చేతులు మారిన బే పార్క్‌!

ABN , First Publish Date - 2020-08-12T09:01:06+05:30 IST

‘పరిపాలనా రాజధాని’ విశాఖలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ చేతులు మారింది. మొన్నటికి మొన్న.. ‘కార్తీక వనం’.. ఇప్పుడు బే పార్క్‌.

చేతులు మారిన బే పార్క్‌!

  • మేజర్‌ వాటా కొనుగోలు చేసిన రెండు ఫార్మా కంపెనీలు
  • అందులోనే సీఎం కార్యాలయం ఏర్పాటు!?
  • ఇప్పటికే పరిశీలించిన కుటుంబ సభ్యులు
  • విశాఖ కొండపై వెలసిన లగ్జరీ రిసార్ట్‌
  • లీజుకు తీసుకుని ఘనంగా అభివృద్ధి
  • చివరికి.. ‘పెద్దల’ చేతికి సంస్థ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘పరిపాలనా రాజధాని’ విశాఖలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ చేతులు మారింది. మొన్నటికి మొన్న.. ‘కార్తీక వనం’.. ఇప్పుడు బే పార్క్‌. పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి మార్చేలోగానే ఇక్కడ కీలకమైన ప్రాజెక్టులను చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా ప్రభుత్వ, పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో భూములు తీసుకుని వ్యాపారాలు నడుపుతున్న వారిపై దృష్టి సారించారు. ఇప్పటికే (కార్తీకవనం) ప్రాజెక్టులో కొంత వాటా దక్కించుకున్నారు. విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డులో సాగర్‌నగర్‌ సమీపాన ఉన్న విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) స్థలంలో బీచ్‌ రిస్టార్‌ను పీపీపీలో అభివృద్ధి చేయడానికి ఓ సంస్థ పదేళ్ల క్రితం ఒప్పందం చేసుకోగా.. అది ఇప్పటికి పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అందులో కొంత వాటాను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో కొనుగోలు చేయించారు.


తాజాగా అదే ప్రాంతంలో బీచ్‌కు అభిముఖంగా కొండపై నడుస్తున్న ‘బే పార్క్‌’ ఎకో టూరిజం ప్రాజెక్టును కూడా చేజిక్కించుకున్నారు. ఇది రెవెన్యూ స్థలం. పర్యాటక శాఖకు ఇవ్వగా, అందులో ఎకో టూరిజం ప్రాజెక్టు పెడతామని ఇండో అమెరికన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 33 ఏళ్ల లీజుకు తీసుకుంది. ఈ మేరకు విశాఖ గ్రామీణ మండలం ఎండాడ గ్రామం సర్వే నంబరు 105లో కొండపై 28 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాంతం కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉండడంతో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రావడం చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు కొద్దికాలం క్రితమే ఈ కొండపై అంతర్జాతీయ ప్రమాణాలతో వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. సుమారు 138 గదులు, ఇనిఫినిటీ పూల్‌ (కనుచూపు మేరంతా నీరే... ఎదురుగా సముద్రం), నేచురోపతి, యోగా, హైడ్రోథెరపీ, ఆక్యుపంచర్‌.. వంటి ప్రకృతి సిద్ధమైన విధానాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యం అందించే రిసార్ట్‌గా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఒక్క వెల్‌నెస్‌ సెంటరే లక్ష చ.అ. విస్తీర్ణంలో ఉందంటే.. ఎలా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు.


ఈ ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకొని 18 ఏళ్లు కావస్తున్నా.. ఇది అందుబాటులోకొచ్చి మూడు, నాలుగేళ్లే అయింది. పర్యాటక శాఖ వీరికి భూమి అప్పగించిన తర్వాత వారు ఏం చేసినా పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టుపై వాటాదారులు ఇప్పటివరకు సుమారు రూ.120 కోట్లు వెచ్చించారని అంచనా. ఈ సంస్థ ప్రభుత్వం ఇచ్చిన దానికి అదనంగా మరికొంత స్థలం కలుపుకున్నట్టు తెలిసింది. 


కేంద్ర ప్రభుత్వ సంస్థకే అడ్డంకి

జాతీయ సముద్ర అధ్యయన సంస్థ (ఎన్‌ఐఓ)కు విశాఖపట్నంలో శాఖ ఉంది. వారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర పరిశోధనలకు ఓ లేబొరేటరీ నిర్మాణానికి ప్రతిపాదించగా వారికి బే పార్క్‌ కొండ దిగువన 3.25 ఎకరాలు కేటాయించారు. వారి స్థలంలో నుంచి బేపార్క్‌ నిర్వాహకులు కొండపైన రిసార్ట్‌కు పైపులైన్లు వేసేశారు. ఎన్‌ఐఓ అధికారులు ఆ పనులను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ సహకరించలేదు. దాంతో ఆరేళ్లుగా ఎన్‌ఐఓ అక్కడ ఎటువంటి నిర్మాణం చేపట్టలేకపోయింది. ఇది కాకుండా బే పార్క్‌ నిర్వాహకులు అదే కొండకు ఎదురుగా బీచ్‌లో మరికొన్ని ఎకరాలను చదును చేసి, దానికి గేటు ఏర్పాటుచేసి స్వాధీనంలో ఉంచుకున్నారు.


ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనే అధికార పార్టీ నాయకుల దృష్టిపడింది. రాజధానిని విశాఖకు మారుస్తున్నందున ముఖ్యమంత్రి నివాసం కోసం ఆ భవనాలను కూడా పరిశీలించారు. ఇందులో భాగంగా సీఎం కుటుంబ సభ్యులు రెండుసార్లు బే పార్క్‌ను సందర్శించి వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ యాజమాన్య హక్కులు మారిపోయాయి. విశాఖ సమీపంలో భారీ ఫార్మా కంపెనీలు నడుపుతున్న రెండు సంస్థలు బే పార్కులో అధిక శాతం వాటాను చేజిక్కించుకున్నాయి. నిర్వాహకులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని కొత్త భాగస్వాములు తీర్చేలా, పాతవారికి కొంత శాతం వాటా ఇచ్చేలా అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. బే పార్క్‌లోని కొంత భాగాన్ని సీఎం నివాసంగా మారుస్తారని చెబుతున్నారు. ఈ డీల్‌ వాస్తవమేనని.. రూ.100 కోట్ల అప్పు తీర్చడానికి అంగీకరించడం వల్ల పాత డెవలపర్లు సంతోషంగా ఒప్పుకున్నారని విశాఖలో బడా వ్యాపారవేత్తలు చెబుతున్నారు. 


కొత్త పాలసీతో ఏకంగా సొంతం?

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కొత్త పారిశ్రామిక విధానాన్ని 2020-23 పేరుతో ప్రకటించింది. ప్రభుత్వ భూమిని ఎవరైనా అభివృద్ధి చేయడానికి తీసుకుంటే..  పదేళ్ల తర్వాత కావాలనుకుంటే దాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. బే పార్క్‌ ఒప్పందం జరిగి 18 ఏళ్లు అయింది. అలాగే కార్తీకవనం ఒప్పందం జరిగి పదేళ్లు దాటింది. కొత్త విధానం కింద ఈ రెండింటినీ అధికార పార్టీ నాయకులు నామమాత్రపు ధరకు పూర్తిగా చేజిక్కించుకునే అవకాశం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొత్త పాలసీలో ఆ నిబంధన చేర్చారని భావిస్తున్నారు.

Updated Date - 2020-08-12T09:01:06+05:30 IST