విలువలను హరిస్తున్న బీజేపీ విస్తరణ

ABN , First Publish Date - 2021-02-26T06:27:07+05:30 IST

మనపాలకులు ప్రజాస్వామ్య విలువలు, పద్ధతులను పాటిస్తున్నారా? పుదుచ్చేరి రాజకీయాలు ఈ ప్రశ్నను అనివార్యం చేశాయి. ఒక్క పుదుచ్చేరినే...

విలువలను హరిస్తున్న బీజేపీ విస్తరణ

మనపాలకులు ప్రజాస్వామ్య విలువలు, పద్ధతులను పాటిస్తున్నారా? పుదుచ్చేరి రాజకీయాలు ఈ ప్రశ్నను అనివార్యం చేశాయి. ఒక్క పుదుచ్చేరినే ఎత్తి చూపడమెందుకు, ఏ రాష్ట్రంలో, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో రాజ్యాంగ ధర్మోల్లంఘన జరగలేదు? పుదుచ్చేరికి పథ నిర్దేశిని గోవా. రామజన్మభూమి ఉద్యమం ప్రభావశీలంగా ఉధృతమవుతున్న 1990 దశకంలో గోవా శాసనసభలోకి భారతీయ జనతాపార్టీ ప్రథమంగా అడుగుపెట్టింది. ఇది 1994 నాటి మాట. నలభై స్థానాలు గల గోవా అసెంబ్లీలో బీజేపీ నాలుగు స్థానాలను గెలుచుకున్నది. ఆ గెలుపు అప్పుడొక సంచలనం. ‘ఇది ఆరంభం మాత్రమే, పది సంవత్సరాలలోగా పనాజీలో మేము మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని’ గోవాలో బీజేపీ ప్రధాన వ్యూహకర్త కీర్తిశేషుడు ప్రమోద్ మహాజన్ అన్నారు. మహాజన్ మాట నిజమయింది. కాదూ మరి! ఒక అప్రతిష్ఠాకర సంప్రదాయానికి ఘనమైన నెలవు గోవా. నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడడంలో గోవన్ రాజకీయవేత్తలు మహాఘనులు. కనుకనే 2002లో మనోహర్ పారీకర్ నేతృత్వంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఒకటి పనాజీలో కొలువుదీరింది. మరో పది సంవత్సరాలకే బీజేపీ తన సొంత మెజారిటీతో పారీకర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది మరి. 


పశ్చిమ భారతతీరంలో పోర్చుగీస్ వలసరాజ్యంగా వర్థిల్లిన గోవాలో నాడు జరిపిన చాణక్య తంత్రాన్ని, తూర్పుతీరంలో ఫ్రెంచ్ వలసస్థావరంగా వెలుగొందిన పుదుచ్చేరిలో నేడు పునరావృతం చేసే ప్రయత్నం జరిగింది. మృదుభాషి ప్రమోద్ మహాజన్ 1990లలో నిర్వహించిన చాణక్యపాత్రను ఇప్పుడు జగమొండి అమిత్ షా నిర్వహిస్తున్నారు. నాడు బీజేపీ, అధికార సాధనలో పురోగమిస్తున్న ఒక ప్రధాన పోటీదారు మాత్రమే కాగా వర్తమానంలో ఒక ప్రబల అధికార శక్తి. కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి అపార ఆర్థిక వనరులే కాదు ‘అపర చాణక్యుడూ’ ఉన్నాడు. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఏ ప్రతిపక్ష ప్రభుత్వాన్ని అయినా కూల్చి వేయగల చాకచక్యం అన్ని విధాల ఉన్న ఏకైక పార్టీ బీజేపీయే అనడంలో ఎవరికీ ఎటువంటి రెండో అభిప్రాయం లేదు.


ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో బీజేపీ ఇలా ఎందుకు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది? అందునా ఎన్నికలు సమీపించిన తరుణంలో ఇలా వ్యవహరించడమేమిటి? అసంఖ్యాకులు వేస్తున్న ప్రశ్నలివి. మొదటి నుంచీ కాంగ్రెస్, స్థానిక పార్టీల ప్రాబల్యం ఉన్న ప్రాంతం పుదుచ్చేరి. ఇక్కడ అధికారంలో లేకపోవడం వల్ల బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు. మరి ఎందుకు అధికారానికి ఆరాటపడింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఘటనలను కాల క్రమానుసారంగా అర్థం చేసుకోవల్సి ఉంది.


