ఉపకారులూ అపకారులూ
ABN , First Publish Date - 2020-12-15T09:43:54+05:30 IST
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకటి రెండు రాష్ట్రాలకు చెందిన కొన్ని వర్గాల రైతులు ఢిల్లీ పొలిమేరల్లో చేస్తున్న నిరసన ప్రదర్శనలకు దేశ వ్యాప్తంగా...
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో మధ్య దళారులను తొలగించడానికి మోదీ ప్రభుత్వం నిజాయితీగా పూనుకున్నందునే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో మధ్య దళారులను తొలగించడానికి మోదీ ప్రభుత్వం నిజాయితీగా పూనుకున్నందునే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో మధ్య దళారులను తొలగించడానికి మోదీ ప్రభుత్వం నిజాయితీగా పూనుకున్నందునే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి. తమ ఆదాయానికి గండిపడుతున్నందువల్లే మధ్యదళారులు రైతుల ఆందోళనను ప్రేరేపిస్తున్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకటి రెండు రాష్ట్రాలకు చెందిన కొన్ని వర్గాల రైతులు ఢిల్లీ పొలిమేరల్లో చేస్తున్న నిరసన ప్రదర్శనలకు దేశ వ్యాప్తంగా మద్దతు లేదన్న విషయం భారత్ బంద్ విఫలం కావడంతో తేలిపోయింది. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన రైతులకు ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, ప్రతిపక్షాల సహకారం, కొన్ని తీవ్రవాద శక్తుల హంగామాతో దేశంలో ఏదో ప్రళయం జరుగుతున్నట్లు ఉధృత ప్రచారం జరిగింది. భారత్ బంద్‌కు దేశంలోని ఇతర రాష్ట్రాలు మద్దతునీయకపోవడంతో ఈ ప్రచారం నీరుకారిపోయింది. పంజాబ్ కంటే అత్యధిక దిగుబడులు సాధించే, అత్యధిక లాభాలు సంపాదించే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలో పాల్గొనడం లేదు అని ఆలోచిస్తే అసలు విషయం బయటపడుతుంది.
నిజానికి రెండు వారాలుగా హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్రప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు రైతుల నిజమైన సమస్యలేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. పలు దఫాలుగా వారితో చర్చించారు. చర్చల సమయంలో ప్రభుత్వ వాదనలోని నిజాయితీని గమనించి వెనక్కి వెళ్లిన రైతుసంఘాల ప్రతినిధులపై ఏ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులు వెనక్కు తీసుకోవడం తప్ప మరే చర్యలకూ తాము ఒప్పకోబోమనే మొండి వైఖరి ప్రదర్శించారు. దీనితో ఈ మొత్తం ఆందోళన వెనుక నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపిని రాజకీయంగా ఓడించలేని శక్తుల కుట్ర ఉన్నదన్న అభిప్రాయం ప్రభుత్వానికి కలగడంలో ఆశ్చర్యం లేదు.
కొత్త సాగుచట్టాల్లో కనీస మద్దతు ధర గురించి ప్రస్తావన లేనే లేదని ఉద్యమ కారులు అంటున్నారు. కానీ ధరలు అటూ ఇటూగా ఉంటే ఒక కచ్చితమైన కనీస ధర ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కనీస మద్దతు ధర తగ్గిపోతోందని, యుపిఏ హయాంలోనే ఎక్కువ మద్దతు ధర కల్పించారని మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజమేమిటి? యుపిఏ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1319 కాగా అది క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు రూ.1868కి చేరుకుంది. అదే విధంగా గోధుమ మద్దతు ధర యుపిఏ హయాంలో రూ.1350 కాగా అదిప్పుడు రూ.1925కు చేరుకుంది. మరి కనీస మద్దతు ధర పెరిగినట్టా లేక తగ్గినట్టా? యుపిఏ హయాంలో కాయధాన్యాలు కొనుగోలు చేయడానికి రూ.650 కోట్లు ఖర్చు చేస్తే మోదీ ప్రభుత్వం రూ.50వేల కోట్ల విలువైన కాయధాన్యాలను కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర తగ్గించాలనేదే మోదీ ప్రభుత్వ ఉద్దేశం అయితే ప్రతి ఏటా ఈ ధరను ఎందుకు పెంచుతూ వస్తోంది?
అంతేకాక వ్యాపారులు, కంపెనీలు రైతులను మోసం చేస్తాయనే దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యాపారులు రైతులను మోసం చేసేందుకు అవకాశం కల్పించడం, తమ భూమిని అమ్ముకోవాల్సి రావడం జరిగే ప్రసక్తి లేదు. ఇందుకు పూర్తిగా చట్టపరమైన ఆంక్షలు విధించారు. అంతేకాదు, కొనుగోలు దారులు రైతులను మోసం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. డబ్బు పూర్తిగా చెల్లించకుండా కాంట్రాక్టర్లు తమ ఒప్పందాన్ని పూర్తి చేసుకోవడానికి ఏ మాత్రం వీలు లేదు. కావాలంటే రైతులే ఒప్పందాలను ఎప్పుడు కావాలంటే అప్పడు రద్దు చేసుకునేందుకు వీలు కల్పించారు.
దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కావాలని, వారి జీవితాలు సుఖమయం కావాలని, వారు పండించే ఆహారోత్పత్తులను నిల్వచేసే సదుపాయాలు కావాలని మోదీ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం విజయవంతమైతే తాము పూర్తిగా తుడిచిపెట్టుకుపోతామని తెలిసినందువల్లే బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ఈ ఆందోళనకు ఊతం కలిగిస్తున్నాయి. నిజానికి సరైన నిల్వ సౌకర్యాలు లేక రూ.92వేల కోట్ల విలువైన వ్యవసాయోత్పత్తులు కుళ్లిపోయి, నశ్వరమైపోయాయనని 2012లోనే ఒక ఆడిట్ నివేదిక తెలిపింది. అప్పుడు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోవడం వల్లే ఇది జరిగింది.
రైతులు ఉత్పాదకసంఘాలు ఏర్పర్చుకుని తాము పండించిన పంటకు న్యాయమైన ధర పొంది, అధిక లాభాలు ఆర్జించడం ఎలా తప్పవుతుంది? కాంట్రాక్టు వ్యవసాయం మూలంగానే పంజాబ్, హర్యానాలో రైతులు అధికంగా ఆర్జించడం వాస్తవం కాదా? మండీలలోనే కాక, మండీల వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మేందుకు వీలు కల్పించడంలో దురుద్దేశం ఏమున్నది? రైతులకు తమ పంట అమ్ముకునేందుకు కేవలం ఒక అవకాశం కన్నా, పలు అవకాశాలు కల్పించాలని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రతిపక్షాలకు కంటగింపు ఎందుకు కలిగిస్తోంది? మోదీ ప్రభుత్వం కల్పించిన ఈ-నామ్ పోర్టల్‌లో వేయి మండీలకు పైగా నమోదు చేసుకున్నాయంటే మండీలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని అర్థం కాదా?
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి మోదీ ప్రభుత్వం చతుర్ముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. రైతులకు ఉపకరణాల వ్యయాన్ని తగ్గించడం; వారు పండించిన ఉత్పత్తులకు సరైన ధరలు లభించేలా చూడడం; పంట సమయంలోనూ, ఆ తర్వాత జరిగే నష్టాలు పూర్తిగా తగ్గించడం; రైతులు అత్యధిక ఆదాయం పొందేందుకు ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు కల్పించడం, ఈ వ్యూహంలోని ప్రధానాంశాలు. అందుకే ‘బీజ్ సే బజార్ తక్’ అని మోదీ పిలుపునిచ్చారు. గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం, రైతుల జీవనప్రమాణాలు మెరుగు కావడమే ప్రధాని మోదీ ఉద్దేశం.
రైతులకూ, వ్యాపారసంస్థలకూ, ప్రజలకూ మధ్య దళారులను తొలగించడానికి మోదీ ప్రభుత్వం నిజాయితీతో ప్రయత్నం చేస్తున్నందువల్లనే కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి. తమ ఆదాయానికి గండి పడుతున్నందువల్లే మధ్యదళారులు ఈ ఆందోళనను ప్రేరేపిస్తున్నారు. పంజాబ్‌లో కేవలం గోధుమలు, వరి ధాన్యాల అమ్మకంలోనే మధ్య దళారులు ఏటా రూ.3330 కోట్ల మేరకు సంపాదిస్తున్నారు. అక్కడ మధ్యదళారీ సంఘాలు ఎంత బలమైనవంటే రైతులు వారి పట్టు నుంచి తప్పించుకోలేరు. కనీస మద్దతు ధరకు 30 శాతం తక్కువ చెల్లించినా రైతులు ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అకాలీదళ్ రెండు వర్గాలుగా చీలిపోగా కాంగ్రెస్ అవశేషంగా మిగిలిపోయిన పంజాబ్‌లో కూడా అధికారం ఎక్కడ కోల్పోతామోనన్న భయంతో కాంగ్రెస్ దళారులు ఆందోళనను ప్రేరేపిస్తున్నారు. పనిలోపనిగా నిస్సారంగా మారిపోయిన వామపక్షాలకు, కలుగులో దాక్కున్న వేర్పాటువాదులకూ రైతుల ఆందోళన తమకు మళ్లీ అవకాశం కల్పిస్తుందేమోనన్న ఆశ రగిలిస్తోంది. తమ రాష్ట్రాల్లో బిజెపి ధాటికి తట్టుకోలేక చేవ చచ్చిన వారు, గోడల మీద వెలిసిపోయిన నినాదాలకు పరిమితమైన వారు, గుడ్డిగా మోదీ వ్యతిరేకతను పెంచుకున్నవారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిక్నిక్ లాగా రైతుల ఆందోళనలో ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఏదో జరిగిపోతోందన్న పూనకంతో ఊగిపోతున్నారు. వారి పూనకాన్ని ప్రజలే దించక తప్పదు.
వై. సత్యకుమార్
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి
