తెలంగాణలో శ్రీలంక మాదిరి పరిస్థితులు రాబోతున్నాయ్: Bandi sanjay

ABN , First Publish Date - 2022-06-02T17:00:04+05:30 IST

కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

తెలంగాణలో శ్రీలంక మాదిరి పరిస్థితులు రాబోతున్నాయ్: Bandi sanjay

హైదరాబాద్: కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) ఎనిమిదేళ్ల పాలన భేష్ అని అన్నారు. మోదీ సుపరిపాలనను తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి తెలుగు ప్రభుత్వం దిగజారిపోయిందని విమర్శలు గుప్పించారు. 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ సాధించిన దానికంటే..  ఎనిమిదేళ్ళల్లో మోదీ రెట్టింపు అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. సీఎం‌ కేసీఆర్‌ రైతు ద్రోహి అని... సీఎం మూర్ఖత్వంతో కనీస మద్దతు ధర కూడా రావటం లేదని ఆయన మండిపడ్డారు.


మోదీ ప్రభుత్వం రైతులను రాజులను చేస్తే.. కేసీఆర్ బికారులుగా మార్చారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం భవిష్యత్‌లో ఉంటుందో.‌. పోతోందో నమ్మకం లేదని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ళ విషయంలో కేసీఆర్ సర్కార్ పేదలను మోసం చేసిందని ఆరోపించారు. ఎనిమిదేళ్ళల్లో పది వేల మందికి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వలేకపోయిందన్నారు. రైతుబంధు ఇచ్చి.. రైతులకు అందాల్సిన అన్ని పథకాలను కేసీఆర్ బంద్ చేశారని అన్నారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని కేసీఆర్ సర్కార్ నీరు గార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.


తెలంగాణలో కేసీఆర్ మాత్రమే వ్యవసాయం చేసి కోటీశ్వరుడు అయ్యారన్నారు. 2014కు ముందు కుంభకోణాల్లో కాంగ్రెస్ రికార్డులు సృష్టించిందన్నారు. మహిళల కోసం మరుగుదొడ్లు నిర్మించిన ఘనత మోదీ సర్కార్ దే అని చెప్పారు. అయోధ్య రామమందిరం నిర్మాణంతో హిందువుల కలను సాకారం చేసిన నేత మోదీ అని కొనియాడారు. కోవిడ్ నుంచి భారతదేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి ప్రధాని అని తెలిపారు. జూన్ 14 వరకు మోదీ సుపరిపాలనపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం ఇతరదేశాలు ప్రధాని మోదీకి విజ్ఞప్తులు పంపుతున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-02T17:00:04+05:30 IST