అధికారమే లక్ష్యం!

ABN , First Publish Date - 2021-09-17T08:44:22+05:30 IST

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా, హిందూత్వ అజెండాతో ముందుకు వెళ్తున్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అస్త్రంగా మలుచుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్న..

అధికారమే లక్ష్యం!

  • నేడు నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ
  • పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
  • టీఆర్‌ఎస్‌-ఎంఐఎం మైత్రిని వివరించనున్న బీజేపీ నేతలు
  • భారీ జన సమీకరణకు ఏర్పాట్లు పూర్తి
  • లక్ష మంది హాజరవుతారని అంచనా
  • ప్రజా సంగ్రామ యాత్రకు నేడు బ్రేక్‌
  • బహిరంగ సభలో పాల్గొననున్న సంజయ్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా, హిందూత్వ అజెండాతో ముందుకు వెళ్తున్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అస్త్రంగా మలుచుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్న కమలనాథులు.. శుక్రవారం ప్రతిష్ఠాత్మక బహిరంగ సభకు సర్వసన్నద్ధమయ్యారు. ఎంఐఎం.. రజాకార్లకు వారసత్వ పార్టీ అని, అలాంటి పార్టీ ఒత్తిడితోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని ఏడేళ్లుగా అధికారికంగా నిర్వహించడం లేదని కాషాయ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.


విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందనే కేసీఆర్‌ సర్కారు వెనకాడుతోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ ఉద్యమ సమయంలో నాటి ప్రభుత్వాలను డిమాండ్‌ చేసిన కేసీఆర్‌, ముఖ్యమంత్రి అయ్యాక ఏడేళ్లుగా నిర్వహించకపోవడానికి కారణాలను వివరిస్తూ ఆయన వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించారు. సుమారు రెండున్నర దశాబ్దాల నుంచి ఏటా సెప్టెంబరు 17న ఆందోళనలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న కమలనాథులు.. ఈసారి రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌కు లేఖలు రాసిన పార్టీ ముఖ్యనాయకులు, నిర్మల్‌లో వ్యూహాత్మకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణ పరిధిలోనే ఉన్న హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరగనుండడం, తరచూ అల్లర్లు జరుగుతున్న భైంసాలో బాధిత హిందూ కుటుంబాలకు బాసటగా నిలిచేలా చూసేందుకే అమిత్‌ షా సభ ఏర్పాటు చేసినట్లు బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. గిరిజన ఓటుబ్యాంకు పెంచుకోవడం కూడా ఒక అంశమని సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. ఇందులో భాగంగా గోండు పోరాట యోధుడు రాంజీ గోండ్‌ విగ్రహానికి షా నివాళులర్పించనున్నారని ఆయన చెప్పారు. అనంతరం జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి హోదాలో తొలిసారి ఆయన విమోచన సభకు హాజరవుతున్నారు. 


భారీ జన సమీకరణకు ఏర్పాట్లు

అమిత్‌ షా బహిరంగ సభకు భారీ జన సమీకరణ కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ స్వయంగా, రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గడిచిన మూడు రోజులుగా అర్ధరాత్రి 2 గంటల వరకూ అన్ని జిల్లాల అధ్యక్షులతో, మండల పార్టీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహించి జన సమీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. అప్పటి నిజాంతో పాటు ఇప్పటి నయా నిజాం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో జన సమీకరణ ద్వారా నిరూపించాలని పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ‘‘సంజయ్‌ పాదయాత్రతో కొత్త ఊపు వచ్చింది. ఇప్పుడు అమిత్‌ షా పర్యటన ఆ ఊపును మరింత ముందుకు తీసుకెళుతుంది. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్న సందేశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది’’ అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు వివరించారు. 


సంజయ్‌ పాదయాత్రకు విరామం

బండి సంజయ్‌ నిర్వహిస్తున్న పాదయాత్రకు శుక్రవారం బ్రేక్‌ పడనుంది. నిర్మల్‌ బహిరంగ సభలో పాల్గొనేందుకు సంజయ్‌ వెళ్లనున్నారు. అంతకుముందు ఆయన ఎల్లారెడ్డిలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. నిర్మల్‌లో సభ అనంతరం, తిరిగి సాయంత్రం ఎల్లారెడ్డి చేరుకుంటారు. శనివారం నుంచి పాదయాత్ర మళ్లీ కొనసాగుతుందని బీజేపీ నాయకులు తెలిపారు. సంజయ్‌తో పాటే పాదయాత్ర చేస్తున్న 300 మంది సంగ్రామ సేనను అమిత్‌ షాకు పరిచయం చేయనున్నారని చెప్పారు. 


సభకు సర్వం సిద్ధం 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటనకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యి ఉరుల మర్రి వద్ద గల పోరాట యోధుల స్మారక స్తూపానికి అమిత్‌ షా నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ఎల్లపెల్లి సమీపంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు పది రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు దాదాపు లక్ష మందిని సమీకరించనున్నట్టు ప్రకటించారు. నిర్మల్‌లో ప్రధాన కూడళ్లు, అన్ని మార్గాలు కాషాయమయమైపోయాయి. పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులంతా నిర్మల్‌లోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక అమిత్‌ షా పాల్గొనే బహిరంగ సభా వేదికతో పాటు ఆయన పర్యటించే మార్గాన్ని గురువారమే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీజీ, సీఆర్‌పీఎఫ్‌ దళాలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి. 

Updated Date - 2021-09-17T08:44:22+05:30 IST