కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం

ABN , First Publish Date - 2022-07-04T10:18:02+05:30 IST

కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాజకీయ తీర్మానం స్పష్టం చేసింది. ఒక కుటుంబం, ఒక రాష్ట్రం కోసం కాకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని పేర్కొంది.

కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం

  • కేసీఆర్‌ కుటుంబ పాలనను సాగనివ్వం.. 
  • విపక్షాలన్నింటినీ ప్రజలు తిరస్కరించారు
  • ఆ పార్టీలది ఎన్నికల రాజకీయం మనది అభివృద్ధి రాజకీయం
  • మహావికాస్‌ అఘాడీని కూల్చడం సరైనదే 
  • 8 ఏళ్లలో భారత్‌లో బహుముఖ అభివృద్ధి
  • బీజేపీ రాజకీయ తీర్మానం
  • జాతీయ కార్యవర్గం ఆమోదం.. మోదీకి ప్రశంసలు


హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాజకీయ తీర్మానం స్పష్టం చేసింది. ఒక కుటుంబం, ఒక రాష్ట్రం కోసం కాకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని పేర్కొంది. దేశంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలన్నీ బలహీనపడ్డాయని, ప్రజలు వాటిని తిరస్కరించారని అభిప్రాయపడింది. విపక్షాలు ఎన్నికల కోసం రాజకీయం చేస్తాయని, బీజేపీ మాత్రం అభివృద్ధి రాజకీయం చేస్తుందని, అందుకే ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొంది. మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం సరైనదేనని, ఆ రాష్ట్ర ప్రజలకు అది మేలు చేస్తుందని వివరించింది. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం బహుముఖ అభివృద్ధిని సాధించిందని తెలిపింది. దీనిపై మోదీకి అభినందనలు చెప్పింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆదివారం ఈ మేరకు రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. రెండు రోజులపాటు చర్చించిన తర్వాత ఈ తీర్మానం ఆమోదం పొందింది. తెలంగాణ నుంచి ఈటల రాజేందర్‌ కూడా ఈ తీర్మానంపై మాట్లాడారు. రాజకీయ తీర్మానంలోనూ మొత్తం దేశ రాజకీయాలతో పాటు తెలంగాణ పరిస్థితులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని, దానిని సాగనివ్వబోమని బీజేపీ రాజకీయ తీర్మానంలో పొందుపరిచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పాలన క్రమంగా కనుమరుగైపోతోందని, అదే కోవలో తెలంగాణ కూడా చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.



ప్రతిపక్షాలది సిద్ధాంతాల్లేని రాజకీయం..

‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఏకపక్షంగా విజయం సాధించాం. ప్రధాని మోదీ నేతృత్వమే ఇందుకు కారణం. దేశీయ కొవిడ్‌ టీకాపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. కానీ, వాటిని పటాపంచలు చేశాం. ఆఖరుకు దేశ సైనిక వ్యవస్థపై, రక్షణ వ్యవస్థపై కూడా విపక్షాలు రచ్చ చేస్తున్నాయి. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను, సైనిక సామర్థ్యాన్ని కూడా అనుమానిస్తున్నాయి. ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా రాజకీయం చేస్తున్నాయి. సోనియా, రాహుల్‌లకు నోటీసులు ఇవ్వడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. వ్యవస్థలు వాటి పని అవి చేస్తున్నాయి’’ బీజేపీ రాజకీయ తీర్మానంలో పేర్కొన్నారు. గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ తీర్మానం హర్షం వ్యక్తం చేసింది. ‘‘బీజేపీ బలం పుంజుకోవడంతో దేశంలో రాజకీయ అస్థిరతకు ఫుల్‌స్టాప్‌ పడింది. రాష్ట్రపతి పదవిని ఒకసారి ఎస్సీకి ఇవ్వగా, ఇప్పుడు ఆదివాసీ మహిళను అభ్యర్థిగా నిలబెట్టాం. దేశంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉంది. జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ.లక్ష కోట్లకు తగ్గకుండా వస్తున్నాయి’’ అని తీర్మానంలో వివరించింది.

Updated Date - 2022-07-04T10:18:02+05:30 IST