దళిత కౌన్సిలర్‌కు బిల్లు కష్టాలు

ABN , First Publish Date - 2021-07-26T08:05:54+05:30 IST

దళితుల బతుకులను మార్చేస్తామని, వారి అభివృద్ధి కోసం లక్ష కోట్లయినా ఖర్చు పెడతామని ప్రభుత్వం ఓవైపు ప్రకటిస్తుంటే..

దళిత కౌన్సిలర్‌కు బిల్లు కష్టాలు

దళిత కౌన్సిలర్‌కు బిల్లు కష్టాలు

అప్పులు చేసి రూ.5 లక్షల విలువైన పనులు

బిల్లులు చెల్లించని మునిసిపల్‌ అధికారులు

అప్పులు తీర్చేందుకు వ్యవసాయ భూమి

విక్రయానికి సిద్ధపడ్డ చౌటుప్పల్‌ కౌన్సిలర్‌ మల్లేశం

చౌటుప్పల్‌ టౌన్‌, జూలై 25: దళితుల బతుకులను మార్చేస్తామని, వారి అభివృద్ధి కోసం లక్ష కోట్లయినా ఖర్చు పెడతామని ప్రభుత్వం ఓవైపు ప్రకటిస్తుంటే.. మరోవైపు ఓ దళిత ప్రజా ప్రతినిధి తాను చేసిన పనులకు బిల్లులు రాక, ఆ పనుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు సొంత వ్యవసాయ భూమిని అమ్ముకునే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని మూడో వార్డు కౌన్సిలర్‌ బండమీది మల్లేశం ఎదుర్కొంటున్న దుస్థితి ఇది. గత ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన మొదటి విడత ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం నుంచి ఈ నెలలో నిర్వహించిన రెండో విడత ‘పట్టణ ప్రగతి’ దాకా 16 నెలల కాలంలో తన వార్డు పరిధిలో మల్లేశం పలు అభివృద్ధి, సంక్షేమ పనులు చేయించారు. ఇందుకు కూలీలకు, ట్రాక్టర్‌కు, ఎక్స్‌కవేటర్‌ కిరాయి చెల్లించేందుకు కౌన్సిలర్‌ మల్లేశం ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షలు అప్పు చేశారు.


అయితే ఈ పనులకు సంబంధించిన బిల్లులను మునిసిపాలిటీ అధికారులు ఇప్పటికీ చెల్లించలేదు. సుమారు రూ.5 లక్షల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కౌన్సిలర్‌ ప్రతిరోజూ మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లడం, అధికారుల నుంచి స్పందన లేక వెనుదిరగడం జరుగుతోంది. గత కమిషనర్‌ హయాంలో చేసిన పనుల బిల్లుల చెల్లింపునకు తనకు సంబంధం లేదని ప్రస్తుత కమిషనర్‌ చెబుతున్నారని మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా అప్పులు తీర్చేందుకు తన మూడెకరాల వ్యవసాయ భూమిని విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 


దళితుడినైనందునే నాపై వివక్ష

మునిసిపాలిటీలో రూ.కోట్ల నిధులు ఉన్నా 16 నెలలుగా బిల్లులు చెల్లించడంలేదు. దళితుడినైందునే అధికారులు నాపై వివక్ష చూపుతున్నారు. అభివృద్ధి పనులకు రూ.3లక్షలు మేర అప్పు చేశాను. అది తీర్చేందుకు నా పేరిట ఉన్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిని విక్రయించే దుస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతా. 

-బండమీది మల్లేశం

ఎంబీ రికార్డులు చేయలేదు

పర్మినెంట్‌ ఏఈ లేనందున పనులకు సంబంధించి ఎంబీ(మెజర్‌మెంట్‌ బుక్‌)లో రికార్డు చేయలేదు. ఇన్‌చార్జి ఏఈలతో ఎంబీలో రికార్డు చేయడంలో జాప్యం జరుగుతోంది. రికార్డు చేసిన పనుల బిల్లులను వెంటనే చెల్లిస్తున్నాం. మూడు నెలల క్రితం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించా. ఈ మూడు నెలల వ్యవధిలో ఎంబీలో నమోదు చేసిన  బిల్లులను పెండింగ్‌లో పెట్టలేదు.

-కె. నర్సింహారెడ్డి, కమిషనర్‌, చౌటుప్పల్‌ మునిసిపాలిటీ

Updated Date - 2021-07-26T08:05:54+05:30 IST