Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 25 Feb 2022 03:00:25 IST

ఇలాంటి మహమ్మారి మళ్లీ రాదు

twitter-iconwatsapp-iconfb-icon
ఇలాంటి మహమ్మారి మళ్లీ రాదు

  • కరోనా అనుభవం మెరుగైన భవిష్యత్తుకు దోహదం
  • మహమ్మారులను ఎదుర్కొనే సామర్థ్యం వచ్చింది
  • వ్యాక్సిన్ల విషయంలో భారతీయ కంపెనీల కృషి భేష్‌
  • హెచ్‌ఐవీ, పోషకాహారలోపం నిర్మూలన నా ప్రాధాన్యాలు
  • కేటీఆర్‌తో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ‘కరోనా వల్ల గత రెండేళ్లలో ప్రపంచం చాలా నష్టపోయింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అయినా.. ఈ అనుభవం ప్రపంచానికి చాలా ఉపయోగపడనుంది. భవిష్యత్తులో వచ్చే ఇలాంటి మహమ్మారులను తట్టుకునే సామర్థ్యం ఇప్పడు ప్రపంచానికి ఉంది’ అని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు, బిల్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహ అధ్యక్షుడు బిల్‌ గేట్స్‌ అన్నారు. బయో ఆసియా-2022 సదస్సులో భాగంగా గురువారం బిల్‌ గేట్స్‌తో మంత్రి కేటీఆర్‌ ఆన్‌లైన్‌లో సంభాషించారు. ఆ వివరాలు..


ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారితో ప్రపంచం ఏం నేర్చుకుందని భావిస్తున్నారు?

కరోనా విషయంలో ప్రపంచం వేగంగా స్పందించక పోవడంతో మరణాలు ఎక్కువగా సంభవించాయి. ఆస్ర్టేలియా లాంటి కొన్ని దేశాలు మాత్రమే కొవిడ్‌ను ముం దుగా గుర్తించి వ్యాప్తిని అడ్డుకున్నాయి. అనేక ధనిక దేశాలు కూడా ఈ విషయంలో వెనకబడ్డాయి. అయినా వాక్సిన్లతో కరోనాను నియంత్రించగలిగాం. వ్యాక్సిన్ల తయారీ, రవాణాలో భారత్‌ ప్రశంసనీయ పాత్ర పోషించింది. వ్యాక్సిన్‌ కోసం భారత్‌లోని ఫార్మా కంపెనీలు విశేషంగా కృషి చేశాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. ఈ చర్యలు భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను సమర్థం గా ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఇలాంటివి వచ్చినా ఇంత నష్టం మాత్రం జరగదు.  


భవిష్యత్తులో వైరస్‌లు వస్తే ఎలా సన్నద్ధం కావాలి?

వందేళ్ల క్రితం ఇలాంటి మహమ్మారి వచ్చింది. కానీ.. కరోనా వైరస్‌ మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రభా వం చూపలేదు. వ్యాక్సిన్ల రంగంలో ప్రపంచం ఎంతో అభివృద్ధి సాధించింది. డయాగ్నస్టిక్స్‌పైనా దృష్టి సారించాల్సి ఉంది. కరోనా వైర్‌సతో నేను అనేక పాఠాలు నేర్చుకున్నాను. దీనిపై నా అభిప్రాయాలు తెలిపేందుకు ఓ పుస్తకం రాస్తున్నాను. అకడమిక్‌, ప్రైవేటు రంగాలతో కలి సి మేము ఇప్పటికే వ్యాక్సిన్లు, డయాగ్నస్టిక్స్‌ అంశాల్లో పనిచేస్తున్నాం. క్యాన్సర్‌, హృద్రోగ వ్యాధులపై కొన్ని ధనిక దేశాల్లోనూ పెద్దగా పరిశోధనలు జరగడం లేదు. తీవ్ర వ్యాధులపై దృష్టి పెట్టాలని ఈ మహమ్మారి ద్వారా ప్రపంచం తెలుసుకుంది. భవిష్యత్తులో ఇలాంటివాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే బయోలాజికల్‌ ఇన్నోవేషన్‌ అత్యంత కీలకం. కరోనా అనుభవంతో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి.


పెరుగుతున్న యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) సమస్యను ఎలా ఎదుర్కోవాలి..? 

అంతర్జాతీయ వైద్య పరిశోధనల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా 13లక్షల మరణాలు ఏఎంఆర్‌ కారణంగా సంభవిస్తున్నాయు. ఇతర వ్యాధులతో  పోలిస్తే ఇది పెద్ద సంఖ్య కాకపోయినా.. భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంది. న్యుమోనియా, టైఫాయిడ్‌, కాన్పు సమయంలో చేసే వైద్యంతో ఏఎంఆర్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేని కొత్త ఔషధాల కోసం మాఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే ఫలితం రావచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని దేశాల్లో ప్రాణాలను హరిస్తున్నాయి. ఆఫ్రికాలో ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాలు ఇతర దేశాలతో పోలిస్తే 20రెట్లు ఎక్కువ. 


మీరు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్న మెడికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ హైదరాబాద్‌లోని ఔషధ కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశం ఉందా..? 

కరోనా విషయంలో ఎంఆర్‌ఐ చాలా బాగా ఉపయోగపడింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల వివరాలను సేకరించడంతోపాటు కరోనా తీరును గమనించి, అనుగుణంగా వ్యాక్సీన్ల తయారీకి ఎంఆర్‌ఐ సహకారం అందించింది. ఎంఆర్‌ఐ నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌తోపాటు భారత్‌లోని ఇతర ప్రాంతాల నిపుణులు కూడా ఉన్నారు. హెచ్‌ఐవీ తదితర వ్యాధులపై పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఐరోపా, యూఎ్‌సలలో మాత్రమే ఎంఆర్‌ఐ అందుబాటులో ఉంది.  


భవిష్యత్తులో వైద్యంలో రాబోయే టెక్నాలజీ ఏంటి? 

ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు కృత్రిమ మేధ చాలా ఉపయోగపడబోతోంది. ఇప్పటికే సెన్సార్ల సాయంతో స్మార్ట్‌వాచ్‌లు పెరిగాయి. ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు వస్తాయి. 


మీ భవిష్యత్తు ప్రాధాన్యతలు..? 

హెచ్‌ఐవీని పూర్తిగా నిర్మూలించడానికి వ్యాక్సీన్‌ను తయారుచేయడం నా ప్రాధాన్యతల్లో మొదటి స్థానం. ఆ తర్వాత పోషకాహారలోపం సమస్యను నిర్మూలించాలి. వచ్చే పదేళ్లలో వీటి కోసం కృషిచేయడం నా లక్ష్యం.


మిమ్మల్ని హైదరాబాద్‌లో ఎప్పుడు చూడొచ్చు? 

గతంలో హైదరాబాద్‌ వచ్చాను. అక్కడికి రావాలని ఆసక్తిగా ఉంది. అయితే కొన్నేళ్ల నుంచి ప్ర యాణాలు చేయడం లేదు. గత రెండేళ్లలో వ్యాక్సీన్‌ కోసం హైదరాబాద్‌లోని కంపెనీలు బాగా పనిచేశాయి. అక్కడి వ్యాక్సిన్‌ దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయింది. బయో ఏషియా ఏర్పాటు చేసిన మీ భాగస్వాములకు అభినందనలు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.