5న బంద్‌ను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2021-03-03T09:30:38+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 5న నిర్వహించనున్న

5న బంద్‌ను జయప్రదం చేయండి

ప్రజలకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు

బంద్‌కు రైతు సంఘాల మద్దతు: వడ్డే శోభనాద్రీశ్వరరావు

అన్ని రాజకీయ పార్టీలపై బాధ్యత: ఏఐటీయూసీ


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), విజయవాడ సిటీ, మచిలీపట్నం టౌన్‌, మార్చి 2: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 5న నిర్వహించనున్న రాష్ట్రబంద్‌ను విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, ప్రజలు జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు కోరారు. విశాఖపట్నంలో ని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజావ్యతిరేకమన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో కేంద్రం పెట్టుబడి రూ.4,889 కోట్లు మాత్రమేనని, కానీ పన్నుల రూపంలో కర్మాగారం ఇప్పటివరకూ సుమారు రూ.43 వేల కోట్లకుపైగా ప్రభుత్వానికి చెల్లించిందన్నారు. 1.2 మిలియన్‌ టన్నుల నుంచి 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి కార్మికులు అభివృద్ధి చేసిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కమిటీ మరో చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటుపరమైతే అనేక  లక్షల మంది ఉపాధి కోల్పోతారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌, కార్మిక సంఘాల నేతలు మంత్రి రాజశేఖర్‌, కొమ్మినేని శ్రీనివాసరావు, గంధం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


రైతులు, రైతు సంఘాలు పాల్గొనాలి: వడ్డే

స్టీల్‌ప్లాంట్‌ పైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని ఏపీ రైతుసంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 5న రాష్ట్రబంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతులు, రైతుసంఘాలు బంద్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం ఈనెల 6వ తేదీన 100 రోజులకు చేరుకున్న నేపథ్యంలో కృష్ణాజిల్లా హనుమాన్‌ జంక్షన్‌, ఉయ్యూరుల్లో రైతుల ఎండ్లబండ్ల ర్యాలీలు, రాత్రికి కిసాన్‌ జ్యోతి నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా ఈనెల 23న ‘యాంటీ కార్పొరేట్‌’ కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈనెల 12న భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమితి నేతలు వై.కేశవరావు, రావుల వెంకయ్య, రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంటక గోపాలకృష్ణారావు, కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ నాయకుడు ఎన్‌.నరసింహరావు, పలు వ్యవసాయ, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.


ఆ రోజు బస్సులు పూర్తిగా నిలిపివేయాలి: ఓబులేసు

5న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక కన్వీనర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు. 5న ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేయాలన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సీఎం జగన్‌ ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నారన్నారు. సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఎండీ ముజఫర్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ముక్తకంఠంతో అందరూ ఖండించాలని కోరారు.

Updated Date - 2021-03-03T09:30:38+05:30 IST