భళా.. బజ్‌రంగ్‌

ABN , First Publish Date - 2021-08-08T09:46:48+05:30 IST

ఆకలితో ఉన్న సింహంకన్నా గాయపడ్డదానితోనే ఎక్కువ ప్రమాదకరమంటారు.. స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా కూడా అదే రీతిన చెలరేగాడు. స్వర్ణ పట్టు పడతాడని అంతా భావించిన ఈ వరల్డ్‌ నెంబర్‌వన్‌ సెమీ్‌సలో ఓటమికి దిమ్మతిరిగేలా బదులు తీర్చుకున్నాడు...

భళా.. బజ్‌రంగ్‌

  • రెజ్లింగ్‌లో కాంస్యం

ఆకలితో ఉన్న సింహంకన్నా గాయపడ్డదానితోనే ఎక్కువ ప్రమాదకరమంటారు.. స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా కూడా అదే రీతిన చెలరేగాడు. స్వర్ణ పట్టు పడతాడని అంతా భావించిన ఈ వరల్డ్‌ నెంబర్‌వన్‌ సెమీ్‌సలో ఓటమికి దిమ్మతిరిగేలా బదులు తీర్చుకున్నాడు. ప్రత్యర్థికి ఒక్కటంటే ఒక్క పాయింట్‌ కూడా ఇవ్వకుండా కాంస్య పోరును ఏకపక్షంగా మార్చేశాడు. తద్వారా 2012 లండన్‌ గేమ్స్‌ భారత రెజ్లింగ్‌లో ఉత్తమ ప్రదర్శన (రజతం, కాంస్యం)ను ఈసారీ పునరావృతం చేసినట్టయింది. రెజ్లింగ్‌లో బజరంగ్‌ పూనియా భారత జోరును కొనసాగించాడు. 65కేజీ పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో అతడు దేశానికి కాంస్య పతకం అందించాడు. సెమీఫైనల్లో ఓడిన బజరంగ్‌ మూడో స్థానం కోసం జరిగిన పోరులో తలపడ్డాడు. దీంట్లో కజకిస్థాన్‌కు చెందిన దౌలత్‌ నియాజ్‌బెకోవ్‌ను 8-0 తేడాతో చిత్తు చేశాడు. 2019 వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప సెమీ్‌సలో బజరంగ్‌ ఇదే ప్రత్యరిపై త్రుటిలో ఓటమిపాలయ్యాడు. అయితే ఈసారి మాత్రం దౌలత్‌కు ఇసుమంతైనా అవకాశం ఇవ్వకుండా బజరంగ్‌ దెబ్బతీశాడు. ఇక ఇప్పటివరకు గాయం కారణంగా భారత స్టార్‌ రెజ్లర్‌ మోకాలికి పట్టీ కట్టుకునే ఆడగా కాంస్య పోరులో మాత్రం అది కనిపించలేదు. దీంతో పూర్తి ఫిట్‌గా కనిపించిన బజరంగ్‌  అసలైన సత్తా చూపించాడు. చక్కటి డిఫెన్స్‌తో పాటు అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శించాడు. ముఖ్యంగా తన కాళ్లు ప్రత్యర్థికి అందకుండా చూసుకున్నాడు. తొలి నిమిషంలో బజరంగ్‌కు పాయింట్‌ దక్కలేదు. ఇక రెండో పీరియడ్‌లో బజరంగ్‌ హవా ముందు దౌలత్‌ నిలవలేకపోయాడు. అయితే మ్యాట్‌ నుంచి దౌలత్‌ను నెట్టడంతో పాటు టేక్‌డౌన్‌ చేస్తూ చకచకా పాయింట్లు సాధించుకుంటూ వెళ్లాడు. చివర్లో దౌలత్‌ పిన్‌డౌన్‌ చేయాలని చూసినా బజరంగ్‌ చాన్స్‌ ఇవ్వలేదు. అటు ప్రత్యర్థిని మరోసారి కిందపడేయడతో 8-0తో తిరుగులేని స్థితికి చేరుకున్న బజరంగ్‌ కాంస్యం అందుకున్నాడు. 







  • ఆటే ఆరోప్రాణం!


