బాపూజీతో భాయీ భాయీ...

ABN , First Publish Date - 2022-08-04T06:39:59+05:30 IST

భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం అనేకమంది త్యాగధనులు తమ ధన, ప్రాణాలను పణంగా పెట్టారు. అందులో హిందువులూ, ముస్లిములూ ఉన్నారు...

బాపూజీతో భాయీ భాయీ...

భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం అనేకమంది త్యాగధనులు తమ ధన, ప్రాణాలను పణంగా పెట్టారు. అందులో హిందువులూ, ముస్లిములూ ఉన్నారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో గాంధీజీతో భుజం భుజం కలిపి నడిచిన సహచరులు అసంఖ్యాకంగా ఉన్నారు. భారతదేశం అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నవేళ కొంతమంది మహాత్ముని ముస్లిం సహచరుల గురించి తెలుసుకుందాం.


గాంధీజీ స్వగ్రామమైన పోర్‌బందర్‌లో అబ్దుల్లాహ్ హాజీ ఆందం జవేరీ అని ఒక ప్రఖ్యాత ముస్లిం వ్యాపారి ఉండేవారు. మెసర్స్ దాదా అబ్దుల్లా అండ్ కంపెనీ పేరుతో ఆయన దక్షిణాఫ్రికాలో వ్యాపారం నిర్వహించేవారు. ఆ వ్యాపారాలకు సంబంధించి అక్కడి న్యాయస్థానాల్లో కొన్ని వ్యాజ్యాలు నడుస్తున్నాయి. తన గ్రామస్తుడైన యువ న్యాయవాదిని పిలిపించుకుంటే బాగుంటుందని భావించిన అబ్దుల్లా దక్షిణాఫ్రికాలో తన కంపెనీ న్యాయ వ్యవహారాలు చూస్తున్న న్యాయవాదులకు సహకరించడానికి గాంధీజీని దక్షిణాఫ్రికాకు పిలిపించుకున్నారు. అప్పటి నుంచి గాంధీకి అబ్దుల్లా అన్ని విషయాల్లో సహకరిస్తూ మార్గదర్శిగా నిలిచారు. ఈ క్రమంలో దాదా అబ్దుల్లా ద్వారా దక్షిణాఫ్రికాలో భారతీయులు ఎదుర్కొంటున్న వివక్ష, ఇతర ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు గాంధీజీ. స్వయంగా చూశారు. అనుభవించారు కూడా! ఈ దుర్మార్గపు వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఒక నిర్ణయానికొచ్చిన అబ్దుల్లా, గాంధీజీ ఇద్దరు కలసి, ‘నాటల్ ఇండియన్ కాంగ్రెస్’ (ఎన్ఐసి) అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షులు దాదా అబ్దుల్లా, కార్యదర్శి గాంధీజీ. దక్షిణాఫ్రికాలో దాదా అబ్దుల్లా సహచర్యంలో ‘ప్రజాసేవ చేయాలనే కోరిక, దానికి కావలసిన శక్తి నాకు అక్కడే లభించాయి’ అని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారు.


దక్షిణాఫ్రికాలో వివక్షకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన తరువాత గాంధీజీ భారతదేశానికి వచ్చారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చంపారన్ రైతాంగ పోరాటాన్ని భుజానికెత్తుకున్నారు. దీనికోసం ఆయన ఎంచుకున్న ఆయుధం దక్షిణాఫ్రికాలో విజయం సాధించి పెట్టిన ‘సత్యాగ్రహమే’. చంపారన్ రైతాంగ పోరాట నాయకులు షేక్ గులాబ్, ముహమ్మద్ మోనిస్ అన్సారీ గాంధీజీకి కుడి భుజంగా నిలిచి సహకరించారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, కుల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడి విజయుడై స్వదేశానికి వచ్చిన గాంధీజీ ఇక్కడ కూడా వివక్షను ఎదుర్కోక తప్పలేదు. తొలుత పాట్నాలోని బాబూ రాజేంద్రప్రసాద్ (అప్పటికాయన న్యాయవాదే) ఇంట్లోకి ఆయనకు అనుమతి లేదు. ఆ సమయాన రాజేంద్రప్రసాద్ ఇంట్లో లేని కారణంగా, పని మనుషులు ఆయన్ని ఇంట్లోకి అనుమతించలేదు. బావిలో నీళ్ళు తోడుకొని తాగడానికి గాని, ఇంటి మరుగుదొడ్డి వాడుకోడానికి గాని ఆయనకు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాలను గాంధీజీ తన ఆత్మకథలో రాసుకోవడమే కాకుండా, కొడుకు మదన్‌లాల్ గాంధీకి కూడా ఉత్తరం ద్వారా తెలియజేశారు. బాబూజీ ఇంటి పనిమనుషులు మమ్మల్ని బిచ్చగాళ్ళకంటే హీనంగా పరిగణించారని రాశారు. అప్పుడాయనకు పాట్నా గ్రామస్తుడైన తన లండన్ సహచరుడు అడ్వకేట్ మౌలానా మజ్హరుల్ హఖ్ గుర్తుకొచ్చారు. బాబూజీ ఇంట తనకెదురైన పరిస్థితిని వివరిస్తూ ఆయనకు కబురు పెట్టారు. వెంటనే మజ్హరుల్ హఖ్ ఆఘమేఘాల మీద గాంధీజీ దగ్గరికొచ్చి, ఆయనకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సంఘటనను గాంధీజీ తన ఆత్మకథలో ‘చంపారన్ మచ్చ’ పేరుతో రాసుకున్నారు.


