బీసీ జనగణనపై బీజేపీకి సంశయమేల?

ABN , First Publish Date - 2021-08-31T06:10:48+05:30 IST

విశ్వనిర్మాణంలో గణితసూత్రాలు ఉన్నాయి. మానవజీవితంలో ప్రతి అంశమూ కొన్ని లెక్కల మీదే ఆధారపడి ఉంటుంది. సైన్స్ మొత్తం డేటా ప్రాతిపదికనే నడుస్తుంది. మెడిసిన్‌లో దీన్నే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు...

బీసీ జనగణనపై బీజేపీకి సంశయమేల?

విశ్వనిర్మాణంలో గణితసూత్రాలు ఉన్నాయి. మానవజీవితంలో ప్రతి అంశమూ కొన్ని లెక్కల మీదే ఆధారపడి ఉంటుంది. సైన్స్ మొత్తం డేటా ప్రాతిపదికనే నడుస్తుంది. మెడిసిన్‌లో దీన్నే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు అడవులు 23 శాతం, నీళ్లు ఇంత శాతం, భూమి ఇంత శాతం, వాతావరణంలో తేమ ఇంత శాతం, చివరకు రైతు పండించిన పంట అమ్మేటప్పుడు కూడా తేమ శాతం ఇంత అని మనం లెక్కలు కడతాం. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత రోజువారీ కేసుల లెక్కలు తీస్తున్నారు. కరోనా తగ్గిందా లేదా అని చెప్పటానికి కూడా లెక్కలే అవసరం. అంటే ప్రతి అంశానికి లెక్కలే ప్రామాణికం. ఎత్తు, బరువు, జనాభా పెరుగుదల, ఉష్ణోగ్రత, వర్షపాతం, చివరకు దేవుడి చుట్టూ చేసే ప్రదక్షణకు కానీ, చేసే జపానికి కానీ లెక్కలే మూలం. అంటే ఈ సృష్టి మొత్తం లెక్కలమయం. రోజు మనం వేసుకునే షర్ట్, చెప్పులు లేదా సేవించే మధు పానీయం... ఇలా ప్రతిదీ, చివరకు మరణించిన తర్వాత అవసరం అయ్యే ఆరు అడుగుల జాగాకు కూడా ఒక లెక్క ఉంది. మరి ప్లానింగ్‌కు అవసరమయ్యే ప్రాతిపదిక లెక్కల గురించి ప్రభుత్వాలకు లెక్కలేనితనం ఎందుకో? ఇది ఒక యక్షప్రశ్న. 


ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సేకరించే జనాభా లెక్కలు కేవలం దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు అని లెక్కించడానికే కాదు. వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ఆరోగ్య సమాచారం, ఆస్తిపాస్తులు, డెమోగ్రఫీ, వృత్తులు, వారు ఖర్చు పెట్టే విధానం... ఇలా ఎన్నో అంశాలు దాంట్లో ఉంటాయి. అలానే పరిపాలన, విధాన నిర్ణయాలు తీసుకోవడం, నియోజకవర్గాల ఏర్పాటు, సామాజిక పరిశోధన, పరిశ్రమల స్థాపన... ఇలా పరిపాలనలోని ప్రతి అంశంలోనూ జనాభా లెక్కలు కీలకమని అందరికీ తెలుసు. జనాభా లెక్కలతో బాటు వ్యక్తుల వయస్సు, జెండర్, రోగాలు, ఆర్థిక స్థితిగతులు, వృత్తులు, ఇండ్లు, కరెంటు, టీవీలు, బైకులు, కార్లు, గొర్లు , బర్లు, కుక్కలు, జంతువులూ, పులులు, సింహాలు, మరుగు దొడ్లు, చెట్లు, పుట్టలు... ఇలా ప్రతి అంశాన్ని లెక్కిస్తారు. అలానే మనుషులలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శ్రేణులను వారి కులాలవారీగా లెక్కిస్తారు, ఒక్క బీసీలను తప్ప! 