తండ్రి బల్వాన్‌సింగ్‌, సోదరుడు హరీందర్‌ ఇద్దరూ రెజ్లర్లే..అలాంటప్పుడు బజ్‌రంగ్‌ పూనియాకు కుస్తీ ఆటపట్ల మక్కువ కలగకుండా ఎందుకుంటుంది..నిజానికి అది అతడికి ఆరోప్రాణం..ఎముకలు కొరికే చలిలో అర్ధరాత్రి రెండు గంటలకే అఖాడా బాట పట్టేవాడు..గంటలపాటు అక్కడే సాధన చేసేవాడు..బరువు విభాగాల పరిమితితో సంబంధంలేదు..ప్రత్యర్థి ఎవరైనా పర్లేదు తనకు కావాల్సింది బరిలో దిగడమే..అలా రెజ్లింగ్‌పట్ల పిచ్చే బజ్‌రంగ్‌ను నేడు ఒలింపిక్‌ పతకస్థాయికి చేర్చింది..


హరియాణాలోని ఝాఝర్‌ జిల్లా ఖుదాన్‌ గ్రామానికి చెందిన బజ్‌రంగ్‌కు చిన్ననాటినుంచే రెజ్లింగ్‌పట్ల అమితాసక్తి. వణికించే చలికాలంలోనూ అర్ధరాత్రి రెండు గంటలకే ఇంటిని వీడేవాడు. తల్లికి తెలియకూడదనే ఉద్దేశంతో తన మంచంమీద దిండ్లు పరిచి పైన దుప్పటి కప్పేవాడు. అలా చేయడం ద్వారా తాను పడుకొనే ఉన్నానని తల్లిని భ్రమింపజేసేవాడు. అలా వెళ్లిన పూనియా ఉదయం ఏడున్నర తర్వాత మళ్లీ ఇంటికి వచ్చేవాడు. ఎప్పుడు వెళ్లావని తల్లి ఓం ప్యారీ అడిగితే ఎప్పటిలాగానే నాలుగు గంటలకు అని అబద్ధం చెప్పేవాడు. కానీ ఆమెకు తెలుసు అంతకంటే ఎంతోముందుగానే కుమారుడు అఖాడాకు వెళ్లాడని! రెజ్లింగ్‌పట్ల పూనియా అనురక్తిని గమనించిన తల్లి ఆటలో ఉన్నతస్థానానికి ఎదగాలంటే ప్రతిభేకాదు ప్రవర్తనా ముఖ్యమని అతడికి నూరిపోసింది. బౌట్‌ ఓడితే దుఃఖించొద్దని, ప్రత్యర్థులకు బలహీనంగా కనిపించొద్దని, పరాజయాలను హుందాగా స్వీకరించాలని, ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో ఉండాలని అతడికి చెప్పేది.


పెద్దోడైన ప్రత్యర్థిని మట్టికరిపించి..

2008 మఛ్రోలీ గ్రామంలో రెజ్లింగ్‌ పోటీలు జరిగితే బజ్‌రంగ్‌. అక్కడికి వెళ్లాడు. 60 కిలోల విభాగం వారికే అక్కడ పోటీలు జరుగుతున్నాయి. కానీ బజ్‌రంగ్‌ బరువు 34 కిలోలే. అయినా తాను పోటీపడతానని పూనియా నిర్వాహకులకు చెప్పాడు. పూనియా ఆత్మవిశ్వాసానికి అచ్చెరువొందిన నిర్వాహకులు 60 కి.విభాగంలో తలపడేందుకు బజ్‌రంగ్‌కు ఓకే చెప్పారు. అలా బరిలోకి దిగిన పూనియా ప్రత్యర్థిని మట్టికరిపించి ఔరా అనిపించాడు. ఝాఝర్‌ జిల్లాలోని ఛారా ఇండోర్‌ స్టేడియంలో ఆర్యా వీరేందర్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన బజ్‌రంగ్‌ 2008లో ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియంలో చేరాడు. 2010లో ఏషియన్‌ కేడెట్‌ చాంపియన్‌గా నిలిచిన బజ్‌రంగ్‌ మరుసటి ఏడాది ఆ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఏడు సంవత్సరాలు ఛత్రసాల్‌ స్టేడియంలో ఉన్న సమయంలో దిగ్గజ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌..బజ్‌రంగ్‌కు ఎంతగానో మార్గదర్శనం చేశాడు. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో పతకాలు గెలవడం ద్వారా స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. .2018 వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో రజతంతో ఒలింపిక్‌ పతకమూ నెగ్గగల సత్తా కలిగిన రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యంతో ఆ అంచనాలను బజ్‌రంగ్‌ నిజం చేశాడు. 

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


Updated Date - 2021-08-08T09:46:48+05:30 IST