తరువాత ఆయన చంపారన్ చేరుకొని అక్కడి రైతుల గోసను విన్నారు. నీలిమందు సాగు చేయాలని ఆంగ్లపాలకులు తమపై జరుపుతున్న దాడులు, దుర్మార్గాలను రైతులు గాంధీజీకి ఏకరువు పెట్టారు. చంపారన్ రైతుల్లో గాంధీజీకి ఉన్న ఆదరణ, తదనంతర పరిణామాలనూ పసిగట్టిన ఆంగ్ల అధికారి ఇర్విన్ గాంధీ అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. దీనికిగాను తన ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న బతఖ్ మియా అన్సారీని ఎంచుకున్నాడు. పథకంలో భాగంగా గాంధీని భోజనానికి ఆహ్వానించి, ఆయనకు విషమిచ్చి చంపే బాధ్యతను అన్సారీకి అప్పగించాడు. గాంధీజీని చంపితే ఊహకు కూడా అందని బహుమతులతో సత్కరిస్తానని, పథకం విఫలమైతే నరకం చూపించి అనంత లోకాలకు పంపుతానని భయపెట్టాడు. కాని బతఖ్ మియా తన ప్రాణాలకు తెగించి బాపూజీ ప్రాణాలు రక్షించారు. ఈ విధంగా ఆంగ్లేయుల కుట్రల నుంచి బాపూజీ ప్రాణాలు కాపాడి భారత స్వాతంత్రోద్యమానికి నాయకత్వాన్ని అందించారు బతఖ్ మియా అన్సారీ.


చంపారన్ రైతాంగ పోరాటంలో విజయం సాధించిన గాంధీజీ భారత జాతీయ ఉద్యమంలోకి దూకారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో ‘అలీ బ్రదర్స్’గా ప్రసిద్ధిగాంచిన మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, మౌలానా షౌకత్ అలీ జౌహర్, వారి కుటుంబం అండదండలు గాంధీజీకి కొండంత బలాన్నిచ్చాయి. అలీ సోదరులతో గాంధీజీ ఎంతగా కలిసిపోయారంటే, ఆబాదీబాను బేగంకు తాను మూడవ సంతానమని చెప్పుకునేవారు. ఆమెను గాంధీజీ అమ్మా అనే పిలిచేవారు. అందుకే ఆమె ప్రజలందరిచేతా అమ్మగా పిలువబడి ‘బీబీ అమ్మాన్’గా ప్రసిద్ధి చెందారు. స్వాతంత్ర్యోద్యమం కోసం గాంధీజీకి ఆమె భారీ మొత్తంలో ఆర్థిక సహాయం అందించారు. ఆమె అంతిమ సమయాన అలీ సోదరులతో పాటు గాంధీజీ కూడా ‘అమ్మ’ మంచం దగ్గరే ఉన్నారు.


గాంధీజీకి ఉద్యమ అవసరాల కోసం ఆపద్బాంధవుడిలా ఆదుకున్న మరో సహచరుడు ఉమర్ సుభాని. బొంబాయిలో ఏ మీటింగు జరిగినా, ఎంత పెద్ద కార్యక్రమం జరిగినా అందులో సగానికి సగం ఉమర్ సుభాని ఒక్కడే భరించేవారు. ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అలుపెరుగని ప్రయత్నం చేసేవారు. 1921లో ‘తిలక్ స్వరాజ్య నిధి’కి విరాళాలు సేకరించే సమయాన గాంధీజీకి బ్లాంక్ చెక్కు ఇచ్చి ‘ఎంత అవసరమో అంత రాసుకోండి’ అన్న ఉదార గుణ సంపన్నుడు ఉమర్ సుభాని.


