Abn logo
Jun 3 2020 @ 00:00AM

ఫోన్‌ ద్వారా రాకుండా...

కరోనా వైరస్‌ సోకకుండా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫోన్‌ విషయంలో మాత్రం అశ్రద్ధ చేస్తున్నాం. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందటానికి  ఈ ఒక్క కారణం చాలు. ఈ నేపథ్యంలో కరోనా సోకకుండా ఫోన్లను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం.


చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లకు అలవాటు పడిన చాలామంది రెండో ఆలోచన లేకుండా తమ ఫోన్లను శుభ్రం చేసుకోవడానికి కూడా వాటినే వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. శానిటైజర్‌లో 70 శాతం వరకు గాఢత కలిగిన ద్రావకాలు ఉండడం వల్ల అది ఫోన్‌ స్ర్కీన్‌ మీద యాంటీ గ్లేర్‌ కోసం వేసిన కోటింగ్‌ని దెబ్బతీస్తుంది. దాంతో మెల్లగా కళ్ళమీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. తక్కువ ధర కలిగిన మరికొన్ని ఫోన్లలో ఇంకా లోతుగా స్ర్కీన్‌ డామేజ్‌ కావడం వల్ల, శాటిటైజర్‌ అప్లై చేసిన ప్రదేశం ఒక ప్రత్యేకమైన పొరలాగా కన్పిస్తూ చికాకు పెడుతుంది.


ఫోన్‌ పేలిపోవచ్చు!

శానిటైజర్‌ సహజంగానే మండే గుణాన్ని కలిగి ఉంటుంది. దాన్ని ఫోన్‌ శుభ్రం చేయడానికి వాడినప్పుడు ఫోన్‌ పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐపీ 68 రేటింగ్‌ కలిగి ఉన్న ఖరీదైన ఫోన్లలో మాత్రమే వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ కోసం అన్ని పోర్టులూ, అంచుల వద్దా ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. అయితే తక్కువ ధర కలిగిన ఫోన్లలో అంచులు, యూఎస్‌బీ పోర్ట్‌, మైక్రోఫోన్‌, స్పీకర్‌ వంటి వివిధ ప్రదేశాల్లో ద్రావకాలు లోపలికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు వాడే శానిటైజర్‌ గానీ, ఇతర లిక్విడ్‌లు గానీ ఫోన్‌ లోపలికి వెళితే మదర్‌బోర్డ్‌ పాడవడం మొదలుకొని, బ్యాటరీ షార్ట్‌ అయి ఫోన్‌ పేలిపోయే ప్రమాదాలు ఎక్కువ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్‌ శుభ్రం చేసేందుకు శానిటైజర్‌ వాడకూడదు.


ఎలా శుభ్రం చేయాలి?

ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ గ్యాడ్జెట్లను శుభ్రం చేయడం కోసం డిజ్‌ఇన్‌ఫెక్టర్ల పేరిట ప్రత్యేకమైన ద్రావకాలు ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ఆ సైట్లు పనిచేయటం లేదు కాబట్టి ఇళ్లల్లో ఉండే కొలిన్‌ లాంటి ద్రావకాలను ఉపయోగించవచ్చు. అయితే వాటిని నేరుగా ఫోన్‌ మీద చల్లడం కాకుండా, మెత్తగా ఉండే ఒక మైక్రో ఫైబర్‌ వస్త్రాన్ని తీసుకొని, దానిమీద ద్రావకాన్ని చల్లాలి. ఇప్పుడు ఆ వస్త్రంతో ఫోన్‌ను శుభ్రపరచాలి. మురికి బాగా పట్టింది కదా అని గట్టిగా  రుద్దడం చాలా ప్రమాదకరం. దీని వల్ల స్ర్కీన్‌ మీద అతి సూక్ష్మమైన గీతలు పడే అవకాశం ఉంటుంది.


ఈ అలవాట్లు నేర్చుకోండి

కరోనా వైరస్‌ మాత్రమే కాదు, ఒక ఫోన్‌ మీద టాయిలెట్‌ సీట్‌ మీద ఉన్నంత బ్యాక్టీరియా ఉంటుందని అనేక సందర్భాలలో నిరూపితమైంది. ఫోన్‌ ద్వారా ఇ-కొలి, అమీబియాసిస్‌ వంటి అనేక ఉదరకోశ సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఫోన్‌ వాడకం పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఒకరు వాడిన ఫోన్‌ మరొకరు వాడడం సరైనది కాదు. కొంతమంది బాత్‌రూమ్‌లోకి ఫోన్‌ తీసుకెళుతూ ఉంటారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఫోన్‌ చెవికి ఆనించుకుని మాట్లాడినప్పుడు చెవి, చెంపల దగ్గరి ఆయిల్‌, మురికి ఫోన్‌కి అంటుకుంటుంది. దీంతో ఫోన్‌ మీద పెద్దమొత్తంలో బ్యాక్టీరియా పేరుకుంటుంది. అందుకే నేరుగా ఫోన్‌ మాట్లాడకుండా, బ్లూటూత్‌ హెడ్‌ ఫోన్లు, ఇయర్‌ బడ్స్‌ లాంటివి ఉపయోగించడం అన్ని విధాలా మంచిది. ఇంకా చెప్పాలంటే స్పీకర్‌  ఆన్‌ చేసి మాట్లాడటం ద్వారా కొంతవరకు ఉపయోగముంటుంది.


అడిక్షన్‌ తగ్గించుకోవడం

మనలో చాలామందికి చీటికీ మాటికీ ఫోన్‌ చేతిలోకి తీసుకుని నోటిఫికేషన్స్‌ పరిశీలించే అలవాటు ఉంటుంది. దీన్ని వీలైనంత వరకూ కూడా తగ్గించుకోవటం  చాలా మంచిది. ఎన్నిసార్లు శానిటైజర్‌ వాడినా ఇలా చేతులు ఎక్కడో పెట్టి, అవే చేతులతో మళ్లీ ఫోన్‌ పట్టుకోవడం వల్ల తిరిగి వైరస్‌, బ్యాక్టీరియా ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఫోన్‌ అడిక్షన్‌ తగ్గించుకోక తప్పదు. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఫోన్‌ ఇవ్వకూడదు. ఎందుకంటే వారి రోగ నిరోధక శక్తి చాలా తక్కువ. అనేక సందర్భాలలో ఫోన్‌ మీది బ్యాక్టీరియా కారణంగానే వారిలో ఆకలి మందగించటం, కడుపు ఉబ్బరంగా ఉండటం వంటి సమస్యలు ఉత్పన్నవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అలానే ఫోన్‌ ఎక్కడపడితే అక్కడ పెట్టడం కూడా ప్రమాదకరమే. ఫోన్‌ ఎక్కడైతే పెట్టామో అక్కడి ఉపరితలం పరిశుభ్రంగా లేకపోతే వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ. 

సామాజిక దూరం పాటించడం ద్వారా వచ్చే ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించకుండా, ఫోన్‌ శుభ్రం చేసుకోవడం పట్ల కూడా ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.


Advertisement
Advertisement
Advertisement