ట్రూజెట్‌పై దివాలా పిటిషన్
ABN , First Publish Date - 2022-10-11T09:39:15+05:30 IST
అప్పుల్లో కూరుకుపోయిన ట్రూజెట్‌పై (టర్బో మేఘా ఎయిర్‌వేస్) ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ బెంచ్‌లో దివాలా పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అప్పుల్లో కూరుకుపోయిన ట్రూజెట్‌పై (టర్బో మేఘా ఎయిర్‌వేస్) ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ బెంచ్‌లో దివాలా పిటిషన్ దాఖలైంది. విమానాలను లీజుకు ఇచ్చిన డే లీజింగ్ (ఐర్లాండ్) 8 లిమిటెడ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. అప్పుల్లో కూరుకుపోవడంతో కొద్ది నెలల కిత్రం ట్రూజెట్ సేవలను నిలిపి వేసింది. లీజు, రెంటల్స్ కింద విమాన లీజర్లకు టర్బో మేఘా ఎయిర్‌వేస్ దాదాపు రూ.35 కోట్లు బకాయి పడింది. దీంతో విమానాలను అద్దెకు ఇచ్చిన కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. కాగా ట్రూజెట్‌లో 79 శాతం వాటాను రూ.200 కోట్లకు సొంతం చేసుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో విన్‌ఎయిర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ట్రూజెట్ మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించగలదని గతంలో విన్‌ఎయిర్ పేర్కొంది.