50 లక్షలు దాటిన కేసులు.. గుండె తరుక్కుపోతోందన్న జో బైడెన్

ABN , First Publish Date - 2020-08-10T07:04:25+05:30 IST

అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది.

50 లక్షలు దాటిన కేసులు.. గుండె తరుక్కుపోతోందన్న జో బైడెన్

వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అమెరికాలో కేసుల సంఖ్యను చూస్తోంటే గుండె తరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా నిత్యం ఎన్నో కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని, ఎవరో ఒకరి జీవితం తలకిందులు అవుతోందని జో బైడెన్ పేర్కొన్నారు. అమెరికన్లు ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలంటూ ఆయన సూచించారు. ఈ కేసులు, మరణాల వల్ల ఏర్పడిన నష్టాలు భరించలేనివిగా అనిపించవచ్చని.. అయితే కరోనాతో పోరాడటం మాత్రం విడువకూడదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు సైన్స్‌ను అనుసరిస్తూ వైద్యులు సూచించిన విధంగా ఫేస్‌మాస్క్‌ను ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలన్నారు. మరోపక్క ఇదే ప్రకటనలో ఆయన ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికి ట్రంప్ నుంచి సాకులు, అబద్దాలతో పాటు మరెన్నో విషయాలు వింటూనే ఉన్నామని జో బైడెన్ అన్నారు. ట్రంప్ నాయకత్వ లోపం అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందన్నారు. ట్రంప్ నాయకత్వంలో మహమ్మారి మరింత వ్యాప్తి చెందిందని జో బైడెన్ విమర్శించారు. కాగా.. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు 5,032,299 కేసులు నమోదు కాగా.. కరోనా కారణంగా 162,707 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-08-10T07:04:25+05:30 IST