తెలంగాణలో దండయాత్రకు ఆంధ్రలో పాదయాత్ర!

ABN , First Publish Date - 2022-08-20T06:04:06+05:30 IST

ఆగస్టు మొదటివారంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అమరావతిలో పాదయాత్ర చేసింది. రాజధాని నిర్మాణం వెంటనే పూర్తి చేయాలనే డిమాండుతో..

తెలంగాణలో దండయాత్రకు ఆంధ్రలో పాదయాత్ర!

ఆగస్టు మొదటివారంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అమరావతిలో పాదయాత్ర చేసింది. రాజధాని నిర్మాణం వెంటనే పూర్తి చేయాలనే డిమాండుతో చేసిన ఈ పాదయాత్రలో రోజుకొకరు చొప్పున సీనియర్ నేతలు పాల్గొన్నారు. యాత్ర కేవలం అమరావతిలోని కీలకమైన పది గ్రామాల్లో మాత్రమే జరిగింది. ఇక్కడ బీజేపీ సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు రెండు ఉన్నాయి. మొదటిది, ముఖ్యమైనది– రాజధాని పది గ్రామాల సమస్య కాదు. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశం. మరి పది గ్రామాల్లో పది కిలోమీటర్లు నడిచిన బీజేపీ నేతలు రాష్ట్రం మొత్తానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకున్నారు? ఇక రెండవది– జగన్ రెడ్డి రాజధాని నిర్మాణాన్ని ఆపేసి రెండున్నరేళ్లు అయ్యింది. మధ్య మధ్యలో అమరావతి కోసం బీజేపీ మాట్లాడినా, సీరియస్సుగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ మధ్య అమరావతి రాజధాని ఉద్యమకారులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో పాదయాత్ర చేసినప్పుడు కూడా, సోము వీర్రాజు అధ్యక్షతన ఉన్న ఏపీ బీజేపీ పట్టించుకోలేదు. కానీ దక్షిణ రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం కోసం తిరుపతి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతుల పాదయాత్రపై దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వస్తున్న ఆ రైతుల ఉద్యమంలో మీరు ఎందుకు పాల్గొనడం లేదని రాష్ట్ర నాయకుల్ని ఆయన నిలదీశారని ఆ పార్టీ నేతలే చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి వీరూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక, ఆ తరువాత చడీ చప్పుడూ లేదు. ఇప్పుడు, అకస్మాత్తుగా ఆగస్టులో అమరావతిలో వారం రోజుల పాదయాత్ర జరిగింది. 


నిజానికి బీజేపీ గాని, దాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గాని అమరావతిలోనే రాజధాని ఉండాలని గట్టిగా భావించి ఉంటే జగన్‌రెడ్డి మూడు ముక్కలాట ఆడగలిగేవారా? బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దోబూచులాడకుంటే, ఈ పాటికి అమరావతిలో రాజధానికి ఒక స్పష్టమైన రూపం వచ్చి ఉండేది, సర్వతోముఖాభివృద్ధి జరిగి ఉండేది. రాష్ట్రానికి ఆదాయం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో మొదలై ఉండేది. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలతో పాటు ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడేవి. ఏపీ ప్రభుత్వం మూర్ఖంగా మూడు ముక్కలాట ఆడుతుంటే, అన్నీ తెలిసిన బీజేపీ, కేంద్రం పట్టనట్టు వ్యవహరించాయి. అది చాలదన్నట్టు రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచాయి.


మరి, ఇప్పుడు బీజేపీ కొత్తగా అమరావతి పాట ఎందుకు ఎత్తుకుంది? ఇక్కడే బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ అడుగులు తెలంగాణలో పరుగుల కోసమని ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలో బీజేపీ చాలా స్పీడుగా ఉంది. మరింతగా కష్టపడితే, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం పక్కా అని కూడా నమ్ముతోంది. అందుకే కనిపించిన ప్రతి వేటకూ ఎర వేస్తోంది. ఇంకా వేటల కోసం వేటాడుతూనే ఉంది. ఆ వెతుకులాటలో భాగంగా దొరికిన అతిపెద్ద వేట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.


ఏపీ రాజకీయాల్లో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఈ కూటమిలోకి టీడీపీ కూడా చేరుతుందా, బీజేపీ చేర్చుకుంటుందా అనే చర్చ ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. అదే సమయంలో జగన్ సర్కారు పైన నిప్పులు చేరుగుతున్న జనసేనాని పవన్ కల్యాణ్, అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీలు ప్రైవేటీకరణ వంటి అంశాల విషయంలో బీజేపీకి తాడోపేడో అన్న సంకేతాలు పంపిస్తున్నారు. పవన్ సంకేతాలు అందుకున్న బీజేపీలో టీడీపీతో అవగాహన విషయంలో సానుకూలత మొదలైంది. సరిగ్గా ఆ సమయంలోనే తెలంగాణలో రాజకీయ అవసరాలను కూడా బీజేపీ గుర్తించింది. తెలంగాణలో సెటిలర్స్‌గా పిలుచుకునే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు అమరావతి వంటి అంశాలలో బీజేపీ పట్ల పూర్తి వ్యతిరేక భావనతో ఉన్నారని ఆ పార్టీ గుర్తించి, అదే అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వానికి చేరవేసింది. సంబంధిత సర్వేలను, లెక్కలను అగ్రనాయకత్వానికి సమర్పించింది.


