కూల్‌గా కొట్టేశారు..

ABN , First Publish Date - 2021-09-30T09:00:20+05:30 IST

ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. మ్యాక్స్‌వెల్‌ (30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌), తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు,..

కూల్‌గా కొట్టేశారు..

  • రాణించిన మ్యాక్స్‌వెల్,భరత్ 
  • రాజస్థాన్‌పై బెంగళూరు గెలుపు


దుబాయ్‌: ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. మ్యాక్స్‌వెల్‌ (30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌), తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 44) బాధ్యతాయుతమైన భాగస్వామ్యంతో.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన 7 వికెట్లతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. తొలుత రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 149/9 స్కోరు చేసింది. ఎవిన్‌ లూయిస్‌ (37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), యశస్వి జైస్వాల్‌ (31) రాణించారు. హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్‌ అహ్మద్‌, యజ్వేంద్ర చాహల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో బెంగళూరు 17.1 ఓవర్లలో 153/3 పరుగులు చేసి నెగ్గింది. ముస్తాఫిజుర్‌  రెండు వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్‌ ఓటములతో రాజస్థాన్‌ నాకౌట్‌ ఆశలు మరింతగా దిగజారాయి. చాహల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. 


భళా.. భరత్‌: ఛేదనను బెంగళూరు ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్‌ కోహ్లీ (25).. మోరిస్‌ వేసిన తొలి ఓవర్‌లోనే మూడు బౌండ్రీలతో జోరు ప్రదర్శించాడు. మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (22) కూడా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, 6వ ఓవర్‌లో పడిక్కళ్‌ను బౌల్డ్‌ చేసిన ముస్తాఫిజుర్‌.. తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కోహ్లీని పరాగ్‌ డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. ఈ దశలో భరత్‌, మ్యాక్స్‌వెల్‌.. రన్‌రేట్‌ పడిపోకుండా జాగ్రత్తగా ఆడడంతో చాలెంజర్స్‌ 10 ఓవర్లలో 79/2తో నిలిచింది. ఎంతో కూల్‌గా ఆడిన భరత్‌.. వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదాడు. మోరిస్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో టీమ్‌ స్కోరును సెంచరీ మార్క్‌ దాటించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించడంతో బెంగళూరు వడివడిగా లక్ష్యం దిశగా సాగింది. అయితే, అర్ధ శతకానికి చేరువలో ఉన్న భరత్‌.. 16వ ఓవర్‌లో ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లో మోరిస్‌ బౌలింగ్‌లో సిక్స్‌, మూడు ఫోర్లతో 22 పరుగులు రాబట్టిన మ్యాక్సీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. విజయం కోసం ఒక్క పరుగు కావాల్సి ఉండగా.. డివిల్లీర్స్‌ (4) బౌండ్రీతో ముగించాడు. 


లూయిస్‌ అదరగొట్టినా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు లూయిస్‌, యశస్వి అదిరిపోయే ఆరంభాన్నిచ్చినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. 11 ఓవర్లలో 100/1తో పటిష్ఠంగా కనిపించిన రాయల్స్‌.. బెంగళూరు బౌలర్ల దెబ్బకు మిగతా 9 ఓవర్లలో 8 వికెట్లు చేజార్చుకొని 49 పరుగులే చేసింది. యశస్వి 4,6తో ఎదురుదాడిని ఆరంభించగా.. ఆ తర్వాత లూయిస్‌ పుంజుకున్నాడు. గార్టన్‌ (1/30) వేసిన 4వ ఓవర్‌లో బ్యాట్‌ ఝుళిపించిన లూయిస్‌ 6,4,6తో మొత్తం 18 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్‌ 56/0తో నిలిచింది. అయితే, జైస్వాల్‌ను అవుట్‌ చేసిన క్రిస్టియన్‌.. తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. అర్ధ శతకంతో దూకుడుగా ఉన్న డేంజర్‌మన్‌ లూయిస్‌ను గార్టన్‌ స్లో బంతితో బోల్తా కొట్టించాడు. ఈ దశలో స్నిన్నర్లు చాహల్‌, షాబాజ్‌ వికెట్లు తీస్తూ రాజస్థాన్‌కు కళ్లెం వేశారు. చాహల్‌ బౌలింగ్‌లో లోమ్రర్‌ (3) అవుట్‌ కాగా.. 14వ ఓవర్‌లో శాంసన్‌ (19), తెవాటియా (2)లను షాబాజ్‌ పెవిలియన్‌ చేర్చి గట్టిదెబ్బ కొట్టాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో లివింగ్‌స్టోన్‌ (6) వికెట్‌ పారేసుకోగా.. రియాన్‌ పరాగ్‌ (9), క్రిస్‌ మోరిస్‌ (14)తోపాటు సకారియా(2)ను హర్షల్‌ అవుట్‌ చేశాడు. 


స్కోరుబోర్డు

రాజస్థాన్‌: లూయిస్‌ (సి) భరత్‌ (బి) గార్టన్‌ 58, యశస్వి జైస్వాల్‌ (సి) సిరాజ్‌ (బి) క్రిస్టియన్‌ 31, శాంసన్‌ (సి) పడిక్కళ్‌ (బి) షాబాజ్‌ 19, మహిపాల్‌ (స్టంప్డ్‌) భరత్‌ (బి) చాహల్‌ 3, లివింగ్‌స్టోన్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) చాహల్‌ 6, తెవాటియా (సి) పడిక్కళ్‌ (బి) షాబాజ్‌ 2, రియాన్‌ (సి) కోహ్లీ (బి) హర్షల్‌ 9, మోరిస్‌ (సి) పడిక్కళ్‌(బి) హర్షల్‌ 14, సకారియా (సి) డివిల్లీర్స్‌ (బి) హర్షల్‌ 2, కార్తీక్‌ త్యాగి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 149/9; వికెట్ల పతనం: 1-77, 2-100, 3-113, 4-113, 5-117, 6-127, 7-146, 8-146, 9-149; బౌలింగ్‌: జార్జ్‌ గార్టన్‌ 3-0-30-1, సిరాజ్‌ 3-0-18-0, మ్యాక్స్‌వెల్‌ 2-0-17-0, హర్షల్‌ పటేల్‌ 4-0-34-3, డాన్‌ క్రిస్టియన్‌ 2-0-21-1, చాహల్‌ 4-0-18-2, షాబాజ్‌ 2-0-10-2. 


బెంగళూరు: కోహ్లీ (రనౌట్‌/పరాగ్‌) 25; పడిక్కళ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 22; శ్రీకర్‌ భరత్‌ (సి-సబ్‌) రావత్‌ (బి) ముస్తాఫిజుర్‌ 44; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 50; డివిల్లీర్స్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 17.1 ఓవర్లలో 153/3; వికెట్ల పతనం: 1-48, 2-58, 3-127; బౌలింగ్‌: క్రిస్‌ మోరిస్‌ 4-0-50-0; కార్తీక్‌ త్యాగి 2-0-23-0; చేతన్‌ సకారియా 3-0-18-0; ముస్తాఫిజుర్‌ 3-0-20-2; తెవాటియా 3-0-23-0; మహిపాల్‌ 2-0-13-0; రియాన్‌ 0.1-0-4-0. 

Updated Date - 2021-09-30T09:00:20+05:30 IST