Abn logo
Aug 7 2020 @ 00:32AM

ఆశ -శ్వాస!

బతుకుతున్నాం బతికే ఉన్నాం

భయం భయంగా... బెంగబెంగగా!

జీవంలేని కళ్లతో మ్లానమైన ముఖాలతో

బెదురు చూపులతో అదురు పిలుపులతో

బతుకుతున్నాం... బతికే ఉన్నాం!


కాలమథనంలో పుట్టిన విషపు చుక్క చక్కర్లకు

కాళ్లచక్రాలు నిలువునా బద్దలయ్యాయి

గర్వంగా రొమ్మువిరుచుకు తిరిగిన దేహాలు

గడపలకు బందీలయ్యాయి

ఆలింగనాలు లేవు ఆస్వాదనలు లేవు

చేతులు దూరమై, మనసులు భారమై

బతుకుతున్నాం... బతికే ఉన్నాం!


ఎక్కాలనాటి లెక్కల సంగతేమోగానీ,

కష్టకాలంలో ఖచ్చితలెక్కలు గడుతున్నాం!

పెరుగుదల, తగ్గుదల రికవరీ పర్సంటేజీలు

ఇట్టే చెప్పేస్తున్నాం!!

సామాన్యశాస్త్రం వంటబట్టని మెదడు

వైద్యశాస్త్రాన్ని వెతుకుతోంది

శానిటైజర్లు, ఆక్సీమీటర్లు, 

ఆవిరిమిషన్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు

పరుగులే...పరుగులు...

ఆకులు రాలే అకాలంలో

గాలిలో దీపాల్లా

బతుకుతున్నాం... బతికే ఉన్నాం!


నిమిషానికో కబురు

గంటకో సమాచారం

మేమిక్కడ ఇలా... మీరక్కడ ఎలా?

విరామమెరుగని ఫోన్లు

విసుగుచూపని సైట్లు

ఉక్కిరిబిక్కిరి వాతావరణంలో

ఫలితమెరుగని కదనరంగంలో

బతికిస్తున్నది ఒకటే ఆశ!

చెవి మళ్లీ వింటుంది-

రైలుబళ్లలో రణగొణధ్వనిని,

నోరు మళ్లీ చెబుతుంది-

చాయ్‌ షాపుల దగ్గర బాతాఖానీని,

కన్ను మళ్లీ చూస్తుంది- 

నాలురోడ్ల కూడలిలో నవ్వుల రొదని,

మొహంవాచిన స్పర్శకోసం...

చేతులు మళ్లీ పుడతాయి!

ఆనందతీరాల వెంట 

కాళ్లు మళ్లీ పరిగెడతాయి!

ఈ ఆశను శ్వాసించేందుకైనా

బతుకుతాం.... బతికే ఉంటాం!!


-నల్లాన్‌చక్రవర్తుల సతీష్‌కుమార్‌

Advertisement
Advertisement
Advertisement