Abn logo
Sep 4 2021 @ 02:30AM

భారత్‌ జోరు మరో మూడు

రజతం, రెండు కాంస్యాలతో అదుర్స్‌

చరిత్ర సృష్టించిన అవని, ప్రవీణ్‌, హర్విందర్‌

పారాలింపిక్స్‌ 

రెండు రోజులుగా పతకాలు లేకుండా పారాలింపిక్స్‌ను ముగించిన భారత అథ్లెట్లు శుక్రవారం చెలరేగారు.. ఏకంగా మూడు పతకాలతో చరిత్ర సృష్టించారు.. ఇప్పటికే స్వర్ణంతో రికార్డుపుటలకెక్కిన యువ షూటర్‌ అవని లేఖార మరో పతకంతో అదరగొట్టింది..మహిళల 50 మీ. రైఫిల్‌ త్రీపొజిషన్స్‌ ఎస్‌హెచ్‌-1లో ఆమె కాంస్య పతకంతో మురిసింది..తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సొంతం చేసుకున్న తొలి భారత క్రీడాకారిణిగా ఘనత వహించింది..టీనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌ పురుషుల హైజం్‌పలో ఆసియా రికార్డుతో రజత పతకం నెగ్గి భళా అనిపించాడు..ఇక ఆర్చరీలో హర్విందర్‌ సింగ్‌ కాంస్యంతో ముచ్చటగా మూడో పతకాన్ని భారత్‌ ఖాతాలో వేశాడు.. మరోవైపు బ్యాడ్మింటన్‌లో మనోళ్ల్ల జోరు కొనసాగుతోంది..ఏకంగా ముగ్గురు సెమీ్‌సకు చేరి మరింతగా పతక ఆశలు రేపారు.


టోక్యో: మరో రెండు రోజుల్లో పారాలింపిక్స్‌ ముగుస్తుండగా..భారత క్రీడాకారులు పతకాలతో దుమ్ము రేపారు. రెండు రోజుల పతక కొరతను తీరుస్తూ ఏకంగా మూడు మెడల్స్‌ సొంతం చేసుకొని ఔరా అనిపించారు. హైజం్‌పలో ప్రవీణ్‌కుమార్‌ రజతం, షూటింగ్‌లో అవని, ఆర్చరీలో హర్విందర్‌ సింగ్‌ కాంస్య పతకాలు సాధించారు.


ప్రవీణ్‌..ఆసియా రికార్డు..

తొలి పారాలింపిక్స్‌లో తలపడిన 18 ఏళ్ల ప్రవీణ్‌కుమార్‌ పురుషుల హైజంప్‌ టీ-64 విభాగంలో 2.07 మీ. దుమికి కొత్త ఆసియా రికార్డుతో రజత పతకం చేజిక్కించుకున్నాడు. జొనాథన్‌ బ్రూమ్‌ (బ్రిటన్‌, 2.10 మీ.) స్వర్ణం, రియో గేమ్స్‌ చాంపియన్‌ మాసెజ్‌ లిపియాటో (పొలెండ్‌, 2.04మీ.) కాంస్య పతకం నెగ్గారు. నొయిడాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ టోక్యోలో  పతకం సాధించిన పిన్నవయస్సు భారత అథ్లెట్‌గా నిలిచాడు.


సింగ్‌ ఈజ్‌ కింగ్‌..

పారాలింపిక్స్‌ ఆర్చరీలో భారత్‌కు తొలి పతకం అందించిన ఆటగాడిగా హర్విందర్‌సింగ్‌ చరిత్ర సృష్టించాడు. పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో అతడు మూడో స్థానం సాధించాడు. కొరియా ఆర్చర్‌ మిన్‌ సుతో నరాలు తెగే ఉత్కంఠతో సాగిన కాంస్య పోటీలో 31 ఏళ్ల హర్విందర్‌ 5-3తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ ఐదో సెట్లో పదికి పది పాయింట్లు స్కోరు చేసిన కొరియా షూటర్‌ ఆ సెట్‌ను గెలవడంతో షూటాఫ్‌ అనివార్యమైంది. షూటాఫ్‌లో అద్భుతంగా రాణించిన పంజాబ్‌ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర మేఽధావి హర్విందర్‌ పదికి పది స్కోరు చేయగా..ప్రత్యర్థి ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించగలిగాడు. దాంతో 6-5తో (26-24, 27-29, 28-25, 25-25, 26-27) (10-8) భారత్‌ ఆర్చర్‌ కాంస్యం అందుకున్నాడు. ఇక సెమీస్‌లో వరల్డ్‌ నెం. 10 అమెరికా షూటర్‌ కెవిన్‌ చేతిలో 4-6తో హర్విందర్‌ ఓడాడు. అంతకుముందు ప్రీక్వార్టర్స్‌, క్వార్టర్స్‌లోనూ షూటా్‌ఫలకు వెళ్లగా..వాటిలో భారత ఆర్చర్‌ విజేతగా నిలవడం విశేషం.  

