Abn logo
Jun 3 2020 @ 00:00AM

విరాళాల కోసం ‘బిర్యానీ ఛాలెంజ్‌’

లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చేందుకు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేరళలోని అలప్పుజాకు చెందిన యువత కూడా తమ వంతు సాయం చేయాలనుకున్నారు. వారికి ఫుడ్‌ డెలివరీ ద్వారా డబ్బు సమకూర్చవచ్చనే ఆలోచన వచ్చింది. సరికొత్తగా ‘బిర్యానీ ఛాలెంజ్‌’ మొదలెట్టారు. రోజూ బిర్యానీలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆలోచన బాగుంది కానీ వర్కవుట్‌ అవుతుందో! లేదో అని మొదట్లో అనుమానం ఉండేది అందరిలో. కానీ ‘బిర్యానీ ఛాలెంజ్‌’ ఊహించిన దానికన్నా పెద్ద హిట్‌ అయింది. 


ఫేస్‌బుక్‌ ద్యారా ఆర్డర్లు

అలప్పుజాకు చెందిన ‘ఆలిండియా యూత్‌ ఫెడరేషన్‌’(ఏఐవైఎఫ్‌) సభ్యులు వార్డుల వారీగా ఒక బృందంగా ఏర్పడి ఆన్‌లైన్‌ ద్వారా బిర్యానీ అమ్మాలనుకున్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా ‘చికెన్‌ బిర్యానీ’ ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించారు. బిర్యానీ వడడంలో స్థానికంగా పేరున్న వంటవాళ్లతో ఆర్డర్‌ను బట్టి ఎన్ని పార్సిళ్లు అవసరమో అంత వండించేవారు. తామే ప్యాకింగ్‌ చేసి వేడి వేడి బిర్యానీ పార్సిల్‌ను ఇంటి వద్దకే తీసుకెళ్లి ఇచ్చేవారు. అలా సుమారు రూ.4 లక్షల వరకూ సేకరించి సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ‘‘లాక్‌డౌన్‌ వేళ సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వాలనే ఆలోచనతోనే ‘బిర్యానీ ఛాలెంజ్‌’ మొదలెట్టాం.  చెర్తలా, అంబాలప్పుజా పట్టణాల్లో రూ.100కు చికెన్‌ బిర్యానీ అందించడం మొదలుపెట్టాం. ఆర్డర్‌ అందగానే ప్రత్యేక ప్రాంతాల్లో బిర్యానీ వండించి, సమయానికి డెలివరీ చేసేవాళ్లం. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు డోర్‌ డెలివరీ ఇచ్చేవాళ్లం. రోజుకు పదివేలకు పైగా పార్సిళ్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా ‘బిర్యానీ ఛాలెంజ్‌’ అందరికీ చేరువయ్యేలా సోషల్‌మీడియాలో క్యాంపెయిన్‌ కూడా చేశాం. క్రమంగా మరిన్ని ప్రాంతాల్లో ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టాలనుకుంటున్నాం’’ అంటున్నారు ఏఐవైఎఫ్‌ సెక్రటరీ హుస్సేన్‌. ఈ క్లిష్ట సమయంలో తమకు తోచిన విధంగా సాయం చేయాలనే వీరి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement