ఐపీఎల్‌ యూఏఈలోనే

ABN , First Publish Date - 2021-05-30T09:13:55+05:30 IST

ఊహించినట్టుగానే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) రెండో దశకు యూఏఈ వేదిక కానుంది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా ఈ ఎడారి దేశంలోనే ఐపీఎల్‌ జరగనుంది...

ఐపీఎల్‌ యూఏఈలోనే

  • సెప్టెంబరు-అక్టోబరులో మ్యాచ్‌లు
  • బీసీసీఐ ఎస్‌జీఎంలో నిర్ణయం

న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) రెండో దశకు యూఏఈ వేదిక కానుంది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా ఈ ఎడారి దేశంలోనే ఐపీఎల్‌ జరగనుంది. శనివారం వర్చువల్‌గా జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. స్వదేశంలో తొలిదశలో 29 మ్యాచ్‌లు ముగిశాక పలువురు క్రికెటర్లకు కరోనా సోకడంతో లీగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన 31 మ్యాచ్‌లు యూఏఈలోని మూడు వేదికల్లో సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 వరకు జరిగే అవకాశాలున్నాయి. అయితే కచ్చితమైన తేదీలను మాత్రం బోర్డు ప్రకటించలేదు. ‘ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో పూర్తి చేయాలని ఎస్‌జీఎంలో నిర్ణయించాం. సెప్టెంబరు-అక్టోబరులో భార త్‌లో వర్షాకాలం కావడంతో మ్యాచ్‌లకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. అందుకే యూఏఈనే ఉత్తమమని భావించాం’ అని బీసీసీఐ ప్రకటించింది. ఈసారి విదేశీ క్రికెటర్ల ప్రాతినిధ్యం అనుమానంగానే ఉంది. పాక్‌తో సిరీస్‌ కారణంగా ఇంగ్లండ్‌ క్రికెటర్లు అందుబాటులో ఉండరు. కానీ ఏ ఇతర బోర్డులను వారి ఆటగాళ్లను ఆడించాలని ఒత్తిడి చేయమని, మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడంపైనే దృష్టి ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. 


నష్టపరిహారంపై చర్చ లేదు

గత రంజీ సీజన్‌ రద్దు కావడంతో దాదాపుగా 700 మంది దేశవాళీ క్రికెటర్లు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. అయితే వీరికి నష్టపరిహారం అందించే విషయమై ఎస్‌జీఎంలో చర్చ జరుగలేదు. ఓ రాష్ట్ర క్రికెట్‌ సంఘం ఈ అంశాన్ని లేవనెత్తినా బోర్డు చీఫ్‌ గంగూలీ, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తోసిపుచ్చినట్టు సమాచారం. అజెండాలో లేని విషయం గురించి చర్చ అనవసరమని వారు తేల్చారు.

 

సీపీఎల్‌ వాయిదా కోసం..

ఐపీఎల్‌లో వెస్టిండీస్‌ ఆటగాళ్లను ఆడించేందుకు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) షెడ్యూల్‌ను ఓ వారం ముందుకు జరిపించే ప్రయత్నంలో బీసీసీఐ ఉంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 19 వరకు సీపీఎల్‌ జరుగుతుంది. ఐపీఎల్‌ను సెప్టెంబరు 18 నుంచి నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి విండీస్‌ ఆటగాళ్లు అంతకన్నా ముందే యూఏఈకి వస్తే క్వారంటైన్‌ ముగించుకుని లీగ్‌కు సిద్ధంగా ఉంటారని బోర్డు భావిస్తోంది.



ప్రపంచకప్‌ కోసం గడువు కోరతాం..

టీ20 ప్రపంచక్‌పను ఎలాగైనా భారత్‌లోనే జరపాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అందుకే జూన్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో వేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మరో నెల రోజుల సమయం కోరాలనుకుంటోంది. ‘ఐసీసీ ఈ మెగా టోర్నీకి పన్ను మినహాయింపును కూడా అడుగుతోంది. కానీ మేం ప్రభుత్వ నిబంధనలను పాటించాలి కదా. అక్టోబరులో పరిస్థితులు ఎలా ఉంటా యో ఇప్పుడే చెప్పలేం. ఇంకా నాలుగన్నర నెలల సమ యం ఉంది. అందుకే టోర్నీ ఆతిథ్యంపై స్పష్టత కోసం నెల రోజుల గడువు కోరతాం’ అని బోర్డు అధికారి తెలిపారు. జూన్‌ 1న జరిగే ఐసీసీ సమావేశం కోసం గంగూలీ, రాజీవ్‌ శుక్లా, జై షా సోమవారం దుబాయ్‌ వెళ్లనున్నారు.

Updated Date - 2021-05-30T09:13:55+05:30 IST