2016లో వి. నారాయణసామి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే కలహశీల ఐఏఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజకీయాలలోకి ప్రవేశించిన బేడీ లక్ష్యపరిపూర్తిలో విఫలమవడంతో మోదీ ప్రభుత్వం ఆమెను పుదుచ్చేరి రాజ్‌నివాస్‌కు పంపించింది. పదవీప్రమాణం చేసింది మొదలు ముఖ్యమంత్రికి, ఆమెకు పొసగలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ఆమె శతథా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె కేవలం అధికార పక్షాన్ని మాత్రమే కాకుండా సమస్త రాజకీయవాదులనూ దూరం చేసుకున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలో కిరణ్‌బేడీని ఇంకెంతమాత్రం కొనసాగించడం క్షేమకరం కాదని మోదీ సర్కార్ గుర్తించింది. ఫలితమే ఆమెకు ఉద్వాసన. బేడీ స్థానంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళసై సౌందరాజన్‌కు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో కాంగ్రెస్-–డిఎంకె కూటమి నుంచి ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహించింది. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు, తమకు సానుకూలంగా ఉన్న అసెంబ్లీ స్సీకర్ సహాయంతో నారాయణసామి ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలలో కనీసం నలుగురిపై ఆదాయపు పన్ను సంబంధిత ఆరోపణలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో సంబంధాలూ ఉన్న కారణంగా వారు తీవ్ర ఒత్తిళ్ళతో పాటు ప్రలోభాలకూ లోనయ్యారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం ద్వారా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పొరుగు రాష్ట్రం తమిళనాడుకు ఒక సందేశాన్ని బీజేపీ పంపింది. కాంగ్రెస్ క్షీణిస్తున్న పార్టీ అని, అది భాగస్వామిగా ఉన్న ఏ కూటమికి ఓటు వేసినా ప్రయోజనముండదన్నదే ఆ సందేశం. అన్నా డిఎంకె- బీజేపీ సంకీర్ణానికి ఓటు వేసేలా తమిళనాడు ఓటర్లను పురికొల్పడమే బీజేపీ లక్ష్యం. కూలిపోయిన నారాయణసామి ప్రభుత్వానికి విశేషస్థాయిలో ప్రజల మద్దతును కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా పుదుచ్చేరిలో భావి ఘటనలను బీజేపీ నిర్దేశిస్తోంది. 


విశాల భారతావని అంతటా అధికారాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ ఒక పథకం ప్రకారం అమలురుస్తున్న చాణక్యతంత్రాల్లో భాగంగానే పుదుచ్చేరి రాజకీయాలు మలుపు తిరిగాయి. ఈశాన్యభారతంలో అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్; పశ్చిమభారతంలో గోవా; దక్షిణాదిన కర్ణాటక, మధ్య భారత్‌లో మధ్యప్రదేశ్‌లో సాధించిన విజయాన్ని పుదుచ్చేరిలో పునరావృతం చేయాలని బీజేపీ సంకల్పించింది. ఏదో ఒక విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా తన బలాన్ని విస్తరించుకునేందుకు బీజేపీ పూనుకున్నది. పార్టీ ఫిరాయింపులకు తమ ఎమ్మెల్ల్యేలను బీజేపీ ప్రోత్సహించడంపై కాంగ్రెస్ విస్మయానికి లోనయినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే బీజేపీ రహస్య ఆకాంక్షలను పసిగట్టడంలో కాంగ్రెస్ ఎందుకు విఫలమయింది. అసలు ఫిరాయింపుల రాజకీయాలకు తొలుత పాల్పడింది కాంగ్రెస్ పార్టీయే కాదూ?


నరేంద్రమోదీ–అమిత్ షా నేతృత్వంలోని ‘కొత్త’ బీజేపీ ఇందిరాగాంధీ హయాంలోని ‘పాత’ కాంగ్రెస్ వంటిది. ఒక లక్ష్యసాధనలో నైతికంగా రాజీపడినా రాజకీయంగా రాజీ అనేది ఉండదు. కొవిడ్–-19 విలయంలో సైతం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పుడు, ఎన్నికలు ఆసన్నమైన తరుణంలోనైనా పుదుచ్చేరి ప్రభుత్వం ఎందుకు సురక్షితంగా ఉండాలి? 