స్విమ్మింగ్‌లో నిరాశ..

పురుషుల 50 మీ. బటర్‌ఫ్లయ్‌ ఎస్‌-7లో సుయాష్‌ జాదవ్‌, నిరంజన్‌ ముకుందన్‌ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయారు. అథ్లెటిక్స్‌లో పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌-57లో సోమన్‌ రాణా (13.84 మీ.) నాలుగో స్థానంలో నిలిచాడు. మహిళల క్లబ్‌ త్రో ఎఫ్‌-51లో కాశిష్‌ లక్రా (ఆరోస్థానం), ఎక్తా భ్యాన్‌ (8వ స్థానం) విఫలమయ్యారు. మహిళల కనోయింగ్‌ 200 మీ. స్ర్పింట్‌ ఫైనల్‌ను ప్రాచీయాదవ్‌ ఎనిమిదో స్థానంతో ముగించింది. 


గూగుల్‌లో శోధించి..

హైజంపర్‌ ప్రవీణ్‌కుమార్‌కు అంగవైకల్యం పుట్టుకతో వచ్చింది. తుంటి ఎముకతో ఎడమ కాలు అనుసంధానమయ్యే ప్రాంతంలో లోపం ఏర్పడింది. అయితే అతడు ఏనాడూ దానికి చింతించలేదు. స్కూల్‌స్థాయికొచ్చే సరికి ప్రవీణ్‌కు ఆటలపై విపరీతమైన మక్కువ ఏర్పడింది. దాంతో పారా అథ్లెటిక్స్‌ కోసం నిరంతరం గూగుల్‌లో శోధించేవాడు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధనగర్‌ జిల్లా జెవార్‌ గ్రామం ప్రవీణ్‌ స్వస్థలం. అతడి తండ్రి పేద రైతు. ‘పాఠశాల జీవితంలో ఎక్కువగా క్రీడల గురించి ఆలోచించేవాడిని. పారా అథ్లెటిక్స్‌కు సంబంఽధించి గూగుల్‌లో నిరంతరం వెతికేవాడిని. అలా హైజంప్‌ దిశగా అడుగులువేసి ఈ స్థాయికి చేరా. అయితే నేడు పారాలింపిక్స్‌లో పతకం సాధించే స్థాయికి ఎదుగుతానని ఆ రోజుల్లో ఆలోచించలేదు’ అని ప్రవీణ్‌ అంటాడు. ‘జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే సమయంలో అశోక్‌ సైనీ సర్‌తో పరిచయం ఏర్పడింది. ప్రస్తుత కోచ్‌ సత్యపాల్‌ సర్‌ని కలిస్తే ఈ టీ-64/టీ-44విభాగాలలో తలపడాలని ఆయన సూచించారు. ఇది 2018లో జరిగింది’ అని ఢిల్లీ మోతీలాల్‌ నెహ్రూ కాలేజ్‌లో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న ప్రవీణ్‌ తెలిపాడు. అంతర్జాతీయ సర్క్యూట్‌ బరిలో దిగిన రెండో ఏడాదే ఒలింపిక్స్‌లో పతకం నెగ్గాడంటే ప్రవీణ్‌ సత్తా ఏపాటిదో అర్థమవుతుంది. గత ఏడాది కొవిడ్‌ బారిన పడిన ప్రవీణ్‌ లాక్‌డౌన్‌లో సరైన ట్రెయినింగ్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ కష్టాలను అధిగమించి పారాలింపిక్స్‌లో పతక విజేతగా నిలవడం విశేషం.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) 

