‘రైతుబజార్ల’పైనా బాదుడే!

ABN , First Publish Date - 2022-08-20T10:02:13+05:30 IST

‘బాదుడు’కు కాదేదీ అనర్హమన్నట్లు.

‘రైతుబజార్ల’పైనా బాదుడే!

  • దుకాణాల అద్దె భారీగా పెంపు 
  • గతంతో పోలిస్తే.. 100 నుంచి 250శాతం పెరిగిన అద్దెలు
  • కూరగాయ రైతులు, డ్వాక్రా సంఘాల ఆవేదన


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘బాదుడు’కు కాదేదీ అనర్హమన్నట్లు.. రైతు బజార్లపై ఆధారపడి జీవనం సాగించే పేదలపైనా జగన్‌ సర్కారు తెగ బాదేస్తోంది! కూరగాయలు అమ్ముకునే రైతులను, డ్వాక్రా మహిళలనూ వైసీపీ ప్రభుత్వం వదలడం లేదు. రాష్ట్రంలోని రైతుబజార్లలో కూరగాయలు విక్రయించే రైతులకు కేటాయించిన దుకాణాల అద్దెలనూ భారీగా పెంచేశారు. ఆదాయం కోసం చిన్నచిన్న గదులకు కూడా రూ.వేలల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. రైతు సంపాదనలో సగం మార్కెటింగ్‌శాఖ పిండేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం రైతుబజార్లలోని దుకాణాలను నామమాత్రపు అద్దెలతో దుకాణాలు కేటాయించగా, ఈ ప్రభుత్వం అద్దెలను ఆమాంతం పెంచేసింది. పైగా ఎవరు ఎక్కువ అద్దె కడితే వాళ్లకే అన్న రీతిలో వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో రైతుబజార్‌ను బట్టి ఒక్కో దుకాణానికి నెలకు రూ.600నుంచి రూ.1,200వరకు అద్దె ఉండేది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2021లో రూ.1200నుంచి రూ.2వేలకు పెంచారు. ఈ ఏడాది కమర్షియల్‌ షాపుల పేరుతో కొత్తగా గదులు ఏర్పాటు చేసి, ఒక్కో గదికి రూ.4-8వేలు అద్దెలు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని రైతుబజార్లలో అద్దెల మాదిరిగా చిన్న రైతుబజార్లలోనూ దుకాణాల అద్దెలు పెంచేశారు. ఇలా రద్దీ తక్కువగా ఉండే రైతుబజార్లలోనూ అద్దెలు రెట్టింపు కావడంతో రోజంతా కూర్చొని, కూరగాయలు అమ్మితే వచ్చే ఆదాయమంతా దుకాణాల అద్దెలకే సరిపోతోందని రైతులు, డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. 


ఆదాయం కోసం ఒత్తిళ్లు

రాష్ట్రంలో 104రైతుబజార్లు ఉన్నాయి. 2021లో మరో 54 ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రైతుబజార్లకు స్థలాలు గుర్తించగా, 39 టెండర్ల దశలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికే 15ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ కొన్ని ఇంకా ప్రారంభానికి నోచలేదు. 2020వరకు రైతుబజార్ల నిర్వహణ వ్యయం, సిబ్బంది వేతనాలను ఆయా మార్కెట్‌ యార్డుల నుంచే చెల్లించేవారు. దీంతో నెలల తరబడి సిబ్బంది వేతనాలు పెండింగ్‌లో ఉండేవి. ఈ కారణంగా రైతుబజార్లు స్వయం సమృద్ధి సాధించాలని ఆదాయం పెంపునకు ప్రణాళికలు వేశారు. అందులో భాగంగా రైతుబజార్లలోని దుకాణాల అద్దెలను పెంచడంతో పాటు అదనంగా గదుల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చిన్న చిన్న గదులకు కూడా వేలల్లో అద్దెలు నిర్ణయించారు. రాష్ట్రంలోని రైతుబజార్ల ద్వారా 2020డిసెంబరు నాటికి ఏటా రూ.7.50కోట్లు ఆదాయం ఉండగా, బినామీ రైతుల తొలగింపు, దుకాణాల అద్దెల పెంపుతో ఆదాయం  రూ.10.50కోట్లకు పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో రైతుబజార్‌లో 15-30 దుకాణాలుంటే.. ఏడాదికి సగటున రూ.2లక్షలు ఆదాయం పెరిగింది. పెద్ద రైతుబజార్లలో గరిష్ఠంగా రూ.10లక్షలు, చిన్న పట్టణాల్లో సగటున రూ.లక్షపైగా ఆదాయం పెరిగింది. ఇప్పటికే రూ.3కోట్లు ఆదాయం పెరగ్గా, ఇంకా ఆదా యం పెంచాలని మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు ఆశాఖ జిల్లా అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నట్లు సమాచారం. 


వేతనాలు అరకొరే!

రైతుబజార్ల ద్వారా సర్కారుకు ఆదాయం పెరిగినా.. సిబ్బందికి వేతనాలను పెంచలేదు. పైగా ఇంకా ఆదాయం పెంచాలంటూ ఒత్తిడి పెంచుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. కనీస వేతన చట్ట ప్రకారం వేతనాలివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా.. ఎస్టేట్‌ ఆఫీసర్లకు రూ.19,500, సూపర్‌వైజర్లు, సెక్యూరిటీగార్డులకు కేవలం రూ.12వేలే ఇస్తున్నారు. ఇది రైతుబజార్ల పర్యవేక్షణ చూస్తున్న జాయింట్‌ కలెక్టర్ల దయాదక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటోంది. ఇప్పటికైనా మార్కెటింగ్‌ ఉన్నతాధికారులు స్పందించి పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని ఎస్టేట్‌ ఆఫీసర్లు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-20T10:02:13+05:30 IST