నిజమేమిటంటే ఏ ప్రతిపక్ష ప్రభుత్వానికి భద్రత లేదు. మధ్యప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రంలోనైనా సరే, లేక సాపేక్షంగా పెద్ద ప్రాధాన్యం లేని పుదుచ్చేరి లాంటి కేంద్ర పాలిత ప్రాంతమైనా సరే విపక్షాల సారథ్యంలోని ప్రభుత్వాలకు మనుగడ ఉండకూడదన్నదే ‘కొత్త’ బీజేపీ లక్ష్యం. రాష్ట్రాలలోని బీజేపీయేతర ప్రతిపక్ష ప్రభుత్వాలను మూడు తరగతులుగా వర్గీకరించవచ్చు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు మొదటి శ్రేణిలోకి వస్తాయి. ఇప్పుడు దేశంలో కేవలం మూడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే ఉన్నాయి. బీజేపీ సహజంగానే వాటిని తన లక్ష్యంగా చేసుకున్నది. పంజాబ్ విషయంలో బీజేపీ పన్నాగాలు ఫలించే అవకాశం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనల అనంతరం ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు సానుకూల పరిస్థితులు పటిష్ఠమయ్యాయి. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్నందున అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి భద్రత ఉంది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు గత ఏడాది చేసిన ప్రయత్నం విఫలమయింది. అయితే నరేంద్రమోదీ–-అమిత్ షా ద్వయం అంతటితో వదిలిపెడుతుందా? అసంభవం. మరింత పటిష్ఠ పథకాలతో మరిన్ని ప్రయత్నాలు తప్పక జరిగితీరుతాయి. 


ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు రెండోశ్రేణిలోకి వస్తాయి. ఈ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు తమ మనుగడకు కేంద్రంతో బహిరంగ లేదా రహస్య ఒప్పందానికి వచ్చి ఉంటాయి. పోషకుడు- ఆశ్రితుడు మధ్య ఉన్న సంబంధాలే కేంద్రం, ఈ రాష్ట్రాల మధ్య ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర, ఒడిషాలు ఇందుకు ఉదాహరణలు. ఈ మూడు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాధినేతదే తొలిమాట, తుది మాట. వారందరూ కేంద్రంతో ఏదో ఒక విధంగా రాజీపడినవారేనని చెప్పవచ్చు. కనుక ఈ ప్రభుత్వాలను కూల్చివేయడంలో బీజేపీ నిమ్మళంగా వ్యవహరిస్తోంది. తగిన సమయం ఆసన్నమయినప్పుడు తన లక్ష్య పరిపూర్తికి ఏమాత్రం ఆలసించదు. ప్రతిపక్షాల సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడో శ్రేణిలోకి వస్తాయి. మహారాష్ట్ర , జార్ఖండ్ ఇందుకు ఉదాహరణలు. మహారాష్ట్ర అమిత ప్రాధాన్యమున్న కీలక రాష్ట్రం. ఒకనాటి హిందూత్వ భాగస్వామి నేతృత్వంలోని మూడు పార్టీల సంకీర్ణసర్కార్ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మహారాష్ట్రలో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. రాబోయే నెలల్లో మహారాష్ట్ర రాజకీయాలలో మలుపులు, మార్పులు విశేషంగా జరగడం ఖాయం. 


ఇక రెండే రెండు రాష్ట్రాలు మిగిలాయి. అవి: బెంగాల్, కేరళ. బీజేపీని సమర్థంగా ఎదుర్కొంటున్న రెండు రాష్ట్రాలలోనూ ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో బీజేపీ క్రమంగా తన ప్రజాబలాన్ని పెంపొందించుకుంటోంది. అయితే అధికార సాధన అంత సులువు కాదు. ఇక బెంగాల్‌లో ‘అన్ని యుద్ధాలకు జనని’ లాంటి మహా యుద్ధం జరగనున్నది. మమతా బెనర్జీ నుంచి అధికారాన్ని కైవసం చేసుకోవడంలో బీజేపీ విజయవంతమయితే ‘ప్రతిపక్షాల నుంచి విముక్తమయిన భారత్’ (అపోజిషన్–ముక్త్)కు మన్ చేరువవుతాము. ఈ ‘విముక్తి’ పర్యవసానాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటాయి. మన బహుళ-పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ ముప్పులో పడుతుంది.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2021-02-26T06:27:07+05:30 IST