాగంగానే చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఎవరనేది బండి సంజయ్ తన మనసులో ఫిక్స్ అయినట్లు బీజేపీ వర్గాల సమాచారం. 


ఎన్నికలు ఎప్పుడొచ్చినా..టీఆర్ఎస్‌ను ఢీకొడుతామంటున్న కమనాథులు

ఇంకోవైపు అధికార టీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలు సైతం తమతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ‌ నేతలు చెబుతున్నారట. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌లో టికెట్ దక్కని బలమైన నేతలను సైతం చేరదీసే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. టీఆర్ఎస్‌ను ఎదుర్కొంటామని కమలనాథులు చెబుతున్నారు.

Updated Date - 2022-02-07T16:53:47+05:30 IST