తండ్రీకొడుకులను తెలంగాణ నుంచి తరమాలి

ABN , First Publish Date - 2022-05-23T09:33:30+05:30 IST

రైతులు, ప్రజల సమస్యలను గాలికొదిలేసి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ, కొడుకు కేటీఆర్‌ లండన్‌ టూర్లకు వెళ్లారు.

తండ్రీకొడుకులను తెలంగాణ నుంచి తరమాలి

  • రైతుల గోస పట్టని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ 
  • ఒకరు దేశ, మరొకరు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు
  • కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రైతుల జీవితాల్లో వెలుగులు
  • టీఆర్‌ఎస్‌ పాలనలో 88,400 మంది రైతుల ఆత్మహత్య
  • కేటీఆర్‌.. కొడంగల్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: రేవంత్‌
  • టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు కాంగ్రెస్‌లో చేరిక


కొడంగల్‌/దౌల్తాబాద్‌/హైదరాబాద్‌, మే 22(ఆధ్రజ్యోతి): రైతులు, ప్రజల సమస్యలను గాలికొదిలేసి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ, కొడుకు కేటీఆర్‌ లండన్‌ టూర్లకు వెళ్లారు. వారి పర్యటనలతో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులను ఓడించి తెలంగాణ పొలిమేరల నుంచి తరమాలి్‌్‌ అని  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం బొంరా్‌సపేట్‌ మండలం తుంకిమెట్ల, కొడంగల్‌ మండలం అంగడిరాయిచూర్‌, దౌల్తాబాద్‌ మండలం చంద్రకల్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే అమలు చేసే రైతు డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించారు. ఈ డిక్లరేషన్‌ను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పాలన నుంచి విముక్తి కలిగితే తప్ప ప్రజల బతుకులు బాగుపడవన్నారు.


రైతులెవరూ బ్యాంకుల్లో అప్పులు చెల్లించవద్దని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు. కొడంగల్‌ను దత్తత తీసుకున్నామని గత ఎన్నికల్లో చెప్పిన కేటీఆర్‌ ఇక్కడి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్‌ పేరునే కాలగర్భంలో కలిపేందుకు కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే జయశంకర్‌ స్వగ్రామాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచారని విమర్శించారు. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ పాలనలో 88,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పాపం ఊరికే పోదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి శాపం తప్పక తగులుతుందన్నారు. ప్రభుత్వం పంటలకు సరైన విధానంలో ధరలు అమలు చేయకపోవడంతో రైతులు నష్టాలకు గురవుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ హామీల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, 3 ఎకరాల భూ పంపిణీ తదితర వాటిని మూలన పడేసి ఇప్పుడు కొత్త పథకాలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కాగా,  కొడంగల్‌ మండలం అంగడిరాయిరూర్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ సర్పంచ్‌, నాయకులు కుమ్మరి నాగప్పతో పాటు పలువురు యువకులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.  


జయశంకర్‌ స్మృతి వనం నిర్మించాలి

ఆచార్య జయశంకర్‌ స్వగ్రామం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ఆయన పేరిట స్మృతివనం నిర్మించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ ఊరును రెవెన్యూ విలేజ్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈనెల 21న అక్కంపేటలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. అక్కడి పరిస్థితిని సీఎంకు రాసిన లేఖలో వివరించారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లవుతున్నా అక్కంపేటలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించలేదన్నారు. ఆ ఊరు బాగు కోసం టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలూ నీటి మూటలయ్యాయని విమర్శించారు.  పెద్దమనిషి జయశంకర్‌పైన సీఎం కేసీఆర్‌కు ఎంతటి ద్వేష భావన ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. అక్కంపేటలో మిషన్‌ భగిరథ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కాగా.. వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు(ఓఆర్‌ఆర్‌) కోసం చేపట్టిన భూ సేకరణ పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని లేఖలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు.


ఓఆర్‌ఆర్‌ కోసం వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను ేసకరించేందుకు కూడా సిద్ధమైందని, ఫలితంగా లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డునపడే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఇందులో అధిక శాతం సన్న, చిన్నకారు రైతులేనని, ప్రాజెక్టు పేరుతో నోటి కాడి ముద్దను లాక్కుంటే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. భూసేకరణ జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-05-23T09:33:30+05:30 IST