సగం బెడ్లు ఇవ్వాల్సిందే.. అదీ ఉచితంగా!

ABN , First Publish Date - 2021-05-07T09:12:18+05:30 IST

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు పడకలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్‌ తేల్చిచెప్పారు. ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా సగం బెడ్లు కేటాయించాల్సిందేనన్నారు

సగం బెడ్లు ఇవ్వాల్సిందే.. అదీ ఉచితంగా!

ఆరోగ్యశ్రీ కింద కరోనా బాధితులకు ఉచితంగా వైద్య సేవలు 

ఎంప్యానెల్‌ ఆస్పత్రులు విధిగా 50శాతం బెడ్లు కేటాయించాలి

అంతకంటే ఎక్కువమంది వచ్చినా లేవనేందుకు వీల్లేదు

తాత్కాలిక, నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులకూ ఇదే నిబంధన 

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు: సీఎం జగన్‌ 


అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు పడకలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్‌ తేల్చిచెప్పారు. ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా సగం బెడ్లు కేటాయించాల్సిందేనన్నారు. 50శాతం కంటే ఎక్కువమంది బాధితులొచ్చినా మంచాలు లేవనేందుకు వీల్లేదన్నారు. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రులతో పాటు కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులకూ ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద కరోనా బాధితులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తామని సీఎం ప్రకటించారు. కొవిడ్‌-19 నియంత్రణ, నివారణపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ ఆస్పత్రుల వద్దే కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని వసతులతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆహారం, శానిటేషన్‌, ఆక్సిజన్‌, మెడికల్‌ కేర్‌, వైద్యులు అందుబాటు వంటి ఐదు అంశాలూ అమలు కచ్చితంగా చేయాలన్నారు. తగినంత ఆక్సిజన్‌ సరఫరా, నిల్వ కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోధనాస్పత్రుల్లో 10 కిలోలీటర్లు, ఇతర ఆస్పత్రుల వద్ద 15 కిలోలీటర్ల ఆక్సిజన్‌ నిల్వ ఉంచాలని, వీటి ఏర్పాటు త్వరగా జరగాలన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నామని, మన రికార్డులు మనమే బద్దలు కొడుతున్నామని జగన్‌ పేర్కొన్నారు. కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు అవసరమైన మేరకు బెడ్లను పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు. 


ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్లు, కొవిడ్‌ బాధితులు, ఇతర రోగుల సమాచారం పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లపై కొవిడ్‌, ఇతర రోగుల వివరాలుంటే.. పడకల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. 104 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ వస్తే బాధితుడు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఆయా జిల్లాలకు సమాచారం వెళ్తుందని సీఎం చెప్పారు. వెంటనే కలెక్టర్‌, జేసీ, జిల్లా యత్రాంగం స్పందించి వారిని ఆయా ఆస్పత్రులకు తరలించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా చూడాలని, కొవిడ్‌ బాధితులకు పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 108 ప్రభుత్వ, 349 కార్పొరేట్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు, 47 కార్పొరేట్‌ తాత్కాలిక ఎంప్యానెల్‌, 94 ప్రైవేటు కేటగిరీ ఆస్పత్రులు కలిపి మొత్తం 598 ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నాయన్నారు. వీటిలో 41,517 మంది చికిత్స పొందుతున్నారని, మరో 6,922 బెడ్లు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు. 

Updated Date - 2021-05-07T09:12:18+05:30 IST