అవని..ద లెజెండ్‌

రాజస్థాన్‌ యువ షూటర్‌, 19 ఏళ్ల అవని లేఖార తాను పాల్గొన్న తొలి పారాలింపిక్స్‌లోనే రెండు పతకాలు నెగ్గి లెజెండ్‌గా మన్ననలు అందుకుంటోంది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌-1 ఫైనల్లో అవని 445.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. జాంగ్‌ క్యూపింగ్‌ (చైనా, 457.9) కొత్త పారా రికార్డుతో స్వర్ణం, నటాషా హిల్‌ట్రాప్‌ (జర్మనీ, 457.1) రజత పతకం అందుకున్నారు. క్వాలిఫికేషన్‌లో 1176 పాయింట్లు స్కోరు చేసిన అవని రెండో స్థానంలో నిలిచింది. టోక్యోలో ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1లో పసిడి పతకం దక్కించుకున్న లేఖారకు ఇది రెండో మెడల్‌ కావడం విశేషం. దాంతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె ఖ్యాతి గడించింది. అవనికి ముందు జోగిందర్‌ సింగ్‌ ఒకే ఒలింపిక్స్‌లో రెండు కంటే ఎక్కువ పతకాలు నెగ్గిన భారత్‌ అథ్లెట్‌గా నిలిచాడు. 1984లో అతడు షాట్‌పుట్‌లో రజతం, డిస్కస్‌, జావెలిన్‌త్రోలో ఒక్కో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. ఇక.. దీపక్‌, సిద్ధార్థతో కలిసి మిక్స్‌డ్‌ 50 మీ. రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌-1లోనూ అవని అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


షట్లర్లు సూపర్‌

బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ల సూపర్‌ షో కొనసాగుతోంది. 11వ రోజు పోటీల్లో.. ముగ్గురు సింగిల్స్‌ ప్లేయర్లు సుహాస్‌ యతిరాజ్‌, తరుణ్‌ థిల్లాన్‌, మనోజ్‌ సర్కార్‌తోపాటు మిక్స్‌డ్‌లో ప్రమోద్‌ భగత్‌/పాలక్‌ కోహ్లీ ద్వయం తుది నలుగురిలో ప్రవేశించారు. ప్రమోద్‌ భగత్‌, కృష్ణ నాగర్‌ గురువారమే పురుషుల సింగిల్స్‌లో సెమీ్‌స చేరిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో భగత్‌/పాలక్‌ జోడీ 21-15, 21-19తో సిరిపాంగ్‌ టిమరోం/నిపాడా సెన్‌సుపా (థాయ్‌లాండ్‌) జంటపై నెగ్గింది. శనివారం జరిగే సెమీస్‌లో సుశాంతో/లియాన్‌ రాట్రి (ఇండోనేసియా)తో భారత జోడీ అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-4 కేటగిరిలో నోయిడా జిల్లా మెజిస్ట్రేట్‌ సుహాస్‌ 21-6, 21-12తో సుశాంతో (ఇండోనేసియా)పై, తరుణ్‌ 21-18, 15-21-17తో షిన్‌ యుంగ్‌ (కొరియా)పై నెగ్గారు. సెమీ్‌సలో సెటియవాన్‌తో సుహాస్‌, మజూర్‌తో థిల్లాన్‌ ఢీకొంటారు. ఎస్‌ఎల్‌-3 విభాగంలో మనోజ్‌ సర్కార్‌ 21-16, 21-19తో ఒలెక్సాండర్‌ (ఉక్రెయిన్‌)పై విజయంతో నాకౌట్‌కు చేరాడు. సెమీఫైనల్లో డానిల్‌ బెతెల్‌ (బ్రిటన్‌)తో మనోజ్‌ తలపడతాడు. ఇక దైసుకె ఫ్యుజీహారా (జపాన్‌)తో ప్రమోద్‌ సెమీ్‌సలో తలపడతాడు. ఎస్‌ఎల్‌-6 విభాగంలో కృష్ణ నాగర్‌ 21-17, 21-14తో గాన్‌క్లేవ్స్‌ (బ్రెజిల్‌)పై గెలిచి గ్రూప్‌ ‘బి’లో టాపర్‌గా నిలిచాడు. సెమీ్‌సలో క్రిస్టెన్‌ కూంబ్స్‌ (బ్రిటన్‌)ను నాగర్‌ ఢీకొంటాడు. మహిళల సింగిల్స్‌ ఎస్‌యూ-5 క్వార్టర్‌ఫైనల్లో పాలక్‌ కోహ్లీ 11-21, 15-21తో కెడా కమెయామ (జపాన్‌) చేతిలో ఓటమితో పోరాటాన్ని ముగించింది. అంతకుముందు మహిళల డబుల్స్‌ గ్రూప్‌ ‘ఎ’ ఎస్‌ఎల్‌-3, ఎస్‌యూ-5 కేటగిరిలో పాలక్‌/పరుల్‌ పర్మార్‌ 12-21, 20-22 తో మోరిన్‌/నోయల్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.