బార్లతో బేరాలు

ABN , First Publish Date - 2022-07-30T07:55:39+05:30 IST

బార్లతో బేరాలు

బార్లతో బేరాలు

కాసులిస్తేనే లైసెన్స్‌లు.. ‘అధికార’ నేతల హుకుం 

బార్‌కు 10 నుంచి 15 లక్షల వరకూ డిమాండ్‌! 

ఆయా ప్రాంతాల్లో వ్యాపారాన్ని బట్టి ముడుపులు 

తమను కలిసిన వారికే లైసెన్స్‌లని హెచ్చరికలు

నేతల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు

నాయకులతో పాటు కొందరు అధికారుల జోక్యం

ముడుపులు చెల్లించలేక చాలా మంది వెనకడుగు 

1,672 దరఖాస్తులకు 1,158 మందే ఫీజు చెల్లింపు

అనూహ్యంగా తగ్గిన దరఖాస్తులు, వేలం పోటీ 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘బార్‌ పాలసీ అంతా ఆన్‌లైన్‌, పారదర్శకం’.. ప్రభుత్వం చేసిన ప్రకటన ఇది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ‘మమ్మల్ని కలిస్తేనే బార్‌ లైసెన్స్‌ వస్తుంది’ అంటూ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ నేతలు దరఖాస్తుదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో బార్‌కు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు వరకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు మద్యం వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు లైసెన్స్‌ ఫీజులు వేర్వేరుగా ఉన్నట్లే.. ముడుపులు కూడా ఆయా ప్రాంతాల్లో వ్యాపారాన్ని బట్టి నిర్ణయించారని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలను కలిసి ప్రసన్నం చేసుకునేందుకు దరఖాస్తుదారులు పోటీపడుతున్నారు. కొందరు దరఖాస్తుదారులు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాం’ అని క్లుప్తంగా చెప్పారు. కాగా తమను కాదని దరఖాస్తు చేసుకున్నవారికి బార్లు రావని అధికార పార్టీ నేతలు హెచ్చరించడంతో చాలామంది వెనకడుగు వేశారు. బార్ల కోసం ముందుగా ఎన్‌రోల్‌ చేసుకున్నవారి సంఖ్యతో పోలిస్తే దరఖాస్తు రుసుము చెల్లించిన వారి సంఖ్య అనూహ్యంగా పడిపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. దరఖాస్తులకు మొత్తం 1672 మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. అంత భారీ స్థాయిలో నమోదు కావడంతో ఎంత లేదన్నా 1500 మంది రుసుములు చెల్లించి వేలంలో పాల్గొంటారని భావించారు. కానీ చివరికి ఆ సంఖ్య 1158 వద్దే ఆగిపోయింది. దీంతో దరఖాస్తుల ద్వారా కళ్లుమూసుకుని రూ.వంద కోట్లు వస్తాయని ఎక్సైజ్‌ శాఖ వేసిన లెక్కలు తప్పాయి. దరఖాస్తుల ద్వారా రూ.91.27 కోట్లే వచ్చాయి. అంతేగాక వేలంలో పోటీ కూడా చాలా వరకు తగ్గిపోయింది. మొదట్లో దరఖాస్తులు వచ్చిన తీరు చూసి 840 బార్లకు దాదాపుగా 1:2 పోటీ ఉంటుందని భావించారు. కానీ చివరికి అది 1:1.3గా మారిపోయింది.


ఎప్పుడూ లేనివిధంగా లైసెన్స్‌లు

గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ బార్లకు కొత్తగా లైసెన్సులు జారీ చేసిన దాఖలాలు లేవు. బార్‌ అనేది ఎక్కువ పెట్టుబడితో కూడుకున్న విషయం కావడంతో పాలసీ ముగియగానే ఎప్పటికప్పుడు రెన్యువల్‌ చేసే విధానం ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త వ్యాపారులను రంగంలోకి దించాలని భావించింది. అందుకోసం పాలసీ గడువు ఉన్నప్పటికీ 2019లోనే కొత్త పాలసీని ప్రకటించింది. దీనిపై ప్రస్తుత లైసెన్సీలు కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో ఆ ప్రయత్నం ఆగిపోయింది. పాలసీ గడువు ముగిసిపోవడంతో తాజాగా కొత్త పాలసీని ప్రకటించింది. ప్రస్తుతం బార్లు ఉన్న వారికే రెన్యువల్‌ చేయాలంటూ లైసెన్సీలు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. 


నేతలకు వరంగా కొత్త పాలసీ

కొత్త పాలసీ అధికార పార్టీ నేతలకు వరంగా మారింది. ‘మళ్లీ మీకు లైసెన్స్‌ కావాలంటే అడిగినంత సమర్పించుకోవాలి’ అంటూ స్థానికంగా ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే భారీగా లైసెన్స్‌ ఫీజులు పెంచగా, మళ్లీ ముడుపుల గోలేంటని వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ధీదీఎక్సైజ్‌ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తమ చేతుల్లో ఏమీ లేదని భావించిన కొందరు అధికారులు దీనికి సహకారం అందిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో 40 బార్ల విషయంలో ఉన్నతాధికారులపై ముడుపుల ఆరోపణలున్నాయి. తనిఖీలు చేయకుండా ఉండేందుకు కొంత వసూళ్లు చేశారని లైసెన్సీలు చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయ నేతలతో పాటు అధికారులు కూడా జోక్యం చేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. తలా కొంచెం అన్నట్టుగా అధికార పార్టీ నేతలు, అధికారులు వ్యవహరిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. 

Updated Date - 2022-07-30T07:55:39+05:30 IST