కోహ్లీని బీసీసీఐ అలా అడిగి ఉండాల్సింది: విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ

ABN , First Publish Date - 2021-12-12T01:00:31+05:30 IST

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడంపై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ

కోహ్లీని బీసీసీఐ అలా అడిగి ఉండాల్సింది: విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ

ముంబై: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడంపై అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఎట్టకేలకు పెదవి విప్పారు. కెప్టెన్‌ను అలా ఒక్కసారిగా మార్చడం కంటే టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోహ్లీని బీసీసీఐ తొలుత అడిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తానైతే ఇప్పటి వరకు కోహ్లీతో మాట్లాడలేదని, కొన్ని కారణాలతో అతడి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉందని పేర్కొన్నారు.


‘‘నా వరకు చెప్పాలంటే కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకున్నాడు. బీసీసీఐ కొంత సూటిగా వ్యవహరించి వైట్ బాల్ ఫార్మాట్లు రెండింటి నుంచి తప్పుకోమని చెప్పాల్సింది. లేదంటే అతడిని తప్పించకుండా ఉండాల్సింది’’ అని రాజ్‌కుమార్ శర్మ చెప్పారు.


టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని చెప్పినప్పటికీ తమ మాట వినలేదని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఇలాంటి వాటిని తాను గుర్తు చేసుకోవాలని అనుకోవడం లేదన్నారు. ఇలాంటి వేర్వేరు ప్రకటనలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయన్నారు.


కోహ్లీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందన్న దానిపై సెలక్షన్ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని, బీసీసీఐ, లేదంటే సెలక్టర్లు ఏం ఆశిస్తున్నారో తనకు తెలియదని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి స్పష్టత కానీ, పారదర్శకత కానీ లేదని రాజ్‌కుమార్ శర్మ విమర్శించారు.

Updated Date - 2021-12-12T01:00:31+05:30 IST