బీసీలు అంటే ఎందుకు ఇంత వివక్ష? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వారి పట్ల దేశవ్యాప్తంగా పాలకవర్గాలు ఒక వివక్షా ధోరణితో వ్యవహరించాయి. ఆర్థికవ్యవస్థకు బీసీలు వెన్నెముక లాంటి వారు. వీరిలో అత్యధికులు ఉత్పత్తి, సేవారంగాలలో ఉండడంతోపాటు సూక్ష్మ, చిన్న, సన్న పరిశ్రమలు నడిపేవారు. అయితే బీసీల బలమే వారి పాలిట శాపంగా మారింది. అంబేడ్కర్ మంత్రిపదవి నుంచి రాజీనామా చేయడానికి కారణం కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ నిరాకరించడమే. నెహ్రూ నియమించిన కాలేల్కర్ బీసీకమిషన్ కూడా వారికి ద్రోహం చేసింది. బీసీల జనాభాను, సామాజిక, ఆర్థిక అంశాల గణాంకాలను లెక్కించకపోవడానికి ప్రధానకారణం రాజకీయ కుట్ర. దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ రాజకీయ విజయసూత్రం ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వర్గాలను ఓటుబ్యాంకుగా చేసుకోవడమే. ఆయా రాష్ట్రాలలో ఉన్న ఫ్యూడల్‌వర్గాల వారే పాలకులు. వీరి దృష్టిలో బీసీలు కేవలం బిత్తరకులాలు. అందుకే తమ ఓటు బ్యాంకు వర్గాలకు వివిధ కంటితుడుపు పథకాలు ప్రవేశపెట్టి, బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. అందుకే వారి జనగణన ఇంతవరకు చేబట్టలేదు. దాని ఫలితమే మండల్ పాలిటిక్స్ ప్రజ్వరిల్లడం. ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా క్యాస్ట్ కాదు క్లాస్ అనే ముసుగులో, బహుజన వర్గాలను పవర్‌కు దూరం ఉంచడంలో విజయం సాధించాయి. ఉదాహరణకు, బెంగాల్‌ను ముప్పై ఏండ్లు పాలించిన కమ్యూనిస్టుల పాలనలో బహుజనుల (దళితుల, బిసి)ల ఉనికి నామమాత్రమే. కేరళలో కూడా దాదాపు 40 ఏళ్లు కమ్యూనిస్టు నాయకత్వం ఫ్యూడల్ కులాల చేతుల్లోనే ఉంది. కమ్యూనిస్టులకు ప్రధాన ఓటు బ్యాంకు అయినా బహుజన నాయకులను ఎప్పుడూ ముఖ్యమంత్రిని చేయలేదు. తప్పని పరిస్థితులలో మాత్రమే బహుజనులయిన అచ్యుతానంద్, పినరాయి విజయన్‌లను ముఖ్యమంత్రులను చేశారు. దేశానికి సిద్ధాంతబలం ఇవ్వవలసిన కమ్యూనిస్టు పార్టీలు బహుజనులను దూరం పెట్టి కనుమరుగయ్యారు. ఇప్పటివరకు వారు ఓబీసీ జనగణన చేయాలని అడగలేదు. 


బీజేపీ ఎదుగుదల కేవలం బీసీల ఓటుబ్యాంకు మీద మాత్రమే ఆధారపడి ఉంది. 2014, 2019 ఎన్నికలలో బీజేపీ అనూహ్య విజయానికి కారణం నరేంద్ర మోదీని బీసీగా ప్రచారం చేయడం. దాదాపు 47శాతం బీసీలు బీజేపీని ఆదరించారు. అలానే 2017 అసెంబ్లీ ఎన్నికలలో యూపీలో 312 సీట్లు రావడానికి, బిహార్‌లో గెలవటానికి ప్రధాన కారణం బీసీలు, బీసీ ఆధారిత చిన్నపార్టీలు మాత్రమే. బీజేపీ రాజకీయ సిద్ధాంతం అయిన హిందూత్వను మోస్తున్నది కూడా కేవలం హిందూ బీసీలు మాత్రమే. పాలకకులాలు ఏ రాష్ట్రంలో అయినా అన్ని పార్టీలలో ఉంటాయి. అంతేకాదు కేవలం బీసీల ఓటుబ్యాంకు ద్వారానే అవి అధికారంలోకి రావడం జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగహోదా ఇచ్చారు (నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత). ఈ మధ్య మంత్రివర్గంలో గౌరవప్రదమైన సంఖ్యలో బీసీలకు స్థానం కల్పించారు. కానీ ఆర్థిక సుస్థిరతకు అవసరం అయ్యే బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం కానీ, జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌ను కేటాయించడం కానీ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. బీజేపీ 2010లో బీసీల జనగణనను డిమాండ్ చేసింది, 2018 లో అప్పటి హోంమంత్రి పార్లమెంటులో బీసీల జనాభాను లెక్కిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పార్టీకి తత్తరపాటు ఎందుకో ఆలోచించాలి. కమండలాన్ని మోస్తున్నదే మండల్‌శ్రేణులు అనే వాస్తవాన్ని ఆ పార్టీ సిద్ధాంత కర్తలు సదా గుర్తుంచుకోవాలి. బహుజనులు బలంగా ఉంటేనే భారతీయత సుదృఢమవుతుందని, ఓబీసీ ఆర్థిక, సామాజిక గణాంకాలు సమున్నత భారత నిర్మాణానికి దోహదపడతాయని మరవొద్దు. 


