బిసి కుల గణనతోనే సమగ్ర ప్రగతి సాధ్యం: వకుళాభరణం

ABN , First Publish Date - 2021-09-01T23:48:10+05:30 IST

రిమాణాత్మక సమాచారం శాస్త్రీయంగా సేకరించడం కుల గణన ద్వారానే సాధ్యమని, అందుకు గణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర బి సి కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.

బిసి కుల గణనతోనే సమగ్ర ప్రగతి సాధ్యం: వకుళాభరణం

హైదరాబాద్: పరిమాణాత్మక సమాచారం శాస్త్రీయంగా సేకరించడం కుల గణన ద్వారానే సాధ్యమని, అందుకు గణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర బి సి కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని హైకోర్టు లు, అన్ని బి.సి. కమిషన్లు గణన చేపట్టాలని సూచించాయన్నారు. వాస్తవ స్థితిగతుల అధ్యయనం చేయకుండా ఆయా సామాజిక వర్గ ప్రజల జీవితాలను అంచనావేయడం సాధ్యంకాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బిసి కమిషన్ ఛైర్మన్ గా వకుళాభవరణం,సభ్యులు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్మన్ గా డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులుగా సి. హెచ్. ఉపేంద్ర,శుభప్రద్ పటేల్ నూలి,కిషోర్ గౌడ్ లు ఖైరతాబాద్ లోని బి.సి.కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 


ఈ కార్యక్రమానికి బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం తదితరులు హాజరయా్యరు. ఈ సందర్భంగా బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం మాట్లాడుతూ రాష్ట్రంలో బి.సి లు సమున్నతంగా ఎదగడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి, వాస్తవాల ఆధారంగా సమర్పించే నివేదికల్లో తమ సిఫార్సులు హేతుబద్ధంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. బి.సి.కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు. ఇంతటి ఉన్నత స్థితిని కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 


సభ్యులు సి. హెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిషోర్ గౌడ్ లు మాట్లాడుతూ బి.సి.కమిషన్ నిర్మాణాత్మకంగా పనిచేస్తుందని, నిర్దిష్టమైన ప్రణాళికలతో పయనిస్తుందని పేర్కొన్నారు.  రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, ట్రాన్స్కో&జెన్కో సి.యం.డి దేవులపల్లి ప్రభాకర్ రావు , పలువురు మాజీ మంత్రులు, మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు మాజీ మరియు ప్రస్తుత ఎంఎల్ఏ లు, జి.హెచ్.ఎం.సి కార్పోరేటర్లు, వివిధ కుల సంఘాల నాయకులు, పురప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని, ఛైర్మన్ మరియు సభ్యులను పుష్పగుచ్చాలు, పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.


Updated Date - 2021-09-01T23:48:10+05:30 IST