గాంధీజీ మరో ప్రాణ స్నేహితుడు, దక్షిణాఫ్రికా నుంచి కుటుంబంతో సహా గాంధీజీ వెంట భారతదేశానికి వచ్చేసిన మిత్రుడు ఇమాం అబ్దుల్ ఖాదిర్ బావజీర్. దక్షిణాఫ్రికాలో అత్యంత సంపన్న, విలాస జీవితాన్ని త్యాగం చేసి, గాంధీజీ సహచర్యంతో భారతదేశానికి తరలి వచ్చి, సబర్మతీ ఆశ్రమంలో సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడిన త్యాగధనుడు. అంతటి గొప్ప సంపన్న, విలాస జీవితం గడిపిన ఇమాం అబ్దుల్ ఖాదిర్ ఆశ్రమంలో గ్రంథాలయ బాధ్యతలను చేపట్టారు. గాంధీజీ ఆయన్ని ప్రేమగా ‘ఇమాం సాబ్’ అని పిలుచుకునేవారు, సోదరునిగా పరిగణించేవారు. ఇమాం సతీమణి, ఇద్దరు కుమార్తెలు కూడా ఆశ్రమంలోని ప్రెస్‌లోనే పనిచేసేవారు. 1920 ఏప్రిల్ 2న జరిగిన అబ్దుల్ ఖాదిర్ కూతురు ఫాతిమా బేగం వివాహ వేడుకకు సంబంధించి గాంధీజీ పేరున ప్రచురితమైన ఆహ్వాన పత్రిక /శుభలేఖ భారత జాతీయోద్యమ సాహిత్య చరిత్రలో కలికితురాయిగా నిలిచిపోయింది. తను పెళ్లిపెద్దగా వ్యవహరించి జరిపిన ఈ వివాహ విశేషాలను స్వయంగా గాంధీజీ తన ‘నవ జీవన్’ పత్రికలో విశేషంగా ప్రచురించారు.


అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గాంధీజీ మరో సహచరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సరిహద్దు గాంధీ. ‘ఆయుధం పట్టుకొని యుద్ధం చేసే పఠాన్‌ కన్నా అహింసను ఆయుధంగా ధరించిన ఈ పఠాన్‌ చాలా ప్రమాదకారి’ అని బ్రిటీష్‌ పాలకులతో అనిపించుకున్న ధీరోదాత్తుడు. ‘నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అహింసామార్గాన్ని వీడను. పగ, ప్రతీకారం జోలికి వెళ్లను. నన్ను అణగదొక్కిన వారిని, హింసించిన వారిని కూడా క్షమిస్తాను’ అన్న ప్రతిజ్ఞతో ‘ఖుదాయి ఖిద్మత్‌ గార్‌’ పేరిట భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శాంతికాముకుడు ఈ సరిహద్దు గాంధీ. 1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ, ‘మీరు బుద్ధుడిని మరచిపోయినట్లుగానే గాంధీని మరచిపోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


మౌలానా అబుల్ కలాం ఆజాద్ – ఈయన మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితుడు. ఆంగ్ల ముష్కరులకు వ్యతిరేకంగా విప్లవశంఖం పూరించిన వీరయోధుడు. జాతి గర్వించదగ్గ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. 1920లో తొలిసారిగా గాంధీజీని కలుసుకున్నది మొదలు చివరివరకు ఆయనతో భుజం భుజం కలిపి నడిచారు. అహింసా మార్గాన ఖిలాఫత్ – సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. దేశ విభజనను నిర్ద్వందంగా వ్యతిరేకించారు. పదేళ్ళకు పైగా జైలు జీవితం గడిపారు. భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. 


ఈ విధంగా అసంఖ్యాక ముస్లింలు గాంధీజీకి సన్నిహితంగా, స్నేహంగా, ఉద్యమ భాగస్వాములుగా వెలుగొందారు. కాని నేటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా సంక్షిప్తంగానైనా దేశ స్వాతంత్రోద్యమంలో ముస్లింల భాగస్వామ్యానికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు పరిచయం చేయడం, ముఖ్యంగా యువతరానికి తెలియజేయడం మనందరి నైతిక కర్తవ్యం.

యండి. ఉస్మాన్ ఖాన్

జర్నలిస్ట్

Updated Date - 2022-08-04T06:39:59+05:30 IST