2072 దాకా బిందాస్‌!

ABN , First Publish Date - 2022-05-15T08:37:14+05:30 IST

హైదరాబాద్‌ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

2072 దాకా బిందాస్‌!

  • హైదరాబాద్‌కు తాగునీటి ఇబ్బందే ఉండదు
  • ఢిల్లీ తర్వాత హైదరాబాదే అతిపెద్ద నగరం.. 
  • బుద్ధవనం స్వర్గధామం అవుతుంది
  • సాగర్‌ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. 
  • నల్లగొండ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్‌

నల్లగొండ, మే 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం బుద్ధవనాన్ని ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ బ్యాక్‌ వాటర్‌కు సమీపంలో సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌ వెల్‌ పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. వరుసగా ఏడేళ్లు కరువు వచ్చినా హైదరాబాద్‌లో తాగునీటికి తిప్పలు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు.


ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల, చుట్టూ కూడా వాటర్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో హైదరాబాద్‌ నగరం వంద కిలోమీటర్లు విస్తరించినా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌ మరి కొద్దిరోజుల్లో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా అవతరిస్తుందని, ఇది మనందరికీ గర్వకారణమని చెప్పారు. మెట్రోవాటర్‌ సప్లయ్‌, సీవరేజ్‌ బోర్డు ఆధ్వర్యంలో రూ.6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత హైదరాబాద్‌ నీటి అవసరాలు 37 టీఎంసీలు కాగా, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు. సుంకిశాలలో రూ.1450 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి అవసరాలకు పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టీఎంసీలు ఎత్తిపోయడానికి పనులు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే ఎండాకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైదరాబాద్‌ ప్రజలకు తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.


బుద్ధవనం స్వర్గధామం అవుతుంది

బౌద్ధప్రియులు, పర్యాటకులకు బుద్ధవనం స్వర్గధామం అవుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జపాన్‌, చైనా, దక్షిణ కొరియా, తైవాన్‌కో వెళ్లినప్పుడు వారు గౌతమబుద్ధుడిని కొలిచే, ఆరాధించే విధానం గొప్పగా ఉంటుందని.. మీరు బుద్ధుడు జన్మించిన దేశం నుంచి వచ్చారా? అన్న ఆరాధన భావంతో పలకరిస్తుంటే గర్వంగా అనిపిస్తుందన్నారు. 15 ఏళ్ల కిందట సీఎం కేసీఆర్‌ సహా కుటుంబ సభ్యులమంతా బోధిగయకు వెళ్లినట్లు చెప్పారు. బుద్ధం శరణం, సంఘం శరణం, ధర్మం శరణం గచ్ఛామి.. వీటిని అవలంబిస్తే నేడు సమాజంలో కొన్ని అవలక్షణాలు ఉండేవి కావేమో అనిపిస్తాయని తెలిపారు. ముస్లింలు మక్కాకు, యూదు లు జెరూసలెం, క్రైస్తవులు వాటికన్‌కు వెళ్లినట్లుగానే బౌద్ధులు భారతదేశానికి వస్తారని చెప్పారు. అందుకనుగుణంగా దేశంలో బౌద్ధారామాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇక్కడ 274 ఎకరాలు అందుబాటులో ఉండగా 90 ఎకరాలు మాత్రమే వినియోగించుకున్నామని, మిగిలిన ప్రాం తం వినియోగించుకునేందుకు కావాల్సిన నిధులు కేటాయించాలని మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు. బౌద్ధ యూనివర్సిటీ ప్రారంభించడానికి కొంతమంది ముందుకొచ్చారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతామని కేటీఆర్‌  చెప్పారు. పక్కనే 400 ఎకరాల్లో ఉన్న చాకలిగుట్ట ద్వీపాన్ని చక్కగా తీర్చిదిద్దవచ్చని స్థానిక ఎమ్మెల్యే భగత్‌ కోరారు. తప్పకుండా అది కూడా చేస్తామని మంత్రి అన్నారు. బౌద్ధం చాలా విస్తారంగా ఉన్న చైనా, థాయిలాండ్‌ వంటి ఆరేడు దేశాలకు చెందిన రాయబారులను ఒక బృందంగా ఇక్కడికి ఆహ్వానిస్తామన్నారు. తాము విదేశీ ప్రతినిధులకు గుర్తుగా రకరకాల జ్ఞాపికలను ఇస్తుంటామని.. సాగర్‌కు సంబంఽధించిన విశేషాలను ప్రతిబింబించేలా మెమొంటోలు సిద్ధం చేస్తే బాగుంటుందని కేటీఆర్‌ సలహా ఇచ్చారు. రాబోయే రోజుల్లో సీఎం అనుమతి తీసుకొని దలైలామా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రముఖులను బుద్ధవనానికి ఆహ్వానిద్దామని ఆయన చెప్పారు.  


హామీలన్నీ అమలు..

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ శరవేగంగా అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇక్కడ గులాబీ జెండా ఎగిరిన తర్వాత ఇప్పటి వరకు రూ.830 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రూ.680 కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం చేపడుతున్నామని చెప్పారు. ఇక్కడి విపక్ష నాయకుల చేతకానితనం వల్లే ఫ్లోరైడ్‌ మహమ్మారి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను జీవచ్ఛవాల్లా మార్చిందని ఆరోపించారు. ఫ్లోరైడ్‌ సమస్యపై జాతీయ స్థాయిలో పోరాటం చేసిన కేసీఆర్‌ అధికారంలోకి రాగా నే మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత నీటిని అందించి ఫ్లోరైడ్‌ మహమ్మారిని అంతం చేశారన్నారు. కార్యకమ్రంలో మంత్రులు సబిత, శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, తలసాని, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-15T08:37:14+05:30 IST