తెలంగాణలో సెటిలర్స్ ఒక ఎత్తయితే, పూర్తిగా ఆంధ్రమూలాలు ఉన్న కమ్మ సామాజికవర్గ సాంద్రతను కూడా బీజేపీ సీరియస్సుగా పరిగణనలోనికి తీసుకుంటోంది. తెలంగాణలో 6 శాతానికి పైగా కమ్మ ఓటు బ్యాంకు ఉందని లెక్కించారు. ఐదు వేల నుంచి లక్షకు పైగా ఓట్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారు నలభై ఉన్నాయని, వాటిలో సొంతంగా పోటీచేసి గెలవగల నియోజకవర్గాలు 10కి పైగానే ఉన్నాయని, గెలిపించే సత్తా ఉన్న నియోజకవర్గాలు మరో 30 ఉన్నాయని ఢిల్లీకి నివేదికలు వెళ్లాయి. ఈ సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడంలో ఆరెస్సెస్ పెద్దలు కూడా కసరత్తు చేశారంటే బీజేపీ ఆ సామాజిక వర్గ ఓట్ల విషయంలో ఎంత సీరియస్సుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తోడు ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో పాగా వేయాలంటే, ఈ ఎత్తు తప్పదని బీజేపీ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వంటి వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెటిలర్లు టీఆర్‍ఎస్‌కు మద్దతుగా నిలిచారన్నది ఆయన తెరమీదకు తెస్తున్న అంశం. కాని లక్ష్మణ్ వంటి నేతలు కిషన్ రెడ్డి వాదనతో ఏకీభవించడం లేదని చెప్తున్నారు. ఒక వైపు ఏపీలో వైసీపీ కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నది. అలాంటి వైసీపీతో కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు అంటకాగడం, బీజేపీ వైసీపీ ఒక్కటే అనే విధంగా ప్రవర్తించడం, అమరావతి నిర్మాణం ఆగిపోవడం వంటి కారణాల వల్ల మాత్రమే సెటిలర్స్ బీజేపీకి దూరంగా ఉన్నారని, అది టీఆర్ఎస్‌కు దగ్గరగా ఉండడం కాదని జాతీయ నాయకత్వానికి వీరు సోదాహరణంగా చెప్పగలిగారని బీజేపీ ఢిల్లీ కార్యాలయంలో ఉండే ఒక నాయకుడు చెప్పారు. అదే కాకుండా, ఏపీలో బలమైన తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నేతలను, సానుభూతిపరులను జగన్ ప్రభుత్వం దాడులు, కేసులతో నిత్యం వేధిస్తుంటే బీజేపీ నాయకత్వం వైసీపీని ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం సెటిలర్స్‌లో బలంగా ఉందని తెలంగాణ బీజేపీ నమ్ముతోంది. అదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి వివరించగలిగింది.


ఈ పరిణామాల ఫలితమే ఆగస్టు మొదటి వారంలో బీజేపీ జరిపిన అమరావతి పాదయాత్ర. అయితే వారం రోజుల పాదయాత్రకి, అమరావతిని పూర్తి చేయటానికి చాలా తేడా ఉంది. మేం అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం అని బీజేపీ నాయకులు చెప్పడం కంటే, జగన్ ప్రభుత్వానికి ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉన్నది కాబట్టి వెంటబడి నిర్మాణం పూర్తి చేయించడం ముఖ్యం. అలా అయితేనే ఏపీ మాటెలా ఉన్నా తెలంగాణలో సెటిలర్స్ కానీ, కమ్మ సామాజికవర్గం కానీ బీజేపీకి దగ్గరవుతారు. మొన్నటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా జగన్ మూడు రాజధానుల పాటే పాడారు. ఆయన ధోరణిలో మార్పు లేదా, లేక లేని బింకం ప్రదర్శిస్తున్నారా అనే సంశయం లేకపోలేదు. అది సమస్యకు మరో పార్శ్వం. అందువల్ల స్పష్టమైన, వేగవంతమైన చర్యలు లేకపోతే, బీజేపీ మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు.


పర్వతనేని వేంకట కృష్ణ

సీనియర్ జర్నలిస్ట్, టెలివిజన్ వ్యాఖ్యాత

Updated Date - 2022-08-20T06:04:06+05:30 IST