AP News: భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

ABN , First Publish Date - 2022-09-19T01:44:41+05:30 IST

తిరుపతి నుంచి భువనేశ్వర్‌ (Bhubaneswar) వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ రైలు నుంచి ఒక్కసారిగా భారీగా పొగలు రావడంతో

AP News: భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

నెల్లూరు: తిరుపతి నుంచి భువనేశ్వర్‌ (Bhubaneswar) వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ రైలు నుంచి ఒక్కసారిగా భారీగా పొగలు రావడంతో  ప్రయాణికులు భయాందోళనతో రైలు దిగి పరుగులు తీశారు. ఈ సంఘటన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం రైల్వేస్టేషన్‌ (Vedayapalem Railway station) సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. రైల్వే అధికారుల కథనం మేరకు  తిరుపతి నుంచి భువనేశ్వర్‌ వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ రైలు (నెంబరు 22880) ఆదివారం మధ్యాహ్నం 12.40 సమయంలో నెల్లూరు సమీపంలో వెంకటాచలం రైల్వేస్టేషన్‌ దాటుతున్న సమయంలో స్టేషన్‌మాస్టర్‌ రైలు చక్రాల వద్ద నుంచి పొగలు గమనించారు.


వెంటనే రైలులోని లోకోపైలెట్‌ను అప్రమత్తం చేశారు. 12.50 సమయంలో వేదాయపాళెం సమీపంలో రైలును డ్రైవర్‌ నిలిపివేశాడు. ఒక్కసారిగా ఎస్‌-3 బోగి వద్ద చక్రాల నుంచి భారీగా పొగలు రావడం మొదలయ్యాయి. గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనతో రైలు దిగి పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు పరిశీలించి, బ్రేకులకు ఇరువైపులా గల రబ్బరు డ్రమ్స్‌ కాలి పొగలు వచ్చినట్లు నిర్దారించారు. వెంటనే మరమ్మతులు చేసి రైలును తిరిగి పంపించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ ఘటనతో రైలు 40 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరింది.


Updated Date - 2022-09-19T01:44:41+05:30 IST