బెజవాడ గ్యాంగ్ వార్ : ఆస్పత్రిలో ఉన్న పండు దగ్గరికి అజ్ఞాత వ్యక్తి

ABN , First Publish Date - 2020-06-06T22:20:01+05:30 IST

బెజవాడలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన వార్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

బెజవాడ గ్యాంగ్ వార్ : ఆస్పత్రిలో ఉన్న పండు దగ్గరికి అజ్ఞాత వ్యక్తి

విజయవాడ : బెజవాడలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన వార్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సందీప్ మృతి చెందగా.. మరో గ్యాంగ్‌స్టర్ మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు ప్రస్తుతం గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కోలుకుంటున్నాడని వైద్యులు చెబుతున్నారు. అయితే పండు చికిత్స పొందుతున్న వార్డులోకి శనివారం నాడు ఓ వ్యక్తి ప్రవేశించాడు.!. ఆ అజ్ఞాత వ్యక్తిని ‘ఎవరు మీరు.. ఎందుకొచ్చారు..? ఎవరు కావాలి?’ అని నర్సు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అలెర్ట్ అయిన పోలీసులు వార్డులోకి వచ్చిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వార్డు బాయ్‌గా అవతారమెత్తి ఆస్పత్రిలోకి వచ్చాడని తెలుస్తోంది.


ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..?

పోలీసులు ఆ అజ్ఞాత వ్యక్తిని విచారిస్తున్నారు. అయితే వార్డ్ బాయ్ తాలుకు వ్యక్తని విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? పండు దగ్గరికి ఎందుకొచ్చాడు..? నర్సు ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్పకుండా వెనుదిరిగాడు..? వార్డు బాయ్‌గా ఎందుకు అవతారమెత్తాడు..? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండు చికిత్స పొందుతున్న వార్డు వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 


ఇప్పటికే 13 మంది అరెస్ట్..

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు మీడియా మీట్ పెట్టి స్పష్టం చేశారు. గొడవ తాలుకు వీడియోలను విశ్లేషించిన పోలీసులు పెనమలూరు మండలం కానూరు సనత్‌నగర్‌కు చెందిన రేపల్లె ప్రశాంత్‌, బూరి భాస్కరరావు అలియాస్‌ బాషా, యనమలకుదురు గ్రామానికి చెందిన ఆకుల రవితేజ అలియాస్‌ బుల్లి, ఓరుగంటి దుర్గాప్రసాద్‌, ఓరుగంటి అజయ్‌, విజయవాడ పటమట శివశంకర్‌నగర్‌కు చెందిన పందా ప్రేమ్‌కుమార్‌, పందా ప్రభుకుమార్‌, రామలింగేశ్వరనగర్‌కు చెందిన బాణావత్‌ శ్రీను నాయక్‌, పటమట చిన్నవంతెన ప్రాంతానికి చెందిన లంకలపల్లి వెంకటేష్‌ అలియాస్‌ ఖైనీ, పటమట తోటవారి వీధికి చెందిన ప్రతాప సాయు ప్రవీణ్‌కుమార్‌, యర్రా తిరుపతిరావు, శాంతినగర్‌కు చెందిన పొన్నాడ సాయి అలియాస్‌ గాలి సాయి, సిర్రా సంతోష్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి కొబ్బరిబొండాల కత్తి, పొడవు కత్తి, స్నాప్‌కట్టర్‌, కోడి కత్తి, ఐదు ఇనుప రాడ్లు, ఆరు మడత బ్లేడ్‌లు, నాలుగు బ్లేడ్‌లు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-06-06T22:20:01+05:30 IST