ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు

ABN , First Publish Date - 2021-01-19T10:00:54+05:30 IST

బయో ఏషియా-2021 అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 22, 23 తేదీల్లో జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈసారి సదస్సును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు

ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు

థీమ్‌, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): బయో ఏషియా-2021 అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 22, 23 తేదీల్లో జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈసారి సదస్సును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు నోబెల్‌, లాస్కర్‌, బ్రేక్‌త్రూ అవార్డు గ్రహీతలు ఇందులో పాల్గొననున్నారు. బయోఏషియా 18వ ఎడిషన్‌ థీమ్‌, వెబ్‌సైట్‌ను మంత్రి కె.తారకరామారావు సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయో ఏషియా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రధాన కార్యక్రమమని అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో అవకాశాలతో పాటు సవాళ్లు, పరిష్కారాలను చర్చించే అంతర్జాతీయ సమావేశమ ని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ సిబ్బందిని ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 1,500 మంది ఉన్నతస్థాయి అధికారులు పాల్గొంటారని బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్‌ తెలిపారు. మొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది లైఫ్‌ సైన్సెస్‌ నిపుణులు భాగస్వామ్యమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.


ఉద్యోగుల వల్లే 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు

తెలంగాణా ఉద్యమంలో విద్యుత్తు ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం అని  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.  కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగుల పనితీరు వల్లే అద్భుత ఫలితాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.  ప్రగతిభవన్‌లో ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ల అసోసియేషన్‌ 2021 డైరీ, క్యాలెండర్‌లను సోమవారం విద్యుత్తు శాఖా మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరా హామీని విజయవంతం చేయడం వెనుక విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది తోడ్పాటు ఉందన్నారు.  ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వర్‌ శెట్టి, సలహాదారుడు అలుగుబెల్లి సురేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T10:00:54+05:30 IST