Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒలింపిక్స్‌లో మనది సరికొత్త చరిత్ర: విజయశాంతి

హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలు అద్భుతమని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఒలింపిక్స్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా మన ఆటగాళ్లు చెలరేగి పతకాలు సాధించి పెట్టారని, దేశానికి గర్వకారణంగా నిలిచారని విజయశాంతి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రశంసించారు. ఆమె పోస్టు యథాతథంగా..


‘‘యావత్ భారతావని పులించేలా మన ఆటగాళ్లు టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. యావత్ భారతావని పులకించేలా ప్రదర్శన చేశారు.పతకాల సంఖ్యలో పాత రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఒలింపిక్స్‌లో 7 పతకాలు రాగా, పారాలింపిక్స్‌లో అయితే అంచనాలకు మించి ఏకంగా 19 పతకాలతో మన క్రీడాకారులు కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. గతంలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు గరిష్టంగా దక్కిన పతకాలు 4 మాత్రమే.


ఈ పరిస్థితుల్లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పారాలింపియన్లు 'స్ఫూర్తి'కి అసలైన అర్థం చెప్పారు. చరిత్రను తిరగరాసిన ఈ రికార్డుల వెనుక మన ప్రధానమంత్రి మోదీగారి నేతృత్వంలోని కేంద్ర సర్కారు క్రీడారంగం కోసం చేపట్టిన విశేష కృషిని గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


భారత క్రీడా రంగంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లను తీర్చిదిద్దేలా కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంది. భారత యువతరాన్ని క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఫిట్ ఇండియా మూమెంట్, ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం వంటి పథకాలు ప్రవేశపెట్టారు. క్రీడల్లో ప్రతిభాన్వేషణ కోసం టాలెంట్ సెర్చ్ పోర్టల్ ప్రారంభించడంతో పాటుగా మహిళా క్రీడాకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ, రాబోయే ఒలింపిక్స్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమయ్యేందుకు ఎంపవర్డ్ స్టీరింగ్ కమిటీలు ఏర్పాటయ్యాయి.


దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ స్కీమ్ (SGPDS) పేరిట ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేశారు. చిత్తశుద్ధితో జరిగిన ఈ ప్రయత్నాలకు స్వయంకృషి తోడైన ఫలితంగా మన క్రీడాకారులు విశ్వక్రీడా వేదికపై చరిత్రను తిరగరాశారు. దేశం గర్వించేలా చేసిన మన ఒలింపియన్లు, పారాలింపియన్లను హృదయపూర్వకంగా అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని విజయశాంతి ఆ పోస్టులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement