అందరి మాట వింటేనే అందమైన మూసీ

ABN , First Publish Date - 2020-09-08T09:43:39+05:30 IST

హైదరాబాద్‌ నడిబొడ్డు నుంచి ప్రవహించే మూసీ నదిలోని కాలుష్యాన్ని శుభ్రపరచి, నగర ప్రజలకు, నగరానికి వచ్చే సందర్శకులకు కనువిందుగా ఉండేట్టు, నదిని సుందరీకరిస్తామని...

అందరి మాట వింటేనే అందమైన మూసీ

మూసీ సుందరీకరణ పనులు ప్రారంభమయినప్పటి నుంచి కింద ఉన్న పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కత్వాలకు సంబంధించిన చిన్న నీటిపారుదల వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇంత భయంకరంగా ఉన్న కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు చేపట్టలేదని వాపోతున్నారు. సుందరీకరణలో భాగంగా నగరంలోని నీటిని రబ్బరు డ్యాం నిర్మించి ప్రవాహాన్ని ఆపివేసి, ఈత కొలనులు, బోటింగ్‌ లాంటివి ఏర్పాటుచేస్తే తమ గ్రామాలకు రావాల్సిన నీరు తగ్గిపోతుందని ప్రజలు భయపడుతున్నారు.


హైదరాబాద్‌ నడిబొడ్డు నుంచి ప్రవహించే మూసీ నదిలోని కాలుష్యాన్ని శుభ్రపరచి, నగర ప్రజలకు, నగరానికి వచ్చే సందర్శకులకు కనువిందుగా ఉండేట్టు, నదిని సుందరీకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పనులు కూడా ఆరంభమయినట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో మూసీ గురించి ప్రస్తావించి, గత ప్రభుత్వాలన్నీ మూసీ నది గురించి పట్టించుకోకుండా దానిని దుర్గంధభూయిష్టంగా తయారుచేశాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూసీ నదిని శుద్ధీకరించి సుందరంగా తయారుచేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన మూడు సంవత్సరాలకు (2017, ఆగస్టు) ‘మూసీ అభివృద్ధి కార్పొరేషన్‌’ ఏర్పరచి, ఒక చైర్మన్‌ని నియమించి, కార్యాలయాన్ని ప్రారంభించారు.


నిజానికి మూసీ నది ప్రక్షాళన గురించి గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మాత్రమే మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటై, మూసీ ప్రాజెక్టు ప్రకటన జరిగింది. గత 28 సంవత్సరాల కాలంలో మూసీ సుందరీకరణ పేరుతో రూ.847 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మూసీ అభివృద్ధి కార్పొరేషన్‌ రూ.15,884 కోట్ల బడ్జెట్‌తో కార్యక్రమాలు ప్రకటించింది. మూసీ నదిలో ప్రవహించే మురుగునీరు శుభ్రం చేయడానికి 65 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మిస్తామని; మూసీ ఒడ్డున రోడ్డు, పార్కులు నిర్మిస్తామని; గొప్ప యాత్రాస్థలంగా చేస్తామని ప్రకటించారు. నగరంలో బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు మూసీకి ఇరువైపులా గోడ నిర్మించడానికి సర్వే మొదలుపెట్టారు. పన్నెండు వందల ప్రదేశాలలో మూసీ కబ్జాలకు గురైందని గుర్తించారు. కబ్జాదారుల నుంచి భూమిని విడిపిస్తామని కూడా ప్రకటించారు.


వికారాబాద్‌ దగ్గర అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీనది హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 256 కిలోమీటర్ల మేర ప్రవహించి నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. 1908లో మూసీ బాగా పొంగి హైదరాబాద్‌లో భారీగా ప్రాణనష్టం కావడంతో ప్రసిద్ధ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాతో గండిపేట వద్ద ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్ సాగర్‌ జలాశయాలను నిర్మించారు. 1960 వరకు ఈ జలాశయాలు నిండి ఉండడం వల్ల మూసీ నది నగరంలో స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతూ ప్రవహిస్తూ ఉండేది. తర్వాత నగర డ్రైనేజీ నీటిని మూసీలోకి వదలడమే కాకుండా క్రమక్రమంగా కాటేదాన్‌, సనతనగర్‌, పటాన్‌ చెరువు, నాచారం ప్రాంతాల పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు కూడా మూసీ నదిలో కలవడం మొదలైంది.


మూసీ నది అనగానే నగర ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు, కొందరు మేధావులు బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకే వీక్షిస్తారు. ఈ 21 కిలోమీటర్ల దూరంలోని మూసీ నదిని శుద్ధి చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మూసీకి ఒక సువిశాలమైన పరీవాహక ప్రాంతం ఉన్నది. దాదాపు 200 గ్రామాల్లో ఈ నీరు నిజాం పరిపాలనలో నిర్మించిన బ్రహ్మాండమైన ‘కత్వా’ వ్యవస్థ ద్వారా పంపకం అవుతుందన్న విషయం విస్మరించారు. హైదరాబాద్‌ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో సూర్యాపేట కేతేపల్లి దగ్గర 1963లో మూసీ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 40 వేల ఎకరాల భూమి సాగుబడిలో ఉంది. ఉప్పల్‌ నుంచి మూసీ నది దాదాపు 135 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ ప్రయాణంలో నది నీరు కొన్ని వందల గ్రామాలను స్పృశిస్తూ చెరువులను నింపుకుంటూ పోతుంది. హుస్సేన్‌ సాగర్‌, హిమాయత్ సాగర్‌ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయిన తర్వాత నిజాం ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన నీటిపారుదల వ్యవస్థను మూసీనదికి అనుసంధానం చేస్తూ ఏర్పాటుచేసింది. దాన్ని ‘కత్వా’ నీటిపారుదల వ్యవస్థ అంటారు. నదిలో ప్రవాహానికి అడ్డంగా, తక్కువ ఎత్తులో ఈ కత్వాలు నిర్మించారు. వీటి దగ్గర ఆగిన నీరు పక్కన ఏర్పరచిన తూము ద్వారా కాలువలోకి వెళ్లి గ్రామాల్లో చెరువులు నింపుకుంటూ ప్రయాణిస్తుంది. అన్ని కాలువలు గ్రావిటీ ద్వారానే పారుతుంటాయి. ఈ వ్యవస్థలో కరెంటు వాడకం ఉండదు. రూపాయి ఖర్చు లేకుండా నీరు ప్రవహిస్తుంది.


ఉప్పల్‌ నుంచి మూసీ ప్రాజెక్టు వరకు 24 కత్వాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది కత్వాలు, నల్గొండలోని 16 కత్వాల ద్వారా దాదాపు 250 గ్రామాల్లో చెరువులు నిండుతున్నాయి. అప్పటి ప్రభుత్వం 25 వేల ఎకరాల సాగు కోసం పథకం వేశారు. కానీ ఇప్పుడు దాదాపు 40 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాలకు కాలువలు తవ్వుకున్నారు. ఇంకా కొత్త కాలువలు తవ్వుతూనే ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులో ఉన్న మక్త అనంతారం దగ్గర మూసీ నదిపై బునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ అనే రెండు కాలువలు పది సంవత్సరాలుగా తవ్వుతున్నారు. ఇంకా చివరి ఆయకట్టు వరకు పనులు జరగవలసి ఉంది. బునాదిగాని కాల్వ కింద బీబీనగర్‌, బోన్‌గిరి, వలిగొండ మండలం కొండూరు, ఆత్మకూరు మండలంలోని 20 గ్రామాల చెరువుల్లోకి నీళ్ళు పోతాయి. అలాగే పిల్లాయిపల్లి కాలువ ద్వారా పోచంపల్లి, చౌటుప్పల్‌ మండలంలోని 30 గ్రామాలకు మూసీ నీటిని అందించే ఏర్పాటు జరుగుతుంది.


1980 వరకు మూసీలో కాలుష్యం తక్కువగా ఉండడం వల్ల పంటలు బాగా పండేవి. హైదరాబాద్‌లోని డ్రైనేజీ నీరు మూసీలోకి వెళ్లిన తర్వాత చాలా ఆశ్చర్యంగా పంటల దిగుబడి పెరిగింది. కానీ క్రమక్రమంగా పారిశ్రామిక వ్యర్థాలను మూసీలోకి వదలడం మొదలైంది. ముందుగా కాటేదాన్‌లోని బిస్కెట్‌ కర్మాగారాల నుంచి వ్యర్థాలను, ఆ తర్వాత పటాన్‌చెరువు, సనతనగర్‌, నాచారంలోని పరిశ్రమల నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా మూసీలోకి వదలడం మొదలైంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని భూగర్భజలాలు కలుషితమయ్యాయి. వరి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. వడ్లలో తాలు శాతం పెరిగింది. చెరువుల్లోని చేపలు చచ్చిపోవడం మొదలైంది. 1994లో ఏదులాబాద్‌ చెరువులోని చేపలు అన్నీ చచ్చిపోయి, పైకి తేలిన ఫోటో దేశవ్యాప్తంగా హిందూ పత్రికలో అన్ని ఎడిషన్లలో మొదటి పేజీలో వార్తగా వచ్చి సంచలనం రేపింది.


ఎన్నో సంస్థలు, ఎందరో శాస్త్రవేత్తలు మూసీ నీటి నమూనాలు పరీక్షించి నివేదికలు ప్రచురించారు. ఇక్కడ పండించిన ఆకుకూరల్లో రసాయనాల అవశేషాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో సేకరించిన పొలాల్లో కూడా రసాయనాలు కనబడుతున్నాయని నివేదికలు బైటపెట్టాయి. ఇప్పటికే మూసీ నీటిలో 24 రసాయన కాలుష్య పదార్థాలు కరిగిపోయి ఉన్నాయని, అందులో క్రోమియం, సైనైడ్‌ లాంటి విష రసాయనాలు కూడా ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. ఇవి కాకుండా నీటిలో కరగకుండా ఉండే ఆల్‌కాలిన్స్‌, సీసం, ఇనుము, ప్లాస్టిక్‌, అయోడిన్‌, సిమెంట్‌ లాంటి ఖనిజాలు కూడా ఉన్నట్లు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి.


మూసీ సుందరీకరణ పనులు ప్రారంభమయినప్పటి నుంచి కింద ఉన్న పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కత్వాలకు సంబంధించిన చిన్న నీటిపారుదల వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇంత భయంకరంగా ఉన్న కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు చేపట్టలేదని వాపోతున్నారు. నిజాం కాలంలో నిర్మించిన కాలువలలో గుర్రపుడెక్క పెరిగి నీటి కదలికకు అంతరాయం కలుగుతోంది. కాలువల ఒడ్డుమీద సర్కారు తుమ్మ మొక్కలు, ఇతర మొక్కలు పెరిగి కాలువలోని ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. కొన్ని కత్వాల రాళ్ళు కూడా ఊడిపోయాయి. మూసీ తీరాలకు ఇరుపక్కల భూమి ఉంది. నాగోలు బ్రిడ్జి దగ్గర నుంచి మూసీ తీరాన ఉన్న భూములను ప్లాట్లుగా చేసి అమ్మే కార్యక్రమం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్థులు మొదలుపెట్టారు. మూసీ సుందరీకరణలో భాగంగా నగరంలోని నీటిని రబ్బరు డ్యాం నిర్మించి ప్రవాహాన్ని ఆపివేసి, ఈత కొలనులు, బోటింగ్‌ లాంటివి ఏర్పాటుచేస్తే తమ గ్రామాలకు రావాల్సిన నీరు తగ్గిపోతుందని ప్రజలు భయపడుతున్నారు. వారు పలు అంశాలపై ప్రభుత్వం నుంచి హామీ కోరుతున్నారు. అవి: మూసీ సుందరీకరణలో సూర్యాపేట వరకు ఉన్న దిగువ ప్రాంతాలను కూడా భాగం చేయాలి. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామాల్లోకి వస్తున్న కాలువల్లో గుర్రపుడెక్క, పిచ్చి చెట్లు తొలగించి, కాలువలకు లైనింగ్‌ పనులు చేపట్టాలి. రియలెస్టేట్ కబ్బాలకు గురికాకుండా నాగోలు బ్రిడ్జి నుంచి మూసీ ప్రాజెక్టు వరకూ సర్వే నిర్వహించి నది వెడల్పు కొలిచి మార్కింగ్‌ ఏర్పాటు చేయాలి. మురుగు శుద్ధి కేంద్రాలలో ఆధునిక సాంకేతిక పద్ధతులు వాడి సమగ్రంగా కాలుష్యం నిర్మూలించాలి. అభివృద్ధి పనులలో నదిని ఆనుకుని నివసిస్తున్న బస్తీలను, గ్రామాలను తప్పనిసరిగా భాగస్వాములుగా చేయాలి. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు ఆలకించి తగుచర్యలు చేపట్టడానికి పౌరులుగా, నగరవాసులుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మన బాధ్యత.

ఎస్‌. జీవన్‌కుమార్‌

మానవ హక్కుల వేదిక

Updated Date - 2020-09-08T09:43:39+05:30 IST