పతక వీరులకు పట్టం

ABN , First Publish Date - 2021-10-28T07:32:38+05:30 IST

ఈ ఏడాది క్రీడా అవార్డులకు అథ్లెట్ల ఎంపిక పూర్తయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా పదకొండు మంది ప్లేయర్లను దేశ అత్యున్నత క్రీడా...

పతక వీరులకు పట్టం

నీరజ్‌ సహా 11 మందికి ఖేల్‌రత్న

మిథాలీ రాజ్‌, సునీల్‌ ఛెత్రికీ అత్యున్నత క్రీడా పురస్కారం

ధవన్‌తో పాటు 35 మందికి అర్జున అవార్డు

క్రీడాశాఖకు ఎంపిక కమిటీ ప్రతిపాదన


న్యూఢిల్లీ: ఈ ఏడాది క్రీడా అవార్డులకు అథ్లెట్ల ఎంపిక పూర్తయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా పదకొండు మంది ప్లేయర్లను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నకు ఎంపిక చేశారు. ఇక.. 35 మందికి అర్జున అవార్డు ఇవ్వాలంటూ ఎంపిక కమిటీ కేంద్ర క్రీడాశాఖకు బుధవారం ప్రతిపాదించింది. ఖేల్‌రత్నకు ఎంపికైన వారిలో తెలుగు క్రికెటర్‌, భారత మహిళల టెస్టు, వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఉండడం విశేషం. ఇటీవలే అంతర్జాతీయ క్రికెటర్‌లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్న 38 ఏళ్ల మిథాలీని ఈ అత్యున్నత పురస్కారానికి బీసీసీఐ ఈ ఏడాది జూన్‌లో సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, రజతంతో రికార్డుకెక్కిన రెజ్లర్‌ రవి దహియా, కాంస్యం కొల్లగొట్టిన మహిళా బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ కూడా ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు. టోక్యో పారాలింపిక్స్‌లో బంగారు పతకాలతో మెరిసిన ఐదుగురు పారా అథ్లెట్ల ప్రతిభకు గుర్తింపునిస్తూ.. షట్లర్లు ప్రమోద్‌ భగత్‌, కృష్ణ నాగర్‌, షూటర్లు అవనీ లేఖార, మనీశ్‌ నర్వాల్‌, జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ను కూడా అత్యున్నత అవార్డుతో సత్కరించాలని నిర్ణయించారు.


అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న హాకీ జట్టు గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌, ఫుట్‌బాల్‌ జట్టు సారథి సునీల్‌ ఛెత్రి కూడా ఖేల్‌రత్న అందుకోనున్నారు. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ప్రతి అథ్లెట్‌ను క్రీడా అవార్డులకు ఎంపిక చేసి సముచిత గౌరవాన్ని ఇచ్చారు. టోక్యోలో పతకాలు గెలుచుకున్న రెజ్లర్‌ భజ్‌రంగ్‌ పూనియా, షట్లర్‌ సింధు, వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి గతంలోనే ఖేల్‌రత్న అందుకోవడంతో వారిని అవార్డు పరిగణనలోకి తీసుకోలేదు. నిరుడు ఐదుగురికి ఖేల్‌రత్న ఇవ్వగా.. ఈసారి అంతకు రెట్టింపు సంఖ్యలో క్రీడాకారులను ఎంపికచేశారు. ఈ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 19 పతకాలు గెలిచారు. 

Updated Date - 2021-10-28T07:32:38+05:30 IST