బీసీ జనాభా గణన చాలా అవసరం. బీసీ గణాంకాలు కేంద్రప్రభుత్వం దగ్గర ఉన్నా వాటిని గుప్తంగా ఉంచుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీల సంఖ్య 52 శాతం అని వెల్లడించారు. సెన్సస్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ గణన చేపట్టినప్పుడే వాటికి చట్టబద్ధత ఉంటుంది. న్యాయస్థానాలు వాటిని మాత్రమే అంగీకరిస్తాయి. అందువల్లే అందరూ ఓబీసీ జనాభా లెక్కలు అడుగుతున్నారు. వివిధ అంశాల మీద ఓబీసీలు కోర్టు తలుపు తట్టినప్పుడు జనాభా లెక్కలు లేవని కొట్టివేస్తున్నారు. వివిధ పథకాలను జనాభాకు అనుగుణంగా లేదా పేదరికం ప్రాతిపదికగా రూపొందిచాలన్నా లేదా నిధులు కేటాయించాలన్నా జనాభా లెక్కలు లేవని వివక్ష చూపుతున్నారు. ఓబీసీల ఆర్థిక, సామాజిక ప్రగతికి అవసరం అయ్యే ప్రణాళికలు వారి గురించిన లెక్కలు లేకపోవడం వల్ల మరుగున పడిపోతున్నాయి. 


వివిధ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ జనాభా గణనను డిమాండ్ చేస్తున్నాయి. పాలకపక్షంగా మారినప్పుడు మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నాయి. అదేమంటే బీసీ జనాభా గణన వల్ల, కులవ్యవస్థ ఇంకా బలపడుతుందనే కుంటి సాకు చెబుతున్నాయి. నిజానికి కులవ్యవస్థ నిర్మూలన అనేది ఆర్థిక, విద్యా, రాజకీయ పరంగా సమతుల్యం సాధించినప్పుడే అది సాధ్యం. 75 సంవత్సరాల స్వతంత్ర భారత్‌లో ఇప్పటివరకు కులతత్వ నిర్మూలనకు చిత్తశుద్ధితో ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. అది జరగాలంటే బీసీలతో పాటు అన్ని కులాలలో, ముఖ్యంగా అగ్రకులాలలో పేదల లెక్కలు కూడా అవసరం. బీసీల సంఖ్యను అధికారికంగా ప్రకటిస్తే, వారికి చెందవలసిన వాటా వారికి ఇవ్వవలసి వస్తుందని రాజకీయ పార్టీలు వెనుకాడుతున్నాయి. జనాభా వివరాలు లేవనే కారణంతో ఓబీసీ హక్కులకు కోర్టులు సైతం న్యాయం చేయడం లేదు. 


వాస్తవంగా సమాజం ఒక శరీరం లాంటిది. అన్ని అంగాలు సజావుగా, సమతుల్యతలో ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలానే సమాజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని కులాలు, వర్గాలు పరస్పర సహకారంతో జీవిస్తాయి. బహుజనులు ఆర్థికంగా ఎదిగితే, అభివృద్ధి చెందిన వర్గాలకు కూడా లాభం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో కోళ్లపరిశ్రమ ఏడాదికి దాదాపు 22,000 కోట్ల వ్యాపారం సాగిస్తోంది. 95 శాతం యజమానులు అభివృద్ధి చెందిన కులాల వారే. ఆ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలంటే 85శాతం ఉన్న బహుజనుల (పేద, మధ్య తరగతి) ఆదాయం పెరిగినప్పుడే, వారు విరివిగా గుడ్లు, చికెన్ తిన్నప్పుడే అది సాధ్యమవుతుంది. మనం తెలంగాణ ఒక కులం, మిగతావన్నీ ఉప కులాలు అనే దృక్పథంతో ముందుకు వెళితే, అన్ని అవకాశాలతో అందరికి అవకాశం కల్పించగలిగితే, కాలక్రమేణా కులవ్యవస్థకు చెక్ పెట్టగలిగే అవకాశం ఉంటుంది. కావలసిందల్లా మానసిక మార్పు. ఓబీసీ, ఈబీసీ జనాభా లెక్కల అవసరం దేశానికి ఉంది. 

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ 

మాజీ ఎంపీ

Updated Date - 2021-08-31T06:10:48+05:30 IST