ఈ దారుణాలు ఆగ్రహం కలిగించాయి: అమెరికా అధ్యక్షుడు బైడెన్

ABN , First Publish Date - 2022-08-09T02:51:55+05:30 IST

న్యూమెక్సికో రాష్ట్రంలోని ఆల్బకర్కీ నగరంలో నలుగురు ముస్లింల హత్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు.

ఈ దారుణాలు ఆగ్రహం కలిగించాయి: అమెరికా అధ్యక్షుడు బైడెన్

ఎన్నారై డెస్క్: న్యూమెక్సికో రాష్ట్రంలోని ఆల్బకర్కీ నగరంలో నలుగురు ముస్లింల హత్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. ఈ దారుణాలు ఆగ్రహం కలిగించాయని ఆయన వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలను చూస్తే విచారం కలుగుతోందని పేర్కొన్నారు. ద్వేషపూరిత దాడులకు అమెరికాలో స్థానం లేదని తేల్చి చెప్పారు. ముస్లింలకు తాము అండగా నిలుస్తామంటూ ట్వీట్ చేశారు. 


గత నవంబర్ మొదలు ఆల్బర్కీ నగరంలో.. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ మూలాలున్న ముస్లింలే లక్ష్యంగా ఇప్పటివరకూ నాలుగు ప్రాణాంతక దాడులు జరిగాయి. రెండు వారాల క్రితం ఇద్దరు ఈ ద్వేషపూరిత దాడులకు బలవవ్వగా.. శుక్రవారం మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ద్వేషపూరిత దాడులకు బలైన ఇద్దరు వ్యక్తుల అంత్యక్రియలకు హాజరైన సందర్భంలోనే మూడో వ్యక్తి నేలకొరిగాడు. మరోవైపు..  నిందితులను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.


నిందితులు వాడినదిగా భావిస్తున్న కారును పోలీసులు విలుదల చేశారు. ఈ కారు వివరాలు తెలిసిన వారు ముందుకు రావాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆల్బకర్కీ పోలీసులు తెలిపారు. ఇవన్నీ ముస్లింలే టార్గెట్‌గా జరుగుతున్న దాడులని న్యూమెక్సికో గవర్నర్ మిషేల్ లూజాన్ గ్రీషమ్ వ్యాఖ్యానించారు. ఈ దాడులు ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతున్నాయి.  



Updated Date - 2022-08-09T02:51:55+05:30 IST